కేసీఆర్‌కు ఇప్పుడు వరి జ్వరం పట్టుకున్నది. ఇది అంతా తేలికగా తీసుకునే విషయం కాదని ఆయనకు తెలుసు. కొంచెం ఎటమటమైనా కొంపలు మునుగుతాయనీ తెలుసు. ఇన్ని రోజులు రైతుల కోసం చేసిందంతా గంగలో కలిసి రైతులంతా టీఆరెస్‌పై తిరగబడే రోజులు వస్తాయని కేసీఆర్ గ్రహించాడు. అందుకే యాసంగి వరిపై ఆద నుంచి ఆచితూచి మాట్లాడుతున్నాడు.
రాష్ట్ర బీజేపీని, మోడీని దోషిగా బోనులో రైతుల ముందు నిలబెట్టాలని ధర్నాలకు దిగాడు. ఆ తంతు ముగిసింది. కేంద్రం నుంచి ఘాటుగానే జవాబొచ్చింది. ఉన్నదున్నట్టే , ఇంతకు ముందు కేసీఆర్‌తో డిస్కషన్ చేసిందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది కేంద్రం. యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, పంటల మార్పిడి అనివార్యమనీ చెప్పేసింది. ఈ విషయం కేసీఆర్ తో కూడా ముందే చెప్పామనీ, దానికి ఆయన కూడా అంగీకరించి వెళ్లాడని కూడా బటయపెట్టేసింది.
దీంతో కేసీఆర్‌కు కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశం లేకుండా పోయింది. అలా ఉండదనీ కూడా తెలుసు. మరి ఇవన్నీ ధర్నాలు ఎందుకు చేశాడంటారా? స్టేట్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు. బండి సంజయ్ .. టీఆరెస్‌ను రైతుల ముందు దోషిలా నిలబట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు. అంతే. ఇది రైతుల కోసం అసలే కాదు. ఫక్తు రాజకీయ అవసరాల కోసం చేసిన ధర్నాలు అంతే. ఇక ఈ తంతు ముగిసింది. కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. కేంద్రానికి కత్తి కాదు, నెత్తీ కాదు. ఇప్పుడు బాధంతా వచ్చింది కేసీఆర్ కే.
అందుకే రేపు ఢిల్లీ వెళ్లి అడిగొస్తామంటున్నాడు. అక్కడ అడిగిన తర్వాత క్లారిటీ తీసుకున్న తర్వాత వరి వేసుకోవాలా వద్దా చెబుతారట. అక్కడేం చెబుతారు. వద్దనే అంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ రైతుల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చామని, చూశారా..? ఇంత ప్రయత్నం చేసినా కేంద్రం వింటలేదు. ఇక మేమేం చేయలేం. మీరు వేరే పంటలు వేసుకోండని చెబుతారన్నమాట. ఇది రైతులకు చెప్పేందుకు కేసీఆర్ జంకుతున్నాడు. అందుకే ఇదంతా చేస్తున్నాడు. కానీ చివరకు మాత్రం వరి వద్దనే చెబుతాడు.
ఇంతోటి దానికి ఇంత ఆలస్యం ఎందుకు… ? రైతులను ఇంకా అయోమయంలో పెట్టడం ఎందుకు..? మీరే మొన్నటి వరకు ప్రత్యామ్నాయ పంటలు ఇవీ ఇవీ వేసుకోండని ఓ బ్రోచర్‌ను రైతుల ముఖాన కొట్టారు. మీ చావు మీరు చావండనే పద్దతిలో. దానిపైనా సీరియస్‌గా కసరత్తు చేయలేదు. వ్యవసాయాధికారులకు సరైన పనులను సీరియస్‌గా అప్పజెప్పలేదు. మీరూ క్లారిటీ ఇవ్వరు. నారుమళ్ల సీజన్ వచ్చేసింది. ఇక ఎప్పుడు చెబుతారు.
ఎంత ఆలస్యం చేస్తే అంత మీ పీకల మీదకే వస్తుంది. తప్పించుకోలేవు కేసీఆర్. బీజేపీ ఆడుతున్న ఈ వరి రాజకీయంలో ఆఖరికి నిన్నే ఇరికిస్తారు. పావును చేస్తారు. ఎలా తప్పించుకుంటావో చూసుకో.
