అప్పటికే సరోజా గేటు దాటి వెళ్లిపోయింది.
“మీ అన్న వచ్చే టైం అయ్యింది.” ఈ మాటలను ఒత్తి మరీ పలికింది లక్ష్మి. రాజారెడ్డి ఆ మాటల్లో ఆంతర్యాన్ని గుర్తించాలన్నట్లుగా.
అది గ్రహించాడు రాజారెడ్డి. కోపం చల్లారింది.
“ఎవరెటు పోతే నీకెందుకు?” అంతరంగం ఇంతకు ముందు సూచించిన మాటలు గుర్తుచేసుకున్నాడు. వెళ్లిపోదాం అనుకున్నాడు. ఆ
ఆలోపు….. లోపల బెడ్ రూంలోకి వెళ్లిన లక్ష్మి చేతిలో వంద రూపాయల కట్టతో వచ్చింది. రాజారెడ్డికి ఇచ్చేందుకు చేతి చాచింది. అవి తీసుకోకుండా “ఏమిటిది?” అన్నాడు. “పుట్టెడు కష్టాల్లో ఉన్నట్లున్నావ్.? తీసుకో. నీకు వీలైనప్పుడు మళ్లీ ఇవ్వు” అన్నది.
మళ్లీ కోపం నశాలనికంటింది రాజారెడ్డికి. అంటే నన్ను డబ్బులతో కొంటున్నదా? నా నోటికి ఈ నోట్ల కట్టతో తాళం వేస్తున్నదా?
అంతేగానీ తను మాత్రం మారదా??
చేతిలో నోట్ల కట్టను తీసుకున్నాడు. అప్పటి వరకు తన చేతిలో నలిగిపోతున్న ఐదొందల రూపాయల నోట్లను జతచేశాడు. రెండింటినీ కలిపి లక్ష్మి ముఖంపై విసిరేశాడు.
కింద పడిన నోట్లను ఒంగి ఒక్కొక్కటిగా ఏరుతున్నది లక్ష్మి. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు రాజారెడ్డికి కనిపించడం లేవు. విసురుగా ఆమె ముఖం పైకి నోట్లు విసిరేసాడు కానీ, తర్వాత భయపడుతున్నాడు. ఏమంటుందోననే భయం వెంటాడుతున్నది అతనికి.
నోట్లను అన్నింటినీ ఏరి టేబుల్ పైనే పెట్టింది. వంట గదిలోకి వెళ్లిపోయింది. ఏమీ మాట్లాడలేదు. అర్థం కాలేదు రాజారెడ్డికి.
వెనక్కి వెళ్లిపోవాలనుకున్నాడు. టేబుల్ పైన నోట్లు రెపరెపలాడుతున్నాయి. అవి ఎగిరిపోకుండా వంద రూపాయల కట్టను వాటిపై పెట్టింది లక్ష్మి.
“ విఠల్ వచ్చే సమయం అవుతున్నది. ఇక్కడే ఉంటే అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. వీరి కాపురంలో నిప్పులు పోయడం అవసరమా?”
మనసులో అనుకుంటున్నాడు. “ఎవరి కర్మకు వారు పోతారు. మంచి చెప్పే ప్రయత్నం చేసిన. వినకపోతే దాని కర్మ” అనుకున్నాడు. వంట గదిలోంచి బయటకు వచ్చింది లక్ష్మి. “ఇంకా వెళ్లవేం?” అన్నట్లు ఉన్నాయామె చూపులు. కొంచెం కోపం తగ్గింది రాజారెడ్డికి. “ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండని” అన్నాడు రాజారెడ్డి. ఆమె వైపు సూటిగా చూస్తూ. “ఏ విషయం ?” అన్నట్లుగా ఓ చూపు చూసి వెళ్లి కూర్చీలో కూర్చున్నది లక్ష్మి. “విఠల్ బాధపడతాడు.. నేను కూడా ఎవరికి చెప్పను” అన్నాడు. కొంచెం శాంతించినట్లు కనిపించాడు. ఆమె పట్టించుకోలేదు. టీవీ ఆన్ చేసింది. ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నట్లు అందులో తలదూర్చింది. “సరే మరి నేను వెళ్తాను” అన్నాడు.
“నీపై దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించు” అందామనుకున్నాడు. నోటి దాకా వచ్చింది. ఆ పేసుకున్నాడు.
కోపంతో డబ్బులు విసిరేశాడు గానీ, అవి ఇప్పుడు కావాలనిపిస్తున్నది. గాలికి రెపరెపలాడుతూ అవి తనను పిలుస్తున్నట్లుగా తోస్తున్నది తనకు.
ఇప్పుడు వాటిని తీసుకునేందుకు దారి లేకుండా చేసుకున్నాడు. తనను తాను తిట్టుకున్నాడు. “చేతికి వచ్చిన డబ్బులు జార విడుచుకున్నానే” అని మదన పడ్డాడు.
మనసు దిటవు చేసుకొని వెళ్లేందుకు వెనుదిరిగాడు. రెండడుగులు వేసి గుమ్మం దగ్గరకు పోయి నిలబడి ..ఏదో గుర్తొచ్చినవాడిలా…. “మళ్లీ ఈ
చాయలకు ఆ సలీంగాడు వస్తే సహించేది లేదు” అన్నాడు. వేలెత్తి మరీ వార్నింగ్ ఇచ్చినట్లుగా అన్నాడు రాజారెడ్డి. అప్పటి వరకు ఓపికగా ఉన్న ఆమె కస్సున లేచింది. “వస్తే ఏం చేస్తావు?” ” చంపేస్తావా??” అన్నది. నీతో ఏం కాదు పోరా అన్నట్లుగా ఉన్నాయి ఆమె హావభావాలు. హతాశుడయ్యాడు రాజారెడ్డి. ఏం మాట్లాడలేదు. లక్ష్మీ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అతని అర్థం కావడం లేదు. “ఇది నాకంటే మెంటల్ లా ఉంది” అనుకున్నాడు. “సలీం బరాబర్ వస్తాడు? వెళ్తాడు??” “నా మొగుడికి లేని బాధ నీకెందుకు?” “అయినా నా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నీకేం హక్కుంది?” “విఠల్ కు ఆక్సిడెంట్ అయిన విషయం నీకు తెలుసా?” అన్నది.
