యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమ‌ని కేంద్రం ప‌లు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివ‌రి ప్ర‌య‌త్నమంటూ ఢిల్లీ బాట ప‌ట్టాడు. అక్క‌డ గులాబీ ద‌ళానికి అపాయింట్‌మెంట్లే దొర‌క‌డం లేదు. ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. కేసీఆర్ ఎప్పుడు వ‌స్తాడా..? వ‌రి విష‌యంలో ఏం చెప్తాడా..? అని తెలంగాణ రైతులు ఆస‌క్తిగా, ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్‌కు తెలుసు. కేంద్రం బాయిల్డ్ రైస్ క‌చ్చితంగా తీసుకోద‌ని. మ‌రి ఎందుకీ తాత్సారం…? ఎందుకు రైతుల‌కు ఎదురుచూపులు..? దీనికి కార‌ణం ఒక‌టే. రాష్ట్ర బీజేపీ ఎక్క‌డ దీన్ని త‌మ‌కు వ్య‌తిరేకంగా మార్చి పొలిటిక‌ల్ మైలేజీ పొందుతుందోన‌నే భ‌యం. బండి సంజ‌య్ తిక్క తిక్క మాట‌ల‌కు ఇటు ప్ర‌జ‌లు, అటు రైతులు మ‌రింత గందర‌గోళానికి గుర‌వుతున్నారు. టీఆరెస్‌పై రైతుల‌కు వ్య‌తిరేక‌త పెరిగేలా బండి సంజ‌య్ ఎత్తుగ‌డ వేస్తున్నాడు.

ఈ విష‌యం కేసీఆర్ గ‌మ‌నించాడు. అందుకే దీన్ని కేంద్రం వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. త‌ను చివ‌రి వ‌ర‌కు రైతుల కోసం క‌ష్ట‌ప‌డ్డాన‌ని, కానీ కేంద్రం విన‌లేద‌ని, అందుకే యాసంగిలో వ‌రి వేసుకోవ‌ద్ద‌ని మ‌ళ్లీ పాత పాటే చెబుతాడు. దీనికి ఇంత తాత్సారం , స‌మ‌యం వృథా అవ‌స‌ర‌మా..? ప్ర‌త్యామ్నాయ పంట‌ల విష‌యంలోనైనా సీరియ‌స్‌గా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయా..? అంటే అదీ లేదు. వ్య‌వ‌సాయాధికార‌లు కూడా ఏం చేయాలో తెలియ‌క నెత్తి ప‌ట్టుకుంటున్నారు.

ప్ర‌భుత్వం ఏ స‌మ‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో వారికి కూడా అంతుచిక్క‌డం లేదు. అందుకే ఇప్పుడు అంతా కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఎప్పుడు ముగుస్తుందా.? ఎప్పుడు వ‌స్తాడా…? ఏం చెబుతాడా..? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, రైతులు దాదాపు 80 శాతం మంది వ‌రి వేసేందుకే రెడీ అవుతున్నారు. ఏదైతే అదైంది… ఇంత‌కు మించి చేసేదేం లేదు.. అని మొండి తెగింపుకు వచ్చేశారు.

You missed