యాసంగిలో వరి వయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్రత్యామ్నాయం వదిలి వరికే మొగ్గు చూపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లు పూర్తయ్యాయి. దాదాపు 80 శాతం వరికే మొగ్గు చూపింది రైతాంగం. ఇరవై శాతం మాత్రమే ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. యాసంగిలో వరిసాగుతో వచ్చే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నది.
వానాకాలం సీజన్‌కు చెందిన బియ్యాన్నే కొనుగోలు చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టిన కేంద్రం…. యాసంగిలో ఒక్క బియ్యం గింజ కూడా కొనేలా లేదు.ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంటు కూడా చేయించుకున్నది. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన కేసీఆర్.. వరి వేసుకుంటే తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని, ధాన్యాన్ని అసలే కొనుగోలు చేయమని, ముందుగా మిల్లర్లతో ఒప్పందం ఉంటేనో… బయట విక్రయంచుకునే సామర్థ్యం ఉంటేనో తప్ప వరి వేయొద్దని పదే పదే చెప్పింది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండని చెప్పంది కానీ.. దానికి ఎలాంటి ప్రోత్సహకాలు.. విధి విధానాలు, ప్లానింగూ ప్రకటించలేదు. కేవలం ప్రచారానికే పరిమితమైంది.
మాటలు చెప్పినంత ఈజీ కాదు.. వరి వద్దంటే అనే విషయం కేసీఆర్ కూ తెలుసు. ఎందుకంటే వరి తప్ప వేరే పంటలు వేసుకునే పరిస్తితి లేదు. రైతులూ అందుకు రెడీగా లేరు. యాసంగి సీజన్ దాదాపుగా పూర్తయింది. వరి సాగు 80 శాతం విస్తీర్ణంలో సాగులోకి రానుంది. మిల్లర్లు ఓ 30శాతానికి మించి కొనలేరు. మరి మిగిలిన 50శాతం సాగయిన వరి పరిస్థితి ఏందీ..? ఆ ధాన్యాన్ని రైతులు ఎవరికి అమ్ముకోవాలి..? వరి ఎవరికి ఉరి కానుంది…?
ఇటు వరి రైతుతో పాటు టీఆరెస్‌కు, బీజేపీకి కూడా వరి గుదిబండలా మారనుంది. రైతు నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయదు. మిల్లర్లు మద్దతు ధర ఇవ్వరు. సగం ధరకు అమ్ముకుంటారు. ధాన్యమంతా కొనే సామర్థ్యం మిల్లర్లకు లేదు. మిగిలిన ధాన్యంతోనే వస్తుంది అసలు సమస్య. ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలకు రెడీ అంటాయి.. కానీ ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి. ప్రతిపక్షాలు చేసిన ఆందోళన ఆ పార్టీలకే మైలేజీ ఇస్తాయేమో గానీ, రైతులకు వచ్చే లాభం లేదు.
టీఆరెస్‌కు ఇబ్బందికరంగానే ఉంటుంది. రైతుల నుంచి ఆగ్రహం ఎదుర్కోక తప్పదు. లీడర్లకూ రైతుల నుంచి సెగ తగులుతుంది. బీజేపీకి అంతంత మాత్రంగానే రాష్ట్రంలో ఉనికి ఉన్నా…. దానిపైనా రైతులు గుర్రుగానే ఉన్నారు. ఉన్నపళంగా యాసంగిలో వరి సాగు వద్దనే విధంగా నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ వల్లే ఇదంతా జరుగుతుందని వారికి తెలుసు. కేసీఆర్ కూడా ఏమీ చేయలేడనీ తెలుసు. కానీ నేరుగా రైతులకు సంబంధాలు, నమ్మకం, విశ్వాసం ఉండేది టీఆరెస్పైనే. కేసీఆర్ మీదే. తమ కోపాన్ని ప్రత్యక్షంగా చూపించేది కేసీఆర్ మీదే. దీంతో ప్రభుత్వానికి ఈ వరిసాగు
సమస్య మెడమీద కత్తిలా వేలాడుతూ ఉంది.