“నా మైండ్ కాదు…. నీ మైండ్ దొబ్బింది. ఆ ఆటో రవిగాడితో నీ పెళ్లాం అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఊరంతా కోడై కూస్తున్నది. ఆ విషయం నీకు మాత్రం తెలియదు “అన్నది. తన కోపాన్నంత మాటల ద్వారా చూపిస్తున్నదామె.
“ఆటో రవితో…….” “అక్రమ సంబంధమా??” పక్కలో బాంబు పడినట్లుగా అదిరిపడ్డాడు రాజారెడ్డి. కళ్లు బైర్లు కమ్మాయి. చిమ్మ చీకటి అలుముకున్నట్లు తల తిరిగినట్లు అనిపించింది. అలాగే కుప్పకూలిపోయాడు.
వంటగదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి రాజారెడ్డి ముఖం పై చల్లింది లక్ష్మి. మగత నిద్ర నుంచి లేచినట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు రాజారెడ్డి. –
కుడిచేతిని పట్టుకొని పైకి లేపింది. పక్కనే కుర్చీలో కూర్చోబెట్టింది.
మెల్లగా తేరుకుంటున్నాడు అతడు. జరిగింది మళ్లీ తలంపుకొస్తున్నది. నార్మల్ గా ఉన్న శరీరం కొద్దిగా వణకడం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో శరీరం తన కంట్రోల్ లో లేకుండా పోతున్నది. వంటగదిలోకి వెళ్లి ఓ ఐదు నిమిషాల తర్వాత వచ్చింది లక్ష్మి. నిమ్మరసం గ్లాసుతో. దాహంతో తడారిపోయిన గొంతు దాన్ని చూడగానే ఆబగా తాగేసింది.
పేగులు కుదురుకున్నాయి. వణకు తగ్గింది. చల్లటి చమటలు నుదిటి పై ఉబికి వస్తున్నాయి. చేతితో తుడుచుకుంటున్నాడు.
అతడి పరిస్థితి చూసి జాలి పడింది లక్ష్మి. నిమ్మరసం తాగేసరికి కొత్త సత్తువ వచ్చినట్లైంది రాజారెడ్డికి. ఇక లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. “ఆగండి” అని టేబుల్ వద్దకు నడిచింది లక్ష్మి. అక్కడున్న డబ్బులు తీసుకున్నది. వాటిని రాజారెడ్డి చేతిలో పెట్టింది. బలవంతంగా, ఆమె వైపు చూశాడు ఏమటన్నట్లుగా రాజారెడ్డి. ఆమె కళ్లతోనే రిక్వెస్ట్ చేసింది తీసుకోమని. తలవాల్చేశాడు. “తీసుకోండి. మీరు మళ్లీ ఇవ్వాల్సిన అసవరం లేదు.” అన్నది. ఆమె ఆఫర్ కు ఆశ్చర్యపడ్డాడు రాజారెడ్డి. “ఇది మీ మీద సానుభూతితో మాత్రమే ఇస్తున్నాను రాజారెడ్డి…” అన్నది. ఆమె తనను పేరు పెట్టి పిలుస్తున్నది. ఇంతకు ముందు కోపంలో ‘ఒరేయ్’ అని కూడా సంబోధించింది.
తన విలువ మొత్తం ఆమె దగ్గర పతనమైందని గ్రహించాడు రాజారెడ్డి. సిగ్గుపడ్డాడు. తప్పు చేసింది ఆమె. తలవంచుకున్నది తను అని ఆలోచిస్తున్నాడు.
పైగా తనభార్యపై అబాండం కూడా వేసింది. “ఛీ ఇదెంత కిలాడీ…” మళ్లీ తిట్టుకుంటున్నాడు. “సలీం వ్యవహారం నువ్వు నా భర్తతో చెప్పొద్దని ఈ డబ్బు ఇవ్వలేదు” అన్నది మళ్లీ. ఆమెనే చూస్తున్నాడు రాజారెడ్డి. ఆమె ధైర్యానికి అతనికి ఆశ్చర్యం వేస్తున్నది. “ఏమిటీ దీనికి ఇంత టెక్కు…?”
