జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు……
భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి…

నెల‌కు 800 జీతంతో మొద‌లు పెట్టి….. బిల్డ‌ర్‌గా రాణించి… అమాత్యుడిగా అంద‌రి మ‌న్న‌న‌లు అదుకుంటున్న ప్రశాంత్ రెడ్డి..

ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మ వేదిక‌గా త‌న మ‌నోగ‌తం పంచుకున్న మినిష్ట‌ర్‌…

 

ఆయన ఇంజినీరింగ్ చ‌దివేట‌ప్పుడే నెల‌కు వెయ్యి ఖ‌ర్చు చేసేవాడు. కానీ జీవితంలో స్థిర‌ప‌డాల్సిన వ‌చ్చిన సంద‌ర్భంలో నెల‌కు 800 జీతం చేయ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. అంత‌కు ముందు అత‌ని తండ్రి బిజినెస్ కోసం త‌న‌కు ప‌ది ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరితే.. నీకు డ‌బ్బు విలువ తెలియ‌దు… నీకు నేను ఇవ్వ‌ను.. అనే మాట‌లు అత‌నిలో ప‌ట్టుద‌ల‌ను పెంచాయి. ఎలాగైనా క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించాల‌నుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు క‌ష్టం తెలియ‌కుండా పెరిగిన వ‌య‌స్సు. కానీ తండ్రి మాట‌లు అత‌నిలో నిగూఢంగా దాగి ఉన్న టాలెంట్‌ను, ప‌ట్టుద‌ల‌ను, సృత‌నాత్మ‌క‌త‌ను బ‌య‌ట‌కు తీశాయి. హైద‌రాబాద్ ప‌య‌న‌మ‌య్యాడు. త‌ను న‌మ్ముకున్న స్వ‌యంకృషినే ఆలంభ‌నగా చేసుకున్నాడు. ఓ ఆర్కెటెక్ట్ వ‌ద్ద నెల‌కు 800 జీతానికి కుదిరాడు. తోటి స్నేహితులు అత‌నిది దుస్థితిగా భావించారు. కొంద‌రు హేల‌న చేశారు. అయినా ప‌ట్టించుకోలేదు. చేసే ప‌ని మ‌న‌సు పెట్టి చేశాడు. రోజుకు 16 గంట‌ల‌కు అలుపెర‌గ‌ని శ్ర‌మ‌ను జోడించి మంచి ఫ‌లితాల‌ను సాధించి… త‌న బాస్ వ‌ద్ద మంచి మార్కులు కొట్టేశాడు. శ‌భాష్ అనిపించుకున్నాడు. క‌ష్టేఫ‌లి అని నమ్మిన సిద్దాంతంతో ముందుకు సాగుతున్న అత‌నికి వ‌ద్ద‌కే ఓ అవ‌కాశం వెతుక్కుంటూ వ‌చ్చింది. ఓ కోటిరూపాయ‌ల హాస్పిట‌ల్ నిర్మాణం చేసే కాంట్రాక్ట్ ద‌క్కింది. చేతిలో చిల్లిగ‌వ్వ లేదు… భార్య మెడ‌లోని బంగార‌మంతా తాక‌ట్టు పెట్ట‌గా వ‌చ్చిన ల‌క్ష‌న్న‌ర‌తో ప‌ని మొద‌లు పెట్టాడు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు… నిర్మాణ రంగంలో త‌న ముద్ర వేసుకున్నాడు. కోట్ల‌కు ఎదిగాడు. అనుకున్న‌ది సాధించాడు. ఆయ‌నెవ‌రో కాదు…

అకుంఠ దీక్ష‌తో ఎదిగి.. స్వ‌యంకృషితో త‌న‌ను తాను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకుని ఇప్ప‌డు మంత్రిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్న వేముల ప్ర‌శాంత్ రెడ్డి

