ఈనాడు భాషను అర్థం చేసుకోవాలంటే తెలుగు నిఘంటువొకటి దగ్గర పెట్టుకోవాలేమో. బూదరాజు రాధాక్రిష్ణ వద్ద కూడా ఈ పదజాలాలు దొరకవు కచ్చితంగా. వీటిని డెస్క్‌లో కూర్చుని సృష్టిస్తుంటారు సృష్టికర్తలు. మహానుభావులు. ఎలా వస్తాయో వీరికి ఈ అవిడియాలు. ట్రూ ట్రాన్స్‌లేషన్ చేసేసి అలా జనాల మీదకు తోసిసి కసి తీర్చుకుంటారు కాబోలు. ఒక్కటే అర్థం కాదు.. పత్రిక భాష అంటే జనం మాట్లాడే కాదా? దీనికి అతీతమైందా? పత్రిక భాష అంటే సామాన్య జనానికి అర్థం కాకుండా రాయడేనా? అప్పుడే దానికి ఓ స్ట్రేచర్, ఓ హుందాతనం, ఓ గొప్పతనం ఉన్నట్టా.. అదే అనుకుంటున్నది ఈ ఈనాడు.
అన్ని పత్రికలవీ దాదాపు ఇదే తీరు. కానీ ఈనాడు తెలుగు పదాల సృష్టికర్త కాబట్టి పదాలకు, అర్థాలకు తెగులు పడుతూ ఉంటుంది. ఓ పట్టాన సామాన్యుడి బుర్రకు ఎక్కవు. ఎక్కకపోతేనే దాన్ని అమితంగా పాఠకుడు గౌరవించి అక్కున చేర్చుకుంటాడు. సర్క్యూలేషన్ ఆమాంతం పెరిగిపోతూ ఉంటుంది. అదీ రహస్యం. ఈనాడు డెస్క్ అనే ప్రయోగ శాలలో ఇంకెన్ని పద ప్రయోగాలు, అర్థాల తాత్పర్యాలు పుట్టుకొస్తాయో? ఎన్ని వికటించి వికారపు వాంతులు, విరేచనాలు రప్పిస్తాయో? జీవితంపై విరక్తి కలిగిస్తాయో?
అవునూ.. మడత కాజాలా.. ఈ మడత చాకు ఏందీ భయ్యా…? బహుశా బటన్ చాకు అయ్యుంటుంది. ఇంటర్నెట్‌కు అంతర్జాలమని ఎప్పుడో నామకరణం చేసేశారు. ఇప్పుడిది పాఠకులకు బాగానే అర్థం అవుతుంది. కానీ బయట ఎక్కడైనా కొద్ది సేపు అంతర్జాలం వాడుకోవచ్చా? అని అడిగారనుకో.. పిచ్చోడిని చూసినట్టు చూసి.. వీడికి ఈనాడు తెగులు పట్టుకుందిరో… అని నవ్వుకుంటారు. చరవాణి అని సెల్‌ఫోన్‌ను బదులుగా వాడావనుకో… నీ నుంచి పారిపోయేందుకు వారంతా చరచరా ముందుకు పారిపోతారు తప్పితే. ఒక్కమాట కూడా నీతో మాట్లాడానికి సాహసించరు. పత్రికలో వచ్చింది చదివి వదిలెయ్యాలె. అది వాడుక భాష కాదు. పలుకుబడుల భాష అంతకన్నా కాదు. పోనీ బడి పలుకలు భాషా..? అంటే అదీ కాదు. ఇది ఈనాడు డెస్క్ ప్రయోగశాల పైత్యపు వికారపు భాష.