కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించిన నేపథ్యంలో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నది టీఆరెస్. అన్ని నియోజకవర్గాల్లో ఈ సంబురాలు జరుగుతున్నాయి. రైతులు, టీఆరెస్ శ్రేణులు కలిపి ఈ వారోత్సవాల్లో పాల్గొంటున్నారు.
ఈ వారోత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియా వేదికగా రైతుబంధు ద్వారా లబ్దిపొందిన చిన్న, సన్నకారు రైతుల కేస్ స్టడీస్‌ను ఆమె సేకరిస్తున్నది. సంక్షిప్తంగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు అందజేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నది. రైతు పేరు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు… ఆ రైతు చిరునామా…. పెట్టుబడి సాయం ఆ రైతుకు ఎలా ఉపయోగపడింది. ఆ రైతు అభిప్రాయం అతని మాటల్లో సంక్షిప్తంగా వివరిస్తూ సాగు చేసిన ఆ పంటతో సహా ఆ రైతు ఫోటోను తన ఫేస్బుక్ వాల్ పై పోస్టు చేస్తున్నారు.
ఇలా రోజుకొకరు చొప్పున ఒక్కో మండలంలో ఒక్కో కేస్ స్టడీ తీసుకుంటున్నారు. ఇందులో పేద చిన్న, సన్నకారు రైతులే ఉండటం గమనార్హం. ఈ వినూత్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది.