కరోనా ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు చంపుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడిపిన జనానికి ప్రస్తుత పరిస్థితులు ఊరటనిస్తున్నాయి. ఇప్పట్లో కరోనా థర్డ్‌వేవ్ వచ్చేలా లేదని అధికారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో కూడా కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. కానీ ఒక్కసారిగా వైరస్ జ్వరాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జనాలను ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏ దవాఖాన చూసినా వైరస్ జ్వరాలతో మంచం పట్టిన రోగులతో కిటకిటలాడుతు కనిపిస్తున్నాయి.
డెంగ్యూ మళ్లీ పంజా విప్పింది. గతేడాది కొంత కంట్రోల్‌లో ఉందని భావించారు. ఈ సారి కూడా పెద్దగా దీని వలన ప్రమాదం ఉండబోదని అనుకున్నారు. కానీ రెండేండ్ల కింది సీన్ రిపీట్ అవుతున్నది. రెండేండ్ల కింద విపరీతమైన డెంగ్యూ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు పేదలను పీల్చి పిప్పి చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తుంది.
ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయంటూ వేలల్లో ఫీజులు గుంజుతున్నారు. ఇంకా మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగనుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఇంకా విపరీతంగా కేసులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పరిస్థతి అదుపుతప్పే ప్రమాదం కనబడుతున్నది. మొన్నటి వరకు కరోనా మీదనే దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇక అది రావడం లేదని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వైరల్ కేసుల పట్ల పెద్దగా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు కనబడడం లేదు.