నోట్ల వాసన మత్తుగా తగిలింది ముక్కు పుటాలకు. వాసన పీల్చుకున్నాడు కళ్లు మూసుకుని. గమ్మత్తుగా వుందావాసన.
చేతివేళ్లకు నాలికతో పదన చేసుకొని నోట్లను లెక్కించసాగాడు. మూడు.. నాలుగు…. ఐదు వేలు.. లెక్కించడం పూర్తయినా…… ఒక నోటు ఇంకా చేతిలో మిగిలి ఉంది. ” ఐదొందలు ఎక్కువొచ్చాయే” “ఐదొందలు ఇద్దామా? వద్దా??”
ఆలోచిస్తున్నాడు రాజారెడ్డి. తన పై నమ్మకంతో అడగగానే ఇచ్చారు. ఇచ్చేద్దాం అని అనుకొని విఠల్ ఇంటికి వెళ్లేందుకు లేచాడు.
గేటు వరకు వచ్చాడు. అప్పుడే విఠల్ ఇంటి నుంచి స్కూటీ పై బయలు దేరడానికి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ‘ విఠల్ వెళ్లిపోతున్నాడా?” అని అనుకొని అలాగే చూస్తున్నాడు.
కానీ ఆ వచ్చిన వ్యక్తి విఠల్ కాదని అర్థమయ్యింది రాజారెడ్డి. విఠల్ పొట్టిగా ఎర్రగా ఉంటాడు. ఇతడు ఆరడుగుల పొడవున్నాడు. మూతికి మాస్కు కట్టుకుని ఉండటంతో సరిగా గుర్తించలేకపోయాడు రాజారెడ్డి.
‘ఎవరు???” అలాగే చూస్తుండిపోయాడు.
ఆ వ్యక్తి స్కూటీ స్టార్ట్ చేసుకొని మలిపాడు. తిరిగి రాజారెడ్డి ఇంటి ముందే బయట పెద్దరోడ్డుకు వెళ్లాలి. ఇటునుంచే వస్తాడు కదా అని కొద్దిగా పక్కకు జరిగి అతనెవరో చూద్దామని ఆగాడు.
గేటు ముందు వరకు రాగానే ఆ వ్యక్తిని గమనించాడు. అవే డేగ కళ్లు. అతను…. సలీం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాజారెడ్డి. “అంటే ఇప్పటి వరకు లోపల ఉన్నది సలీమా? అందుకే తనను లోపలికి రానివ్వలేదా??”
“అడగగానే డబ్బులు ఇచ్చింది ఇందుకేనా??” “అమ్మో… ఇదెంత కిలాడీ? పట్టపగలే ఇంట్లో దుకాణం పెట్టేసిందా?” ఒళ్లు మండింది రాజారెడ్డికి. అనవసరంగా తాను అక్కడి వెళ్లానని బాధపడ్డాడు. డబ్బులు అడిగి ఇంకా పెద్ద తప్పు చేశానని ఫీలయ్యాడు. “అవునూ… వీడు స్కూటీ పై రావడమేంది?” వాడి బైక్ ఏమైంది. ఇది విఠల్ స్కూటీ కదా?? వీడి దగ్గరకు ఎలా వచ్చింది??” ప్రశ్నలన్నీ ఒక్కొక్కటిగా దాడి చేస్తున్నాయి రాజారెడ్డి మస్తిష్కంపై.
ఆ రోజు రాత్రి బాగా తాగి సలీం బైక్ పై తాను చేసిన దాడి గుర్తొచ్చింది. అంటే ఆ బైక్ పనికిరాకుండా పోయిందా??
అందుకే విఠల్ స్కూటీ వేసుకొని వీడు తిరుగుతున్నాడా? అది తెలియక స్కూటీని చూసి విఠల్ ఇంటికి వెళ్లినట్లు గుర్తించాడు రాజారెడ్డి. తనను తాను మరోమారు తిట్టుకున్నాడు. శరీరం కుతకుత ఉడుకుతున్నట్లనిపించింది. విసురుగా గేటు తీసుకొని వేగంగా విఠల్ ఇంటికి వైపు పోతున్నాడు. లుంగీ పైకి ఎగకట్టాడు. బనీను పైనే ఉన్నాడు. చేతిలో లక్ష్మి ఇచ్చిన కొత్త నోట్లు నలిగిపోతున్నాయి. విఠల్ ఇంటి గేటు తీశాడు. డోర్ ఓపెన్ ఉంది. లోనికి దూకుడుగా వెళ్లాడు. అటూ ఇటూ చూస్తున్నాడు. వంట గదిలోంచి బయటకు వచ్చింది లక్ష్మి. ఎవరా అని. ఎదురుగా ఎర్రటి కండ్లతో నిలబడి ఉన్నాడు రాజారెడ్డి. చూడగానే భయం వేసింది లక్ష్మికి. “అన్నయ్యా రా కూర్చో “అన్నది భయపడుతూనే మర్యాద కోసం.