“ఏమి చూసుకొని దీనికింత తలబిరుసు??” “పోగాలం దాపురిస్తే ఇగో ఇట్లనే ఉంటయి ఆలోచనలు…..” నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. “ఎందుకంటే… ” కొన్ని సెకన్లు ఆగి మళ్లీ అన్నది ఆమె. “సలీంతో నా ఎఫైర్ నా భర్తకు తెలుసు.” మళ్లీ షాక్ తిన్నాడు రాజారెడ్డి.
“ఏంటీ విఠల్ కు నీ వ్యవహారం తెలుసా?” అన్నాడు. అతనికి ఇంకా ఏమేమీ వినాల్సి వస్తుందోనని భయపడుతున్నాడు. టెన్షన్ పెరుగుతున్నది.
“ఆయనకు తెలుసు కానీ, ఎప్పుడూ మా మధ్య ఆ ప్రస్తావన రాలేదు.” “తెలుసునని నేననుకుంటున్నాను…” “తెలిసీ అతడు తెలియనట్లుగానే ఉంటున్నాడని భావిస్తున్నాను” అన్నది. కొద్ది సేపు ఆగి… మళ్లీ అన్నది. “ఎంతైనా ‘మగాడే’ కదా” అన్నది ఆమె.
“మగాడా? వాడా??” అనుకున్నాడు రాజారెడ్డి. మనసులో అనుకున్నాననుకున్నాడు. అన్యపదేశంగా ఆ మాటలు బయటకే వచ్చేశాయి.
ఆ మాటలు లక్ష్మి చెవిన పడ్డాయి. విని ఊరుకున్నది. “ఆటో డ్రైవర్ రవితో నువ్వన్న సంబంధం ఒట్టిదే కదా?” అన్నాడు.
అక్రమ సంబంధం అని అనడానికి కూడా అతనికి మనసొప్పడం లేదు. ఆ మాటే భరించలేకపోతున్నాడు. ఆ ప్రస్తావన అతనికి తెలియకుండానే లోలోపల దహించి వేస్తున్నది.
ఆమె వేసిన అపవాదు కచ్చితంగా అబద్దమే. అవును.. అబద్దమే అయివుంటుంది. ఏదో కోపంలో నన్ను ఇరకాటంలో పెట్టాలని, తనను తాను కాపాడుకోవాలని ఆ మాట అని వుంటుంది… ఊహించుకుంటున్నాడు. ఆలోచనలు రేగుతున్నాయి. రాజారెడ్డిలో. “నువ్వు మారాలి” అన్నది లక్ష్మి. తనడిగిందేమిటి? ఆమె చెప్తున్నదేమిటీ?? అర్థం కాలేదు రాజారెడ్డి. “అంటే.. ?” అన్నాడు. “ఇన్నాళ్లూ నీవు చేసిన ఉద్యోగం నీ కుటుంబాన్ని ఎన్నడూ ఉద్దరించలేదు.” మళ్లీ ఇగో హర్టయ్యింది అతడికి. ‘దీనికి కూడా నా ఉద్యోగం అలుసై పోయింది..’ తిట్టుకున్నాడు. “ఎన్నో సార్లు నీ భార్య నా దగ్గరకు వచ్చి బాధపడింది. ఏడ్చింది.”