ఓసారి అతని కారులో వస్తుంటే విఠల్ తనకు ఆక్సిడెంట్ అయినప్పటి నుంచి స్కూటీ వాడుతున్నానని చెప్పిన విషయం గుర్తొచ్చింది.
“తెలుసు. అయితే …?” అన్నాడు. ఆమె ఏదో చెప్పబోతుందని అతను గ్రహించాడు. “నీకు ఏమి తెల్వదు.” అన్నది. “యాక్సిడెంట్ అంటే చిన్నదేం కాదు. అతని నడుము పూర్తిగా దెబ్బతినేలా జరిగిందా ప్రమాదం” అన్నది. అర్థం కాలేదు. అలాగే నిశ్చేష్టుడై చూస్తున్నాడు. “అతను కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది. మంచానికి పరిమితమై నరకం చూశాడు.”
“వెన్నుముక పూర్తిగా దెబ్బతిన్నది. రెండు మూడు ఆపరేషన్లు కూడా చేయాల్సి వచ్చింది.” ఆమె చెప్తూ పోతున్నది.
నోరెళ్లబెట్టి వింటున్నాడు రాజారెడ్డి. “అతడు చేసే డ్రైవింగ్ డ్యూటే అతనికి శాపమయ్యింది.” “కోలుకున్నాక కూడా అదే పని చేయడంతో అది మరింత తిరబెట్టింది.”
“చివరకు ఏమైంది ?” అన్నట్లు ముఖం పెట్టాడు. తెలియని ఎన్నో కొత్త విషయాలు వినేసరికి విగ్రహంలా బిగుసుకుపోయాడు.
“సంసారానికి.. ఆగింది కొద్ది సేపు. ఏ మాట్లాడాలో తెలియడం లేదామెకు. “సంసారానికి పనికి రాడని డాక్టర్లు చెప్పారు.” అన్నది గుండెను దిటవు చేసుకొని చెప్పేసింది. చెప్పి రాజారెడ్డి వైపుకు తిరిగి “ఇదంతా నీకు తెలుసా?” అన్నది రాజారెడ్డి ఇంకా తేరుకోలేదు. శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. “ఆ రోజు నుంచి పసిపిల్లాడిలా చూసుకుంటున్నాను ఆయన్ను” అన్నది మళ్లీ లక్ష్మి. “సంసారానికి పనికి రాకపోతే.. నువ్వు వేరొకరితో సంబంధం పెట్టుకోవాలా??” నిలదీసినట్లు అడిగాడు రాజారెడ్డి. “విఠల్ ను నువ్వు మోసం చేస్తున్నట్లు నీకేనాడూ అనిపించలేదా?” “ఇదన్యాయం కాదా??” ప్రశ్నల వర్షం కురిపించాడు రాజారెడ్డి.. మౌనంగా ఉంది ఆమె. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తప్పు చేశానని ఒప్పుకున్నట్లుగా తలదించుకొని
ఉంది.
“నీలాంటి ఆడది సమాజానికి చేటు… నువ్వు బతికి ఉండకూడదు. ఏ బావిలోనన్న దూకి చావు “అన్నాడు శపిస్తున్నట్లు.
“నిన్ను చూసి మిగిలిన ఆడవాళ్లు చెడిపోతారు.” అని కొన్ని క్షణాలు ఆగి…..
“అసలు నువ్వు ఈ వాడలోనే ఉండటానికి వీల్లేదు. ఈ కొంప ఎవరికైనా అమ్మేసి ఇకడ్నుంచి వెళ్లిపోండి” అన్నాడు రాజారెడ్డి. అతనికి పట్టరాని కోపం వస్తున్నది.
“నెల రోజుల్లో నువ్వు నా కంటికి కనిపించొద్దు” అన్నాడు. డెడ్ లైన్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. ఒక్కసారిగా లక్ష్మిలో సహనం చచ్చిపోయింది. “నువ్వెవడవురా నన్ను పొమ్మనడానికి?” “అసలు నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా??” అన్నది. ఒక్కసారిగా టాపిక్ తన ఇంటి వరకు వచ్చే సరికి అవాక్కయ్యాడు రాజారెడ్డి. ఏదో అనబోయి ఆగిపోయాడు. ఆమె ఏం చెప్తుందా? అన్నట్లుగా. “నీ పెండ్లాం ఎవడితో తిరుగుతుందో తెలుసా??”
“ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టుకో…. నీవో చాతకాని దద్దమ్మ. పైగా నాకు చెప్పొచ్చావా?” అన్నది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. ముఖం చమటలు కక్కుతున్నది. కళ్లు చింతనిప్పుల్లా మండుతున్నాయి.
“నా భార్యా…? ఎవరితో తిరుగుతున్నది.??” నమ్మలేకపోతున్నాడు. “ఏం మాట్లాడుతున్నావ్?? మతుండే మాట్లాడుతున్నావా? నీకు మైండ్ దొబ్బిందా?? అన్నాడు దబాయిస్తున్నట్టు.
(ఇంకా ఉంది)