“నేను కూర్చోవడానికి రాలేదు.” అన్నాడు. అతని ఉచ్చ్వాస, నిశ్వాసలు పాము బుసలు కొడుతున్నట్లుగా వినిపిస్తున్నాయి.
రాజారెడ్డి ఎందుకలా ఉన్నాడో ఊహించింది లక్ష్మి. కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. వంట గదిలోకి వెళ్లి గ్లాసులో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది.
ఆమె చేతిలో గ్లాసు ఉండగానే దాన్ని గట్టిగా తోసేశాడు. అది జారి కింద పడింది. నీళ్లన్నీ హాల్లో పరుచుకుపోయాయి. గ్లాసు గిరగిరా తిరిగి ఓ మూలకు పోయి ఆగిపోయింది.
లక్ష్మి కోపంగా చూసింది. “ఏంటీ నువ్వు చేస్తున్న పని??” అడిగేశాడు రాజారెడ్డి.
మౌనంగా ఉంది లక్ష్మి. ముఖం తిప్పుకుని పక్కకు చూస్తూ నిలబడ్డది. “నీ మొగుడి ఫ్రెండ్ తో రంకు సాగిస్తావా? నీకు సిగ్గు లేదా?? ఛీ ఛీ నీదీ ఓ బతుకేనా?” తిట్ల దండకం అందుకున్నాడు. “నువ్వొక ఆడదానివేనా? పైగా పూజలు పురస్కారాలు నీ ముఖానికి.”
“విఠల్ ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందే..” ‘ఒసే’ కు దిగాడు. కంట్రోల్ తప్పుతున్నాడు. “వాడో నీతి జాతి లేని కుక్క. గాడిద ముఖం వేసుకొని వాడు వాని అవతారం…” కసితీరా తిట్టాలనుకుంటున్నాడు. బూతులు రావడం లేదు. “ఎంతకు బరితెగించావే??” ఇంకా ఏదో అనబోయాడు. తోక తొక్కిన తాచులా ఒక్కసారిగా విరుచుకుపడింది లక్ష్మి. “మూస్తావా? ఇంక చాలు నీ ఉపదేశాలు??” “నోర్మూసుకుని బయటకు నడు… మర్యాదగా” అన్నది.
లక్ష్మి ముఖం ఎర్రగా కందగడ్డలా మారింది. కళ్లు ఎరుపెక్కాయి. కళ్లలో చెమ్మ కనిపిస్తుంది. ఎంత దాచుకున్నా అవి దాగడం లేదు. చేతి గేటు వైపు చూపిస్తూ అలాగే నిలబడి ఉంది.
కాళీ మాత ఉగ్రరూపంలా ఉంది ఆమెను చూస్తే రాజారెడ్డికి. “పోతానే పోతాను. నీ బండారమంతా విఠల్ తో చెప్పిన తర్వాతే పోతాను.”
ఏం మాట్లాడుతున్నాడో రాజారెడ్డికి అర్థం కావడం లేదు. లక్ష్మి ఒక్కసారిగా అలా ఎదురుతిరుగుతుందని ఊహించలేకపోయాడు.
భయపడుతుందనుకున్నాడు. వేడుకుంటుందనుకున్నాడు.
ఇంకా బాగా తిట్టి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయ్యే సరికి ఇగో హర్టయ్యింది రాజారెడ్డికి. “దానికే అంతుంటే నాకెంత ఉండాలె..” అనుకున్నాడు. శరీరం కుతకుత ఉడుకుతోంది.
“పాపం విఠల్ గాడు ఏం పాపం చేశాడే పాపిష్టిదానా? వాడికి నీలాంటి పెళ్లాం దొరికింది వాడి కర్మకాకపోతే” అన్నాడు.
అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన లక్ష్మి కొంత చల్లబడింది. పమిట చెంగుతో నుదిటికి పట్టిన చెమటలు తుడుచుకున్నది.
లోనికి వెళ్లింది. మంచినీళ్లు తాగింది. ఐదు నిమిషాలు… ఆమె ఇంకా రాలేదు.
అలాగే చూస్తూ ఉన్నాడు రాజారెడ్డి. రాజారెడ్డిలో కూడా కొంచెం కొంచెంగా ఆవేశం చల్లబడుతున్నది.
మరో ఐదు నిమిషాల తర్వాత చాయ్ గ్లాసుతో బయటకు వచ్చింది లక్ష్మి. రాజారెడ్డి అహం చల్లబడింది. “ఇపుడు దారికొచ్చింది దొంగముండా” అని మనసులో అనుకున్నాడు. “లేకపోతే నన్నే ఎదురిస్తుందా? చేసేదంతా చేసి నోరు చేసుకుని పడివుండక??” “దీన్ని ఇలా కాదు…..” అని ఏదో అనుకుంటుండగా… “చాయ్ తాగండి అన్న… కాస్త నేను చెప్పేది వినండి…” కోపాన్ని అణుచుకుంటూ ఓపికను తెచ్చుకుంటూ అన్నది ఆమె.
