తీన్మార్ మల్లన్న అరెస్ట్ నేపథ్యం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీఆరెఎస్ శ్రేణులు సంబరాలే చేసుకున్నారు. చాలా మంది అరెస్టును ఖండించి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఒక ఎపిసోడ్ ప్రకారం ప్రణాళికబద్ధంగా ఇదంతా జరిగిందనేది మల్లన్న వర్గీయుల ఆరోపణ. మొత్తానికి సర్కారు ప్లానింగ్‌గా మల్లన్నను ఇరికించేసిందనే విషయం సాధారణ జనానికి కూడా అర్ధమైపోయింది.
ఈ క్రమంలో సోషల్ మీడియా పై మల్లన్న అరెస్ట్ గురించి ఎవరికి వారు తమకు తోచిన అభిప్రాయాలతో పోస్టింగుల మీద పోస్టింగులు గుమ్మరించారు. కొందరు హార్డ్‌కోర్ టీఆరెఎస్ అభిమానులు మరింత ముందుకు పోయి తమదైన శైలిలో మల్లన్న పై విరుచుకుపడ్డారు. “తెలంగాణ కాబట్టి బతికి పోయాడు.
అదే యూపీ అయితే పోలీసుల జీపు బోల్తా కొట్టేది” అని ఓ వీరాభిమాని పోస్టింగ్ పెట్టాడు. అంటే “నిన్ను ఎన్‌కౌంటర్ చేయలేదు.. బతికిపోయావు” అని ఓ వార్నింగ్ ఇచ్చాడన్నమాట. “ఎన్‌కౌంటర్ చేస్తే బాగుండేదేమో పీడాపోతుండే” అనే అర్ధం వచ్చేలా ఇంకొ మిత్రుడు.. “యూపీ, మహారాష్ట్ర అయితే పరిస్థితి వేరే ఉంటుండే” అని తన నిరాశను వ్యక్తపరిచాడు.
మల్లన్న పై టీఆరెఎస్ వర్గాల్లో ఎంత కోపం ఉన్నా, ఎంత కసి ఉన్నా మరీ ఇంతలా ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఎన్‌కౌంటర్ చేస్తేనే తప్ప మీ అహం చల్లబడదనే పరిస్థితికి వచ్చారా? మీ భావావేశాలను చల్లబర్చేందుకు అంతం చేయడం ఒకటే పరిష్కారమని భావిస్తున్నారా? ఇలాంటి విషయంలో యూపీ తరహా ప్రవర్తిస్తేనే మంచిదనే సంకేతాలు మన సర్కారుకు మీరేమైనా ఇస్తున్నారా? ఈ ఆలోచనలు ఎటు పోతున్నాయి? ఇప్పుడు తెలంగాణలో ఈ అంశం సమీక్షించుకోదగింది. సమర్ధించుకోవాల్సింది మాత్రం కాదు.