ద‌ళిత‌బంధు ప‌థ‌కం పంపిణీ కార్య‌క్ర‌మాల్లో మంత్రిగా పాల్గొన్న వేళ ఓ వేదిక‌గా ఆయ‌న త‌న మ‌నోగ‌తాన్ని పంచుకున్నాడు. త‌ను ఎద‌గిన వైనాన్ని క‌ళ్లముందుంచాడు. అంద‌రికీ ఆద‌ర్శంగా నిల‌వాల‌ని, వ్యాపార‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఆయ‌న ప్ర‌సంగం అంద‌రిలో స్పూర్తి నింపింది.
ఆ అనుభ‌వ మాట‌ల పాఠాలు.. ఆయ‌న మాట‌ల్లోనే……

30 ఏండ్ల క్రితం మాది పెద్దకుంటుంబం. ఆర్థికంగా ఉన్న కుటుంబం. నాన్నకు 100 ఎకరాల భూమి ఉండే.
ఇంజనీరింగ్ చదివిన నేను… 10 లక్షలు ఇవ్వు నేను బిజినెస్ చేసుకుంటా అని మా నాన్న ను అడిగా….
డబ్బు విలువ నీకేం తెలుసూ… కొన్ని డబ్బులు సంపాదించి చూపెట్టు అంటూ.. నాన్న డబ్బులు ఇవ్వలేదు.
నాన్న డబ్బులు ఇవ్వలేదని నా మనసు గాయపడింది. జిద్దు తో హైదరాబాద్ పోయా..
ఆర్కిటెక్ట్ దగ్గర నెలకు 800 జీతానికి పనిలో చేరా. నా తోటి దోస్తులు నవ్విండ్రు.
నేను అప్పుడే విద్యార్థిగా నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే వాడినీ..

ఒక నెల పని చేశా… ఆ పని లో మజా కనిపించింది. అలా రోజుకు 16 గంటలు పని చేశా. నా పని చూసి యజమాని ప్రతి మూడు నెలలకు జీతం పెంచాడు. అలా నాలుగు సంవత్సరాలు రాత్రింబవళ్ళు పని చేశా.
800 ల నుంచి 16 వేల జీతం పెరిగింది. హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఇంజనీర్ కు 16 వేల జీతం ఉన్నది నాకే.

అదే సమయంలో లండన్ నుంచి వచ్చిన ఒక డాక్టర్ హైదరాబాదులో ఒక కోటి రూపాయలతో హాస్పిటల్ కట్టాలనీ మా బాస్ ను సంప్రదించాడు.
మా బాస్ నమ్మకంతో ఆ వర్కు కాంట్రాక్ట్ ను నాకు ఇచ్చాడు. మొదట్లో డాక్టర్ నన్ను చూసి ఇతను కడతాడా లేడా అని అనుమాన పడ్డారు.

కాంట్రాక్టర్ గా అప్పుడు నాకు పెట్టుబడి కావాల్సి వచ్చింది.
నాన్నను మొదట్లో అడిగితే డబ్బు ఇవ్వలేదని.. నాన్న వద్దకు ఆర్థిక సహాయం కోసం వెళ్లలేదు. అప్పుడే నాకు పెళ్లయి నాలుగు నెలలు అవుతోంది. నా భార్య మీద ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన లక్షలన్నర రూపాయలతో పని ప్రారంభించా. పనులు ప్రారంభించే సమయంలోనే అనుకున్నా హైదరాబాదు లోనే అతిపెద్ద బిల్డర్ నేనే కావాలని. 25 సంవత్సరాలలో నాలుగు వేల ఇల్లు కట్టి అమ్మా . హైదరాబాదులో ప్రశాంత్ రెడ్డి అంటే మంచి బిల్డర్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు తరతరాలకు సరిపోయే కోట్ల ఆస్తి ఉంది.

జిద్దుతో పని చేస్తే దక్కిన నా విజయమే మీకు స్ఫూర్తి కావాలి.
మీ పనిని మీరే సొంతంగా చూసుకోవాలి. మీ వాహనాలను మీరే నడిపించాలి.
లక్షన్నర పెట్టుబడితో కరోడ్పతి అయినట్లే
.. 10 లక్షల పెట్టుబడితో మీరు కోటీశ్వరులు కావాలి.

You missed