కొత్త వేరియంట్ గుబులు మొద‌లైంది. ఒమైక్రాన్ అంట‌. తుఫాన్ల‌కు కొంగొత్త పేర్లు పెట్టిన‌ట్టు క‌రోనా కూడా పెడుతున్నారు. ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాయో తెలియ‌దు. ఈ మాయ‌రోగాలు. సరే, అక్క‌డెక్కడో పుట్టింది. మ‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోతుందా..? వ‌స్తుంది. జాగ్ర‌త్త అవ‌స‌ర‌మే. కాద‌న‌లేం. మ‌నం జాగ్ర‌త్త‌లు ఏనాడో మ‌రిచి తిరుగుతున్నాం. కాద‌న‌లేం. కానీ, మరీ పాత రోజులు గుర్తుకువ‌చ్చేలా , ఒళ్లు గ‌గుర్పొడిచేలా, రాత్రిళ్లు నిద్ర‌రాకుండా వెంటాడేలా.. మ‌రీ హ‌ర్ర‌ర్ సినిమా చూపించేసేలా ఆ ప్ర‌చారం ఆపండ్రా బాబు.. మీకో దండం…

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగం పెంచండి. మంచిదే. ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోండి. మంచిదే. కానీ, ఇలా మీడియాలో ఇక వ‌చ్చేసింది. జాగ్ర‌త్త . ప్రాణాలు తోడేస్తుంది లాంటి భ‌య‌నాక , బీభ‌త్స ప‌దాలు సంచ‌నాల కోసం వాడి జ‌నాల ప్రాణాలు బ్ర‌తికుండ‌గానే తోడెయ్య‌కండ్రా నాయ‌న‌. మీకో న‌మ‌స్కారం. అదొచ్చినా ఏమీ కాదంట‌. భ‌య‌పడాల్సిన ప‌నే లేదంట‌. స‌రే, అలా అంటే భ‌యం ఉండద‌ని భ‌యపెట్టిస్తున్నార‌న‌కుందాం. కానీ దీని వ‌ల్ల లాభం ఎవ‌రికి..? న‌ష్టం ఎవ‌రికి…? లాభం… మెడిక‌ల్ మాఫియాకు. ఇప్ప‌టికే జ‌ల‌గ‌ల్లా ర‌క్తం పీల్చి వ‌దిలారు. ఇక మిగిలింది బొమిక‌లే. వాటినీ క‌ర‌క‌రా న‌మిలేస్తారు.

ఇంకా ఏం న‌ష్టం…? ఇప్ప‌టికే మార్కెట్ కోలుకోలేదు. అంతా బాగానే తిరుగుతున్నారు. ఫంక్ష‌న్లు, దావ‌త్‌లూ చేసుకుంటున్నారు. మాస్క‌లు తీసేసి చిరున‌వ్వులు చిందిస్తున్నారు. కానీ ఆ జీవితాల్లో ఇంకా అస‌లైన న‌వ్వులు విర‌బూయ‌లేదు. ఆ న‌వ్వుల పువ్వులు వాడిపోయే ఉన్నాయి. ఎవ‌రి జీవితాలూ బాగాలేవు. ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఉద్యోగాలు లేవు. బ‌య‌ట ప‌రిస్థితులూ కుదుట‌ప‌డ‌లేదు. అప్పులు పెరిగాయి. ఆదాయం త‌గ్గింది. రియ‌ల్ ఎస్టేట్ ఇంకా లేవ‌లేదు. అది పండుకునే ఉంది. లిక్విడ్ క్యాష్ ఎక్క‌డిక‌క్క‌డ ప్యాక్ అయి పోయింది. ఎవ‌డూ డ‌బ్బులు తీయ‌డం లేదు. ఉన్నప్లాట్ల‌కు రెక్క‌లొచ్చాయి. కానీ కొనేవాడు లేడు. భ‌వ‌న నిర్మాణ రంగం అనుకున్నంత పుంజు కోలేదు. ఎంద‌రికో ఉపాధినిచ్చే ఈ రంగం కూడా న‌త్త‌న‌డ‌క‌నే సాగుతున్న‌ది.మెల్ల‌గా కోలుకుందామ‌ని అనుకున్న స‌మ‌యంలో మ‌ళ్లీ ఈ కొత్త వేరియంట్‌తో చంపి పాత‌రేస్తారెందుకురా నాయ‌న‌..? మీ సంచ‌నాల కోసం జ‌నాన్నిభ‌య‌పెట్టి సాధించేదేమీ లేదు. వాళ్ల‌ను బ‌తికుండానే మ‌ళ్లీ మ‌ళ్లీ చంప‌డం త‌ప్ప‌.