ఆప‌ద వ‌స్తే అండ‌గా ఉంటే చాలు స‌గం ఆప‌ద క‌రిగిపోతుంది. అలాంటి నాయ‌క‌త్వ‌మే విప‌త్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విప‌త్తులైనా వెరువ‌కుండా ఉంటారు జ‌నాలు. విప‌త్తును మించిన ఆప‌త్కాలం ఏముంటుంది..? అప్పుడే క‌దా మా నాయ‌కులెక్క‌డ‌..? మా ఓట్ల‌తో గెలిచిన నేత‌లు ఎక్క‌డా..? అని ప్ర‌జ‌లు ఎదురుచూసేది. నేత‌లు కూడా ఇప్పుడు కాక మ‌రెప్పుడు జ‌నాల‌తో ఉండేది. అలా విప‌త్తు వేళ‌ల్లో జ‌నాల వెంట ఉండే విలువైన నాయ‌క‌త్వాన్ని అరుదుగా చూస్తామ‌ని చెప్పుకోవ‌డంలో ఎటువంటి సందేహం అక్క‌ర‌లేదు. అలాంటి నాయ‌క‌త్వం త‌న ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న నాయ‌కుడే రాష్ట్ర మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి. ప్రాణాంత‌క విప‌త్తు క‌రోనా స‌మ‌యంలో, వందేండ్ల చ‌రిత్ర‌లో లేని తాజా వ‌ర‌ద‌ల విప‌త్తులోనూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జ‌నం కోసం,.. జ‌నం వెంట ఉన్న తీరే ఇందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. వ‌ర‌ద‌లు పోటెత్తి జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌ల‌మ‌వుతుంటే వెంట‌నే క‌ద‌న‌రంగంలోకి దిగారు. ఎస్సారెస్పీకి చ‌రిత్ర‌లో లేని విధంగా వ‌ర‌ద వ‌స్తుంటే ప్రాజెక్టు పైన‌నే ప‌రిస్థితిని స‌మీక్షించి సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. గోదావ‌రి ప‌రివాహాక గ్రామాల‌లో అధికార యంత్రాంగాన్ని మోహ‌రించారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను సైనికుల్లాగా అధికార యంత్రాంగానికి స‌హాయకంగా నిలిపారు.

నిద్ర లేకుండా అర్ధ‌రాత్రి ఎంత స‌మ‌యం అవుతుందో అని కూడా మ‌రిచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క‌లెక్ట‌ర్‌, ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షిస్తూ, వారికి దిశానిర్దేశం చేస్తూ ఉండిపోయారు త‌ప్ప‌…అధికారుల‌కు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుని నిద్ర‌పోలేదు. నిజామాబాద్ న‌గ‌రం లోత‌ట్టు ప్రాంత జ‌న‌జీవ‌నం వ‌ర‌ద‌లో ఆగ‌మ‌వుతుంటే వారి వ‌ద్ద‌కే వెళ్లి .. వాన‌లో త‌డుస్తూ మోకాలి లోతు నీళ్ల‌లో న‌డుస్తూ ప‌రిస్థితిని స‌మీక్షించి పున‌రావాస చ‌ర్య‌ల‌ను వేగంగా అమ‌లు చేయించారు. అడుగు తీసి అడుగు బ‌య‌ట పెట్ట‌లేని ఆరు రోజుల వాన , వ‌ర‌ద‌లో త‌మ కోసం ఎవ‌రొస్తారులే అన్న నిస్స‌హాయ ఎదురుచూపుల్లో మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి జ‌నాల ముందు నిలువెత్తు విలువైన నాయ‌క‌త్వంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

క‌రోనా విప‌త్తులోనూ మంత్రిగా ఆయ‌న అందించిన సేవ‌లు పార్టీలు, రాజకీయాల‌కు అతీతంగా మ‌న్న‌న‌లు పొందిన విష‌యం తెలిసిందే. తాను, త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆప‌న్నుల‌కు, క‌రోనా వారియ‌ర్ల‌కు , రాష్ట్రాల‌ను దాటి కాలిన‌డ‌క‌న సొంత రాష్ట్రాల‌కు వెళ్లేబాట‌సారుల‌కు అన్న‌దాత‌గా నిలిచారు. జిల్లా కేంద్ర ద‌వ‌ఖాన‌లో క‌రోనా ప్ర‌త్యేక విభాగం, సిబ్బంది పెంపు, రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ల నిల్వ‌లు అందుబాటులో ఉంచ‌డం, ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చేయ‌డం లాంటివి ద‌గ్గ‌రుండి చేశారు. క‌రోనా లాంటి మ‌హ‌మ్మారితో ఓ ఒక్క‌రూ ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోకూడ‌ద‌నే ల‌క్ష్యంతో త‌న స‌తీమ‌ణి స‌హ‌కారం, త‌న మిత్రుల‌తో స‌హ‌కారంతో ఏకంగా ప్ర‌భుత్వ ద‌వ‌ఖాన‌ల్లో కోటిన్న‌ర రూపాయ‌ల‌తో ఆక్సిజ‌న్ ప్లాంటు , ఆక్సిజ‌న్ బెడ్లు ఏర్పాటు చేయించిన ఏకైక నాయ‌కుడు ప్ర‌శాంత్‌రెడ్డి. అందుకే విప‌త్తు వేళ విలువైన నాయ‌కుడు ప్ర‌శాంత్‌రెడ్డి.

You missed