కొండపొలం .. గొర్ల కాపరుల సినిమా. కరువు కాలంలో గొర్లకు తాగేందుకు కూడా నీళ్లు కరువైన పరిస్థితుల్లో ఎక్కడో కొండకోనల్లో.. గుట్టల్లో.. అడవుల్లోకి వెళ్లి.. అక్కడే జీవాలను మేపుకునే ప్రక్రియను కొండపొలం అని అంటారు రాయలసీమలో. ఇదే పేరుతో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నవల రాశాడు. దాన్నే క్రిష్ జాగర్లముడి సినిమా తీశాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లు. సినిమా బాగుంది. నిన్ననే విడుదలైంది. సరే ఇప్పుడిదంతా ఎందుకు..? అన్ని సైట్లు దీని గురించి రాసేశాయి కదా..! అంటారు. ఆగండి.. జర.. అదే విషయానికొస్తున్నాను. మన హరీశ్‌రావు ఉన్నాడు కదా. అదేనండి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు. ఆయన కూడా కొండపొలం చేస్తున్నాడు. ఏందీ..? హరీశ్ రావేందీ..? కొండపొలమేందీ..? ఆయనకు, గొర్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది. కానీ ఆయన కొండపొలం చేయడం లేదు. గొర్లకాపరుల కోసం ఓ కొండపొలాన్నే ఏర్పాటు చేశాడు. అవును.. నిజం.
సిద్దిపేటలో ఓ రెండుమూడు ఎకరాల్లో గొర్ల కోసం ఆయన గొర్రెల హాస్టల్ ఒకటి ఏర్పాటు చేశాడు. గొర్లకాపరులు గొర్లను తీసుకుని ఎక్కడెక్కడో తిరిగే బదులు ఈ హాస్టల్లో గొర్లను ఎంచక్కా మేపుకోవచ్చన్నమాట. అంటే మేత, నీళ్లు.. అన్నీ అక్కడే. అదే కొండపొలం. ఎక్కడో గుట్టల్లో, అడవుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. అలా మన హరీశ్‌రావు సిద్దిపేటలో గొర్లకాపరుల కోసం కొండపొలం ఏర్పాటు చేశాడు. ఇది ఎవరికీ తెలియదు. ఆయనే స్వయంగా మొన్న హుజురాబాద్‌లో ప్రచారం చేస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. టీఆరెస్ అభ్యర్థి ని గెలిపిస్తే.. ఇక్కడ కూడా ఓ గొర్ల హాస్టల్.. అదే కొండపొలం ఏర్పాటు చేయిస్తాడట.