చేబదులుగా నా దగ్గర అప్పుడప్పుడు డబ్బులు కూడా తీసుకెళ్లేది.” చెప్తూ పోతున్నది ఆమె. ఆమె మాటలు శరాల్లా గుండెలను తాకుతున్నాయి. “కుటుంబాన్ని పోషించేందుకు ఆమె ఒంటరిపోరు చేస్తున్నదని నాకర్థమయ్యింది” “ఏ మాత్రం పట్టింపు లేకుండా నీలోకంలో నువ్వు ఉండిపోయావనీ తెలిసిపోయింది”
మొత్తం రాజారెడ్డిని స్కానింగ్ చేసినట్లు మాట్లాడుతున్నదామే. రాజారెడ్డిని బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టినంత పని చేస్తున్నది. నిజంగా ఆ క్షణం చచ్చిపోవాలనిపించింది అతనికి. – “అంటే నా పరువు ఇలా కూడా తీసిందన్నమాట అది” అనుకున్నాడు. భార్య వనజ మీద విపరీతమైన
కోపం వచ్చింది.
“ఇంకా ఎవరెవరితో నా గురించి ఎన్ని చాడీలు చెప్పి ఉంటుందో??” “నా మీద సాకులు చెపుతూ, నన్ను చేతగాని వాడిని చేసి ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు చేసిందో??” “దొంగముండా….!!” కసిగా తిట్టుకుంటున్నాడు. “పిల్లలు పెద్దగవుతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి.
కానీ నీకు దమ్మిడీ ఆదాయం లేదు.” అన్నది. ‘గాడిదకేం తెలుసు… గంధపు చెక్కల వాసన’ లక్ష్మిని తిట్టుకున్నాడు రాజారెడ్డి. “నా ఉద్యోగం గురించి వంటింటికే పరిమితమైన ఈ ‘ఆడది’ చెప్తున్నది.” “ఆఖరికి దీనితో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తున్నది” “థూ…. నా బతుకు” మళ్లీ ఆమె అన్నది…. “దేనికైనా ఓ హద్దు ఉంటుంది… ఇకనైనా నీవు ఆమెకు తోడుగా నిలబడాలి.” “ప్రజాసేవ, ఉద్యోగం, పరపతి అని కుటుంబాన్ని ఆగం చేసుకోవద్దు ” ఆమె హితోపదేశాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇక అక్కడ ఉండాలనిపించలేదు రాజారెడ్డికి. లేచి వెళ్లాలనుకున్నాడు. వెళ్లేముందు తన అనుమానం నివృత్తి కాలేదని గుర్తొచ్చింది. “నా భార్యపై వేసిన అపవాదుకు క్షమాపణ చెబుతావా??” ఒక్కసారిగా డైరెక్ట్ గా అడిగాడు. “చెప్పు…” రెట్టించాడు. “వాడితో నా భార్యకు సంబంధం అంటగట్టావు కదా… చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాస్తావా??” ఆటో డ్రైవర్ పేరు ను కూడా ఉచ్చరించడానికి రాజారెడ్డికి మనసొప్పలేదు. అందుకే ‘వాడు’ అని సంభోదించాడు లక్ష్మీ ని నిలదీస్తున్నట్లుగా అడుగుతున్నాడు. ఆమె మాట్లాడటం లేదు. “గతం గురించి మాట్లాడుకోవడం వ్యర్థం” అన్నది. “ఇపుడేం చేయాలో ఆలోచించు రాజారెడ్డి. ఆవేశం సమస్యకు పరిష్కారం కాదు” నర్మగర్భంగా ఆమె మాట్లాడుతున్న మాటలు రాజారెడ్డికి అర్థం కావడం లేదు. తనను పేరు పెట్టి పదే పదే పిలవడం తలవంపులుగా భావిస్తున్నాడతను. “ఒక విషయం చెప్తాను. గుండె దిటవు చేసుకొని విను” అన్నది. ఓ క్లారిటీకి వచ్చినట్లుగా.
