వాళ్లంతా గిరిపుత్రులు. గురుకులాల్లో ఇంటర్ వరకు చదివారు. ఉన్నత చదవుల కోసం మంచి అవకాశాలు వచ్చాయి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్తోమత లేదు. పైసలు కావాలె. ఎలా..? సర్కార్ వారి పత్రిక నమస్తే తెలంగాణ వీరి బాధ అర్థం చేసుకున్నది. ఎవరైనా దయామయులుంటే ఫీజులు కట్టండని వేడుకుంటున్నది ఓ స్టోరీ రూపకంలో. మా పని (ప్రభుత్వం) ఇంటర్ వరకు చదివించడం అయిపోయింది.. ఉన్నత చదవులు.. వారి వారి వ్యక్తిగతం మేమేం చేస్తాం.. ఎవరైనా దాతలు వచ్చి దానం చేసి ఆదుకోండి.. కాపాడండి..చదివించండి.. తోడ్పడండి.. సాయం చేయండి.. ప్లీజ్.. అనే ఓ స్టోరీ ఇచ్చి తన ఉదారతను చాటుకున్నది.
అబ్బ ఎంత పెద్ద మనసు. వేరే పత్రిక ఏదీ ఈ సాహసం చేయలేదు. వాటికా కనీస బాధ్యత ఉంటే కదా. కానీ, నమస్తే మాత్రం రాసింది. ఇంటర్ వరకు చదివించింది ప్రభుత్వమే అన్న విషయం కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం దొరికింది కాబట్టి. అప్పటి వరకు అసలు గిరిపుత్రులకు అక్షరం ముక్కే రాదంట. పాపం.. తెలంగాణ సర్కార్ వచ్చినంకనే ఆ అక్షరాలు నేర్చుకున్నట్టున్నారు. గురుకులాల్లో. గురుకులాలు కూడా లేనట్టున్నవి తెలంగాణ వచ్చే వరకు.
సరే, కులాల వారీగా ఒక్కొక్కరికి పది పది లక్షలిచ్చే స్థాయి మన రాష్ట్రానిది. లక్షల కోట్లు బడ్జెట్ అవలీలగా ఖర్చు పెట్టే లెవల్ మన పాలకులది. అంతటి ధీరోదాత్త ప్రభుత్వం…ఈ గిరిపుత్రుల కోసం ఏమీ చేయలేదా..? ఏమీ చేయలేకే…. కేసీఆర్ తన మానస పత్రిక నమస్తే తెలంగాణలో ఇలా ఓ వార్త రాసేసి తన బాధ్యత తీరిందనిపించుకున్నాడా..? లేదా అనవసరంగా ఎందుకు రాసి ఇజ్జత్ తీశారని తర్వాత బాధపడి ఉంటారా? అటుపోయి ఇటుపోయి మళ్లా అది తమ నెత్తి మీదకే వస్తదని నమస్తే గ్రహించి ఉండదు. గిరిపుత్రుల ఉన్నత చదవులపై ఉన్న అపారమైన బాధ్యతతో రాసి ఉంటుంది. దాన్ని తప్పుపట్టలేం.
కానీ ఇంత రాసినా.. మన ట్విట్టర్ రామన్న ఇంకా స్పందించలేదా..? అలా సమాజానికి సమస్య చెప్పిన తర్వాత గానీ స్పందిస్తే… అప్పుడు మళ్లీ నమస్తేలోనే ఓ హాఫ్ పేజీ శబ్బాష్ కథనాలు కుమ్మేసుకోవచ్చు. అంతా మనమే ఉద్దరిస్తున్నట్టు. మనకు సంబంధం లేనివి కూడా పట్టించుకుని జేబులో నుంచి పైసలు దారపోస్తున్నట్టు. అంతే మనం ఏమీ చేసినా పొగడ్తలు మిస్ కావొద్దు. ప్రశసంలు పోగొట్టుకోవద్దు. అది ఇంపార్టెంట్. ప్రజలు ఎప్పుడూ పేదరికంలో, దరిద్రంలో ఉంటేనే కదా లీడర్లకు సాయం చేసే అవకాశం దొరికేది. వాళ్లలాగే ఉండాలి. మీరిలాగే స్పందిస్తూ సాయం చేస్తూ ఉండాలి.