బీఆరెస్ ఏర్పాటు… సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎక్కువ రోజులు లేక‌పోవ‌డం….. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌కు తెర తీసింది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లాంటిదే అనుకున్నా… హుజురాబాద్‌కు, మునుగోడుకు అస‌లు పోలికే లేకుండా హైప్ క్రియేట్ అయి కూర్చుంది. టీఆరెస్ గెలుపోట‌ముల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఏ ఇద్ద‌రు క‌లిసినా… ఓ ఫోన్ రింగ‌యినా… ఇదీ ఓ ప్ర‌ధాన టాపిక్‌గానే కొన‌సాగుతున్న‌ది. స‌హ‌జంగానే టీఆరెస్ పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త కూడా దీనికి తోడై త‌మ అభిప్రాయాల‌ను ఈ విధంగా కూడా వ్యాప్తి చేస్తున్నారు.

అక్క‌డ ఓటేసే ఓట‌రు నాడి ఎలా ఉందో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ వారి మ‌దిలో ఏముందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు డిసైడ్ చేసేసిన‌ట్టు మాట్లాడేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్‌లో మ‌ధ్యే ఉంది అని వాదించే వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ఓ వైపు బీఆరెస్‌కు క‌మ్యూనిస్టు పార్టీల మ‌ద్ద‌తు ఉండి, అధికార‌, అర్థ‌, అంగ‌బ‌లం ఉన్న పార్టీ గెలుపుపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం… రోజు రోజుకు ఈ వ్యాప్తి పెర‌గ‌డం చ‌ర్చించుకోవాల్సిన విష‌య‌మే.

హుజురాబాద్‌లో ఈట‌ల‌పై సానుభూతి ఉండి గెలిచాడ‌ని కొంద‌రు వాదిస్తే… ఈట‌ల క‌న్నా బ‌ల‌మైన నేత రాజ‌గోపాల్‌రెడ్డి మ‌రి కొంద‌రు…. కాంగ్రెస్‌ను అంత ఈజీగా తీసేయ‌కండి.. అక్క‌డ దాని బ‌లాన్ని త‌క్కువ చేసి చూడ‌లేం అని మ‌రికొందరు… ఎవ‌రికి వారే సొంత అభిప్రాయాల‌తో కూడిన తీర్పుల‌ను ఇచ్చేస్తున్నారు. చాయ్ హోట‌ల్‌, క‌ల్లు దుకాణం, వైన్స్‌… చోటు ఏదైనా కానీ ఓ న‌లుగురు క‌లిస్తే ఇదే ముచ్చ‌ట‌. టీఆరెస్ సహ‌జంగానే సోష‌ల్ మీడియాలో వీక్‌. దాన్ని ప‌ట్టించుకున్నవారు లేరు. ఇప్ప‌టికీ అంతే. బీజేపీదే ఇక్క‌డ పై చేయి. దీనికి తోడు ఇప్పుడు మౌత్ ప‌బ్లిసిటీ తోడ‌య్యింది టీఆరెస్‌కు యాంటీగా.