ముఖం అటు తిప్పుకున్నాడు. చాయ్ గ్లాసు తీసుకోలేదు. మళ్లీ దాన్ని ఎక్కడా విసిరి గొడతాడోనని పక్కనే ఉ న్నకిటికీ అంచు పై పెట్టింది. లోనికి వెళ్లి మరో గ్లాసు మంచినీళ్లు తీసుకొచ్చి చాయ్ గ్లాస్ పక్కనే పెట్టింది. కుర్చీని రాజారెడ్డి దగ్గరగా జరిపింది కూర్చోమన్నట్లుగా.
తనూ దూరంగా ఓ కుర్చీలో వెళ్లి కూర్చున్నది. టీవీ సైలెంట్ గా నడుస్తూనే ఉన్నది. దాన్ని బంద్ చేసి వచ్చి మళ్లీ కూర్చున్నది.
ఏదో గుర్తొచ్చినట్లుగా లోనికి వెళ్లి ఓ చాయ్ గ్లాసుతో తిరిగి వచ్చింది. కుర్చీలో కూర్చుని తాగసాగింది. మళ్లీ ఇగో దెబ్బతిన్నది రాజారెడ్డికి. “దీనికెంత కండకావరం.” “చాయ్ తాగమని మరో రెండు మూడు సార్లు బతిమాలొచ్చు కదా….” “లం.. ముండా దీనికే అంత పొగరుంటే నాకెంత ఉండాలే….” అప్పటి వరకు చాయ్ తాగాలన్న కోరికను ఇక బలంగా లోపలే అణిచేసుకున్నాడు. ఆమె చాయ్ తాగేసి గ్లాసు కింద పెట్టింది. “కూర్చోండి” అన్నది. “వీడెక్కడి నసగాడురా… నేనిలా బుక్కయ్యనేందీ?” అనుకున్నది ఆమె.
మొండికేస్తున్నాడు రాజారెడ్డి. అలాగే నిలబడ్డాడు. “ఇప్పుడు చెప్పు… ఎప్పట్నుంచి సాగుతుందీ యవ్వారం??” పోలీసు దొంగను ఇంటరాగేషన్ చేసినట్లే అడిగాడు రాజారెడ్డి. “నీకేందిరా చెప్పేది? “అన్నట్లు చూసింది లక్ష్మి. “నువ్వు కోపాన్ని తగ్గించుకుంటే నీనన్నీ చెబుతాను…” అన్నది “ముందా కుర్చీలో కూర్చుంటావా?” అన్నది కొంచెం అసహనంగా. అప్పుడే పక్కింటి సరోజా లోనికి వచ్చింది.
వీరిద్దరినీ అలా చూసి ఆశ్చర్యపోయింది. జుట్టు రేగిపోయి రాజారెడ్డి గోడకు చేతి ఆనించి నిలబడటం ఆమెలో కొత్త అనుమానాలకు తావిచ్చింది.
ముఖంలో ఆ ఆశ్చర్యాన్ని అలాగే ఉంచుకొని… “ఏం కూర లక్ష్మి ”
“నేను ఆలుగడ్డ వండిన. మీ అన్నకు అదంటే ముద్ద దిగదు” అన్నది. వచ్చిన కారణం చెప్పి మరోమారు ఇళ్లంతా కలియజూసింది.
తన అనుమానం నివృత్తి కావడానికి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అన్నట్లుగా.
లోనికి వెళ్లింది లక్ష్మి. టమాట కూరను ఓ కథ లో తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆ గిన్నెను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది సరోజ.
“టమాటనా…. ?మంచి వాసన వస్తున్నది.” అన్నది మెచ్చుకుంటు.
ఇంకొంచెం సేపు మాట్లాడాలనే ఉన్నది సరోజకు. కానీ అక్కడ గంభీరమైన వాతావరణం చూసి ఎక్కువ మాట్లాడలేకపోయింది. ” సరే వదిన వస్తా.. నేను ఇంకా తినలేదు” అన్నది.
“నువ్వు తిన్నవా” అన్నది వెళ్లిపోతూ…. పోతూ పోతూ ఓ చూపు రాజారెడ్డి వైపు చూసింది. అతను ఆమెను చూడటం లేదు. గోడను చూస్తున్నాడు. “తినలేదు వదినా… మీ అన్న వచ్చే టైం అయింది. ఇద్దరం కలిసి తింటాం…” బదులిచ్చింది లక్ష్మి.
(ఇంకా ఉంది)
