దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా…. పద్నాలుగేళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత సుప్రీం కోర్టు హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుల విషయంలో సానుకూల తీర్పును వెలువరించింది. అంతా బాగుందని సంబురాలు చేసుకుంటున్న ఆ 1200 మంది ఈ లాల్ హౌజింగ్ సొసైటీ సభ్యులకు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వాస్తవంగా ఈ తీర్పు ఇందులోని సభ్యులైన 1200 మంది జర్నలిస్టులకే వర్తిస్తుంది. కానీ, జర్నలిస్టు యూనియన్ నాయకులు .. అక్రిడేషన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇప్పిస్తామని ఎవరికి వారే ఆశలు కల్పించడం మొదలు పెట్టారు. దీంతో హైదరాబాద్‌లో పనిచేస్తూ అక్రిడేషన్ ఉన్న ప్రతీ జర్నలిస్టూ తనకు ఇంటి స్థలం వస్తుందని సంబురాలు చేసుకుంటూ భ్రమల్లో మునిగితేలుతున్నాడు. యూనియన్ నాయకులకు పాలాభిషేకాలు చేస్తూ వారిని ప్రసన్నంచేసుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఎవరూ ఎవరికీ చెప్పడం లేదు. తీర్పు వర్తించే 1200 మంది జర్నలిస్టులకే ఇంటి స్థలం ఎంత కేటాయించాలి..? అనే విషయంలో ఇంకా స్ఫష్టత లేదు. వీటిని కేటాయించే విషయంలో ఎంతటి తాత్సారం జరుగుతుందో తెలియదు. ఎన్ని రాజకీయాలు నడుస్తాయో తెలియదు. ఎన్ని ఆటంకాలు ఏర్పడుతాయో తెలియదు. పద్నాలుగేళ్లు నీరిక్షించిన వారికే దిక్కులేదంటే.. కొత్తగా వచ్చి అక్రిడేషన్‌పొందిన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు యూనియన్ నాయకులు ఆశలు కల్పించి వదిలేశారు. వారంతా భ్రమల్లో మునిగితేలుతున్నారు. ఆశల పల్లకీల్లో ఊరేగుతున్నారు పాపం..!
ఇదీ దీని కథా కమామీషు…!
2000 సంవత్సరం నుంచి వివిధ జర్నలిస్టుల సంఘాలు ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తూ వచ్చారు.
రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోఆయన సలహా మేరకు అన్ని యూనియన్ల నాయకులంతా ఐక్యంగా 2008లో జవహార్‌లాల్ హౌజింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 1200 మంది సభ్యులుగా చేరారు. అప్పటి సీనియార్టీ ప్రాతిపదికన ఇందులో సభ్యులుగా చేర్చుకున్నారు. మొత్తం 1.03 కోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. కానీ ఓ సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త దీనిపై అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులకు మంచి నివాసాలు ఉండగా… మళ్లీ ప్రభుత్వం స్థలం ఎందుకు కేటాయించాలి..? అని పిటిషన్ వేశాడు. దీనిపై జర్నలిస్టు యూనియన్ నాయకులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీం కింద జర్నలిస్టలకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. అప్పటికే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బాచుపల్లి, నిజాంపేట్‌లలో కొన్నివేల ఎకరాల స్థలం కేటాయించింది. కాగా సుప్రీంలో అప్పట్నుంచి ఇది పెండింగ్‌లో ఉంది. ఈలోగా కొంత మంది జర్నలిస్టులు చనిపోయారు కూడా.
తెలుగువాడు, పూర్వాశ్రమంలో జర్నలిస్టులగా పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ తన రిటైర్‌మెంటుకు మరో రెండు రోజులుండగా.. సీనియర్ జర్నలిస్టులు ఆయనను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన సానుకూలంగా విని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో తీర్పు వెలువరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ పిటిషన్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రస్తావన తీసేసి.. జర్నలిస్టులు నిరుపేదలు కాబట్టి వారికి ఈ ఇళ్ల స్థలాలను కేటాయించాల్సిందేనని తీర్పు వెలువరించారు. ఇక ఇక్కడ నుంచి కథ మొదలైంది. కొత్త మలుపు తిరిగింది. అందరికీ ఆశలు పెరిగాయి. యూనియన్ల నాయకులు అందరికీ ఇప్పిస్తామని ఆశలు కల్పించారు. ఈ విజయం మాదంటే మాదంటూ డప్పు కొట్టుకున్నాయి. అక్రిడేషన్ ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పేసుకున్నారు. పద్నాలుగేళ్లు పోరాటం చేసిన వారికే ఇంకా దిక్కులేదంటే.. ఇప్పుడు కొత్త సమస్యను క్రియేట్ చేసి పెట్టారు యూనియన్ నాయకులు….
ఈ తీర్పు కేవలం అప్పటి జవహార్ లాల్ హౌజింగ్ సొసైటీలో సభ్యులుగా ఉన్న 1200 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులకు మాత్రమే….
ఇది మన హైదరాబాద్ జర్నలిస్టులు గమనించాలి.
భ్రమలు వీడాలి.
ఆశలు వదులుకోవాలి….. నాయకుల మాటలు వింటే నిరాశ, నిస్పృహలే… అంతే..!!
దండుగుల శ్రీనివాస్
(Dandugula Srinivas)