మళ్లీ ఏం చెబుతుందా?? అలాగే ఉత్కంఠతో చూస్తున్నాడు. బయట కారు వచ్చి ఆగిన శబ్దం వచ్చింది. విఠల్ వచ్చినట్లున్నాడు. ఆమె కూడా అది గ్రహించింది. ఇక సాగదీయడం లాభం లేదనుకున్నది. సూటిగా .. చివరగా రాజారెడ్డితో అన్నది… “నీవూ నపుంసకుడివే నా దృష్టిలో…” రాజారెడ్డిని లక్ష్మి అంత మాట అనే సరికి పట్టరాని కోపం వచ్చింది అతనికి. కోపంతో చేతెత్తాడు. ఏదో అనబోయాడు.
కానీ అప్పటికే విఠల్ కారును గేటు ముందు ఆపి గేటు తీసుకొని లోనికి రావడం గమనించాడు. వెంటనే తమాయించుకున్నాడు రాజారెడ్డి.
ఎడమ చేతి నిండా పట్టుకుని ఉన్న డబ్బులను వెంటనే పైకి ఎగ్గట్టి ఉన్న లుంగీలో జారవిడిచాడు. వాటిని విఠల్ చూస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని భయం వేసింది.
తను డోర్ లోపలికి వచ్చేలోపే బయటకు వెళ్లేందుకు ముందుకు నడిచాడు రాజారెడ్డి. రాజారెడ్డికి భయంతో చమటలు పడుతున్నాయి. లక్ష్మి మాత్రం ఏమాత్రం జంకు లేకుండా కుర్చీలో కూర్చున్నది. టీవీ చూస్తున్నది.
లోపలికి వస్తూనే విఠలే నవ్వూతూ పలకరించాడు. ” రెడ్డీ సాబ్ … బాగున్నావా.. నాతో ఏమైనా పని పడ్డదా.? చెప్పు.. ఊరకరారు పెద్దలు…”
గ్యాప్ లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు రాజారెడ్డికి. “అవును మీ
కోసమే వచ్చారు?” అన్నది లక్ష్మి. మధ్యలో కలుగ చేసుకుంటూ. “అవునా..? మరి చెప్పవేం. రా కూర్చో.” అన్నాడు. చేతిలో బ్యాగు టేబుల్ మీద పెట్టాడు. “కూర్చో ఫ్రెష్ అయి వస్తాను. మాట్లాడుదాం” అన్నాడు విఠల్. షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు. “లేదు.. తర్వాత వస్తా అన్నాదు. ఎలా అక్కడ్నుంచి తప్పించుకోవాలా? అని చూస్తున్నాడు. “అదేంటన్నయ్య .. ఏదో మీ
జాబ్ పోయింది అన్నారు. అదే విషయం విఠల్ తో మాట్లాడతా అన్నారు…..” ఒక్కసారిగా అవాక్కయి లక్ష్మిని చూశాడు రాజారెడ్డి. ఆమె అతన్ని చూడటం లేదు. లోపలికి వెళ్లిపోయింది. ‘నన్ను ఇరకాటంలో పెట్టి తప్పించుకున్నావు కదే’ అని తిట్టుకున్నాడు. “ఏందీ జాబ్ పోయిందా? ఏం జరిగింది??” ఆశ్చర్యంగా అడిగాడు విఠల్.
ఏం చెప్పాలో తెలియడం లేదు. తన జాబ్ పోయిందని అందరికీ తెలియడం అతనికి ఇష్టం లేదు. అప్పటి వరకు తనకు ఇచ్చే మర్యాద ఇక మట్టిలో కలిసిపోతుందని అతని బెంగ.
తనను చులకనగా చూస్తారని అతని భయం. అప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన ప్రిస్టేజ్ బూడిదలో కలిసిపోతుందని కలవరం. “అదో పెద్ద కథ విఠల్… తర్వాత చెప్తానులే..” తప్పించుకోవాలనుకుంటున్నాడు. “సరే మరి ఏం పనిమీద వచ్చావు?” మళ్లీ నీళ్లు నమిలాడు. ఇదిలా ఇరికించిందేమిటీ??
