నిజామాబాద్‌లో కొత్త క‌లెక్ట‌రేట్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. త్వ‌ర‌లో అంటే త్వర‌లోనే. ఎప్పుడ‌ని అడ‌గొద్దు. ఆలోగా ఇలా అక్ర‌మార్కులు కొత్త ఉద్యోగాల పేరుతో ల‌క్ష‌లు వ‌సూళ్లు చేశారు. నిజామాబాద్ ట్రెజ‌రీ ఆఫీసులో ప‌నిచేసే రాజేశ్ అనే ఉద్యోగి ఎంతకు బ‌రి తెగించాడంటే… త‌ను ఉద్యోగాలిప్పిస్తాన‌ని డ‌బ్బులు వ‌సూలు చేసిన విష‌యాన్ని బ‌జాప్తా బాండ్ పేప‌ర్ మీదే రాసిచ్చాడు. అంత‌టి ధైర్యం ఓ సామాన్య ఉద్యోగికి ఎలా వ‌చ్చిదంటారా..? వెనుక పెద్ద‌ల హ‌స్త‌మే ఉంది.

పీఆర్‌టీయూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న ఓ లీడ‌ర్ దీని వెనుక చ‌క్రం తిప్పాడు. మాట్లాడితే అధికార పార్టీ ముఖ్య నేత త‌న‌కు చుట్టమంటాడు. ఎవ‌రు అడిగినా అడ‌గ‌కున్నా.. త‌నే ఆ విష‌యాన్ని మ‌రీ చెబుతాడు. అలా బ‌హుళ ప్రాచుర్యాన్ని పొందాడు. మేరా పీచే కౌన్ హౌ మాలూమ్ అనే టైప్ క్యారెక్ట‌ర‌న్న‌మాట‌. ఇక ఇందూరులో కీల‌క నేత ద‌గ్గ‌ర ప‌నిచేసే ఓ పీఏ పేరు కూడా ఇందులో వినిపించింది. అత‌ను పేరు చెప్పి తెర వెనుక నాట‌క‌మాడారు. ముందు ఈ రాజేశ్‌ను ఉంచి బాండ్ పేప‌ర్ కూడా రాసిచ్చారు. అస‌లు విష‌యం ఏంటంటే .. అక్క‌డ ఉద్యోగాలే లేవు. ఇంత జ‌రిగినా క‌లెక్ట‌ర్‌కు తెలియ‌దు. అధికార యంత్రాంగానికి తెలియ‌దు. బాధితులు వ‌చ్చి ఈ రాజేశ్‌కు దేహ‌శుద్ది చేసే దాకా బ‌య‌ట ప్ర‌పంచానికే ఈ విష‌యం తెలియ‌దు. తెలియ‌గానే క‌లెక్ట‌ర్ హ‌డావుడిగా ఎంక్వైరీ చేయిస్తున్నాడు.