ప్రజలు తెలివిమీరి పోయారు. రాజకీయ నాయకులు ఎన్ని వేశాలు వేసుకొచ్చినా వినేలా లేరు. ఎన్ని సర్కర్్ ఫీట్లు చేసినా కనికరించేలా లేరు. కడుపులో తలపెట్టి వేడుకున్నా.. అవతలికి పోగానే మనసు ఎటు మారుతుందో తెలియదు. ఇచ్చింది తీసుకంటాం.. నచ్చినోడికి ఓటేస్తాం..అనే పాలసీ పక్కాగా అమలవుతూ వస్తోంది. అతలోడికన్నా పైసలెక్కువిచ్చినం కదా.. మందు పీకలదాకా రోజు పట్టించినం కదా.. అని నిలదీసి అడిగే పరిస్థితులు లేవు. మీ ఖర్మకు ఎంతైనా పెట్టండి. మా ఇష్టానికి మమ్మల్నొదిలేయండి.. దిమ్మ దిరిగే తీర్పు మాత్రం గ్యారెంటీ అని సంకేతాలిస్తున్నారు. అవే ఫలితాలు వెల్లడవుతున్నాయి.
అందుకే ఇప్పుడు తెలివిమీరిన ప్రజల వద్ద రాజకీయ మేథో సంపత్తి పని చేయడం లేదు. అతి తెలివి వ్యూహకర్తలు కావాలి. అందుకే పీకే లాంటి కనికట్టు, సానుభూతి, బోల్తా కొట్టించే , బుట్టలో పడేసే, మోసం చేసైనా గెలిచే… లాంటి అస్త్ర శస్త్రాలు అర్జంటుగా అవసరం పడుతున్నాయి. అందరితో పాటు మన టీఆరెస్‌కు కూడా. మన కేసీఆర్‌కు కూడా పీకే అవసరమయ్యాడు. కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త ఉంటాడా? జనం నాడి ఈయనక్నా ఎక్కువ ఎవరికి తెలుసు..? అనుకున్నారంతా నిన్నటి వరకు.
కానీ ఇప్పుడు కేసీఆర్ మాటలు జనాలు వినేలా లేరని ఆయన ఒప్పుకున్నాడు. అందుకే పీకేల పంచన చేరి మీ డైరెక్షన్‌లో యాక్టింగ్ చేసి.. సినిమా రిలీజ్ చేద్దాం.. అది కచ్చితంగా హిట్టై కూర్చోవాలి. అంతే. నువ్వేం చేస్తావో తెలియదు. మళ్లీ గెలవాలి. మా పథకాలు మాకున్నాయి. బోలెడు కొత్త ఉచిత పథకాలు సంధిస్తాం. ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉచితాలతో మ్యానిఫెస్టోనే కుడుపుబ్బి చచ్చేలా వండి వారుస్తాం. అంతే ఓకే. కానీ మాకు డౌట్. ప్రజలు అంగీకరిస్తారా? మళ్లీ మమ్మల్ని స్వీకరిస్తారా? అధికారం కట్టబెడతారా? ఈ అనుమానంతోనే నీ చెంత చేరింది.
వెయ్యి కోట్లు ఖర్చుకానీ, చేతి విరుగ్గొట్టుకోమన్నా.. కాలు బెణికిందని కట్టుకోమన్నా.. ప్రమాదం జరిగి తృటిలో ప్రాణాపాయం తప్పిందనే బిల్డప్ ఇవ్వమన్నా.. నువ్వు ఏ చిల్లర టెక్నిక్ చెబితే దానికి మేం రెడీ. అవునూ.. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఏనాడో చేసి చూపాడే. కానీ అప్పుడు బాబును అలిపిరి బాంబు కూడా కాపాడలేదే… కొత్త డౌట్లు ఎందుకు గానీ, నువ్వు వెయ్యి చంద్రబాబుల దిమాఖ్ ఉన్నోడివి. నీ మీద నమ్మకం ఉంది. కానియ్.. ప్రొసీడ్. స్క్రిప్ట్ రెడీ చేసుకో… త్వరలో షూటింగ్ ప్రారంభిద్దాం.