కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేశారు. అందరికి స్పష్టంగా అర్ధమైంది ఒక్కటే. కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమయ్యేలా చేశాడని. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ చర్చ జరిగింది. టీఆరెఎస్, బీజేపీ ఒక్కటే అనే సంకేతం మరోసారి ఇచ్చినట్లయింది. రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా ఈ వ్యవహారం మింగుడు పడలేదు. హుజురాబాద్‌లో పరిస్థితి వేరు. ఎందుకంటే.. అక్కడ బీజేపీని కాకుండా ఈటల రాజేందర్‌నే చూస్తున్నారు. అంతో ఇంతో రాజేందర్ వల్ల పార్టీకి మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదు. కానీ ఎన్నిక వాయిదా వేయడం మూలంగా టీఆరెఎస్, బీజేపీ ఒక్కటే అనే ముద్ర పడడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో బీజేపీకి నష్టం జరుగుతుందనేది ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కాట్‌పల్లి సంతోష్ రెడ్డి.. ఈయన హార్డ్‌కోర్ బీజేపీ అభిమాని. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే తత్వం. ఈ రోజు తన ఫేస్‌బుక్ వాల్ పై ఇదే విషయం ప్రస్తావిస్తూ కామెంట్ చేశాడు. తెలంగాణలో మంచి ఊపు మీదున్న బీజేపీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా వేయడం వలన కేసీఆర్ పర్యటనలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తెలంగాణ ప్రజలలో బీజేపీ, టీఆరెఎస్ ఒక్కటే అనే భావన కలుగుతున్నది. ఇటువంటి చర్యలు తెలంగాణలో బీజేపీకి నష్టం చేస్తాయి.. అని కామెంట్ చేశాడు.