ఆ కాంట్రాక్ట్ ఫర్మ్‌ది ఏళ్ల ఘన చరిత్ర. వందల కోట్ల రూపాయల పనులు చేసిన అనుభవం. వేలాది మందికి పొట్ట నింపిన కంపెనీ. క్లాస్ వన్ కాంట్రాక్టర్‌ల లిస్టులో మొదటి వరుసలో ఉండి… మంచి పలుకుపడి సంపాదించిన వ్యవస్థ. ఇప్పుడా వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడంటే ఇప్పుడే కాదు… రెండేండ్లుగా. ఎందుకు..? ఏమైంది….? స్టోరీ పాతగానే అనిపించినా.. ఇది ఆసాంతం చదివితే మిమ్మల్ని కదిలిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థ కాంట్రాక్ట్ పనుల విషయంలో నిధుల లేమి కారణంగా చూపుతున్న ఫలితం కళ్లకు కనిపిస్తుంది. అభివృధ్ది, సంక్షేమం.. అని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటుంది కదా…. అభివృధ్ది అంటే కాంట్రాక్టు పనులే కదా. మరి అవి ఎలా జరుగుతున్నాయో తెలుసా..? పనులు చేసిన వాడి పరిస్తితి ఎలా ఉందో మీకు తెలుసా..? బిల్లుల చెల్లింపులకు ఎంతటి కాలం పడుతుందో అంచనా వేయగలరా..? ఈ వ్యవస్థ కుప్పకూలితే దీనిపై ఆధారపడ్డ ఎన్ని రంగాలు కుదేలవుతాయో ఎప్పుడైనా ఆలోచించామా..? మరీ సోదీ పెద్దగా ఉందా..? అయితే అసలు కథకు వద్దాం. ఉన్నదున్నట్టుగా…
అది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్ట్ ఫర్మ్. ఆ పేరంటే తెలియని డిపార్టుమెంటు లేదు. అధికారులు లేరు. లీడర్లు లేరు. మూడు దశాబ్దాలుగా కాంట్రాక్టు వ్యవస్థలో మకుటం లేని మహాకంపెనీగా వెలిగిపోతూ వచ్చింది. రోడ్లుమొదలుకొని బిల్డింగులు… ఏవైనా సరే కోటి రూపాయల నుంచి వందల కోట్ల వరకు ఎంతైనా సరే.. ఆ కంపెనీ టెండర్లు దక్కించుకుని చేసి పెడుతుంది సకాలంలో. ఎక్కడా రిమార్కు లేకుండా. ఆ కంపెనీ నమ్ముకుని వందల మంది ఉపాధి పొందుతున్నారు. ఎన్నో మిషనరీలు.హాట్ మిక్స్ ప్లాంట్లు. టిప్పర్లు…. అన్నీ.. అన్నీ .. కాంట్రాక్టు పనులకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ అంతా వారి సొంతం. వరుసగా ఐదారు పనులు చేతిలో ఉన్నా.. అన్నింటినీ చక్కదిద్ది.. చక్కగా, నాణ్యతగా సకాలంలో చేసి అధికారులతో శభాష్ అనిపించుకుంటుందీ ఫర్మ్.
కానీ రెండేండ్లుగా ఇది మూతపడ్డది. మూత పడేశారు. ఆ ఫర్మ్ యజమాని కాదు. ప్రభుత్వం. ఏంటీ..? మధ్యలో మా సర్కారేం చేసిందిరా బై… మాట్లాడితే మా మీది పడతవ్ అని అనుకుంటున్నారా..? ఏం జరుగుతుందో మీకూ తెలుసు గానీ. చెప్పేది పూర్తిగా వినండి… కాదు చదవండి. కోట్ల రూపాయల అప్పులు తెచ్చి చేస్తే బిల్లులు రాక ఏండ్లు గడుస్తున్నాయి. మిత్తిలు పెరిగాయి. ఆఖరికి జీతగాళ్లకు, డ్రైవర్లకు కూడా జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఇది చాలదంటూ లోకల్ ఎమ్మెల్యేకు 5 శాతం పర్సెంటీజీ కమిషన్‌గా. ఏఈ నుంచి మొదలుకొని డీఈ, ఈఈ, ఎస్ ఈ, సీఈ.. వీళ్లు చాలదంటూ పోలీస్, ప్రెస్…. ఇంకా కొత్తగా జీఎస్టీ పేరుతో వేధింపులు… కోట్లలో పెండింగ్ బిల్లులు, చేతిలో చిల్లి గవ్వ లేదు. తినేందుకు తిండి కరువయ్యే పరిస్థితి. ఉన్నదమ్ముకుని ఊరికి దూరంగా పోయినా.. నెల వచ్చే సరికి రెంటు కట్టేందురకూ ఇబ్బందే…
ఇప్పుడా ఫర్మ్ లేదు.మూతపడ్డది. దీని మీద ఆధారపడ్డ వాళ్లు రోడ్డున పడ్డారు. మిషనరీలు అమ్ముకున్నారు. ప్లాంట్లు పరాయిపాలయ్యాయి. చేతిలో పెండింగ్ బిల్లులున్నాయి. తలకుమించిన భారంలా అప్పులు వేధిస్తున్నాయి. మిత్తిలో మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి. అదెప్పుడు గొంతుక కోస్తుందో తెలియదు. ఊపిరి ఎప్పుడు ఆగుతుందో తెలియదు.
ఓ పెద్ద ఫర్మ్ పరిస్తితే ఇలా ఉంటే.. చోటా మోటా కాంట్రాక్టర్ల పరిస్థితి ఇంకా చెప్పాలా.. దారుణం అనే పదాలు కొన్నింటికి సరిపోవు… వర్ణించడమూ రాదు. అంతే అప్పుడు తెలంగాణ కోసం భరించాం.. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం తనువులు చాలిస్తాం. అంతే మనమెప్పుడు త్యాగధనులమే.