గుడ్లు తేలేసి చూస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియడం లేదు. “అదేనండి … మీరేమైనా పని ఇప్పిస్తారేమోనని అడుగుదామని వచ్చారంట.” మళ్లీ కలుగజేసుకున్నది లక్ష్మి. ‘అబ్బ… మళ్ళా కొట్టిందిరా దెబ్బ’ అనుకున్నాడు. “నేనా? పనా??” ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టాడు విఠల్.
‘అవును.. వీడేం పని చూపిస్తాడే నాకు దొంగముండా… నన్నిట్లో ఇరికించేశావ్’ తిట్టుకుంటున్నాడు రాజారెడ్డి.
“అదేనండీ మీలాగా ఏదైనా డ్రైవింగ్ పని చేస్తాడంట..” అన్నది మళ్లీ లక్ష్మి. పెద్ద బండరాయి తీసుకొచ్చి నెత్తిమీద ‘దబేల్’ మని గట్టిగా ఎత్తేసినట్లు ఫీలయ్యాడు రాజారెడ్డి. ఖంగుతిని, నీళ్లు మింగుతున్నాడు. గుడ్లు మిటకరించి అటూ ఇటూ చూస్తున్నాడు. అక్కడేం జరుగుతుందో తెలియడం లేదు.. నన్నెందుకిలా ఇరికిస్తుంది…? నేనేం తప్పు చేశాను?? మంచి చేయాలనుకుంటుందా?? నా పరువు తీయాలనుకుంటుందా?? ‘కచ్చితంగా నా పరువును గంగలో కలపాలని ఇది డిసైడ్ అయ్యింది.” “నువ్వు డ్రైవింగ్ చేస్తావా??” నోరెళ్లబెట్టి అడిగాడు విఠల్. ‘నీకు డ్రైవింగ్ వచ్చా??” అని అడుగుతాడనుకున్నాడు. ఏం చెప్పాలో తెలియడం లేదు రాజారెడ్డికి. “డ్రైవింగ్ వస్తుందట” మళ్లీ పోసేసింది లక్ష్మి. ‘ఇదెప్పుడో నేను డ్రైవింగ్ చేస్తుంటే చూసింది కాబోలు అందుకే కచ్చితంగా ఇలా ఇరికించేస్తుంది అనుకున్నాడు.
‘లేకుంటే వనజ చెప్పి ఉంటుంది. ఆ రిపోర్టర్ పని చేసి ఇంట్లోకి తెచ్చి ఇచ్చేదేమీ లేదు. ఎంచక్కా డ్రైవింగ్ వస్తుంది. మీ ఆయనలా ఆ పనిచేసినా బాగుండు అని ఎప్పుడో అని ఉంటుంది… ‘ అని కూడా అనుకున్నాడు.
“దొంగముండా…” పళ్లు పటపటా కొరుక్కున్నాడు. బయటకు వినపడకుండా. ‘నా పరువును తీసేందుకే ఇది కంకణం కట్టుకున్నది.” “దీనికి ఇది కూడా తోడయ్యింది. ” వనజను, లక్ష్మిని కలిపి తిట్టుకున్నాడు. ‘ఇపుడు నా ఉద్యోగం పోగానే నేను వీళ్లకు మరీ చాతకాని వాడిలా అయిపోయాను.” ‘ఆస్ట్రాల్ ఓ డ్రైవర్ గాని ముందు ఇలా దోషిలా నిలబెట్టారు కదే “డ్రైవింగ్ జాబ్ నేనిప్పిస్తా” అన్నాడు విఠల్. “కానీ నీతో అవుతుందా??” అనుమానంగా అన్నాడు. ‘చూశావా? వీడికున్నంత తెలివి కూడా ఈడి పెండ్లానికి లేదు. నేనేంటి? నా లెవల్ ఏంటీ?? నన్ను డ్రైవర్ పని చేయమంటుందేంటీ రంకుముండా……” విఠల్ తనను అర్థం చేసుకున్నాడని సంతోషం వేసింది.
(ఇంకా ఉంది)
