లవ్‌స్టోరీ. నాగచైతన్య సినిమా. శేఖర్ కమ్ముల తనదైన టేకింగ్‌తో తీసినా.. కథ మాత్రం కొత్తగా ఉంది. దళితుడు హీరో. ఆర్మూర్‌కు చెందిన వాడు. అదే ఊరుకు చెందిన పటేళ్ల బిడ్డను ప్రేమిస్తాడు. సహజంగా వాళ్లు ఒప్పుకోరు. ఇదెప్పుడో పాతచింతకాయ పచ్చడి సినిమా కథలా ఉంది. మరీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు తీయాలా బాసూ..? అవసరమా? అని చాలా మంది అన్నారు. అవసరమా.. ? కాదా? అన్నది పక్కన పెడితే.. ఈ వివక్ష ఇంకా బలంగా వేళ్లూనుకున్నదే తప్ప. తగ్గలేదు. అది మాత్రం నిజం. ఇంకా వందేళ్లు గడిచినా ఇలాగే ఉంటుంది. ఏమాత్రం మార్పుండదు. దళిత బంధు లాంటి ఇంకో వంద పథకాలు పెట్టినా సరే. వివక్షను, ఈ రుగ్మతను రూపుమాపలేం.
ఆర్మూర్, పిప్రి చుట్టూ ఈ కథ తిప్పిండు కాబట్టి.. ఇక్కడ అంతలా ఉందా వివక్ష. దళితులంటే ఇంకా అంటరానివాళ్లుగా చూస్తున్నారా? ఇప్పటికీ చెప్పులు గేటు బయటే వదిలి వెళ్లాలా? మాలోడా, మాదిగోడా అని ఓరేయ్ అని పిలుస్తారా? అవును. ఇవన్నీ అలాగే ఉన్నాయి. కొంత తేడా తప్ప. అవి అలాగే వర్దిల్లుతున్నాయి. ఇదొక్క ఆర్మూర్‌కే కాదు పరిమితం. అన్ని పల్లెల్లో తెలంగాణ వ్యాప్తంగా. ఇదే చెప్పాలనుకున్నాడు శేఖర్ కమ్ముల. చెప్పే విషయంలో కొంత తడబడ్డాడు. కానీ కంటెంట్ మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజవర్గాల్లో ఈ కుల వివక్షకు అదనంగా… వీడీసీల పెత్తనం, దౌర్జన్యం ఉంటుంది. విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ పేరుతో అంతా వీరే నడిపిస్తారు. జరిమానాలు విధిస్తారు. సాంఘిక బహష్కరణలు చేస్తారు. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండని తెగేసి చెప్తారు. అలాంటి వ్యవస్థ కూడా ఇక్కడ వేళ్లూనుకుని ఉంది. రాజకీయ వ్యవస్థ కూడా వీరికి దాసోహమే. ఎందుకంటే వీరు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ సర్పంచు మొదలుకొని, ఎమ్మెల్యే దాకా ఎవరూ గెలవురు మరి. వీరు వేసే శిక్షలకు బలయ్యేది దళితులు, బడుగులు.