అధి అధికారపార్టీ పత్రిక. ఇతర పత్రికలతో పోల్చితే జీతాలు బాగుండాలి. కానీ ఉండవు. ప్రతీ ఏడు ఇంక్రిమెంట్లు,బోనస్‌లు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. పత్రిక విలువలు అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి ఇతర పత్రికలు కూడా. కొత్తగా ఎడిటర్ వచ్చిన తర్వాత చేసిన సంస్కరణలు.. ఇతర ప్రతికలకు బాట చూపాయి. ఇలాంటి తెగువ కూడా చెయ్యొచ్చా..? జీతగాళ్ల జీవితాలను ఇలా నడిరోడ్డు మీద పడేయొచ్చా? ఏం కాదా? ఎవరూ అడగరా? ఇలాంటి ఎన్నో సందేహాలకు కొత్త ఎడిటర్ సమాధానాలిచ్చి సంపాదకుల లోకానికే ఆదర్శంగా నిలిచాడు. మేనేజ్‌మెంట్‌కు ఆయనో బంగారు బాతు. ఎంత మందిని చంపితే మాకేందీ? మా సంస్థ లాభాల్లో ఉంది అది చాలు.ఇదే అనుకుంది మేనేజ్‌మెంట్. కళ్లకద్దకున్నది. భుజానికెత్తుకుని ఊరేగింది. పాలకులు పత్రిక అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని శభాష్ అని కితాబిచ్చారు.
జీతాలు పెంచలేదు. మూడేండ్ల నుంచి. మీ జీవితాలే గాలిలో దీపాలు. ఇంక మీకు జీతాలా? ఆయన కళ్లద్దాలలోంచి చూసే ఆ చూపులకు ఇవే అర్థాలు వచ్చేవి. బతుకు జీవుడా అంటూ క్యాబిన్‌లోంచి పారిపోయి ప్రాణాలు.. అదే జీతాలు దక్కించుకోవడమే ఆ ఉద్యోగుల డ్యూటీ అయ్యింది. ఇలా మూడేండ్లు గడిచాయి. ఉన్నపళంగా ఓ రోజు తలో పదివేలు అకౌంట్లో పడ్డాయి. పండుగ జేసుకోండ్రా అబ్బాయిలూ అని ఆ కళ్లద్దాల నుంచి చూసే ఆ డేగ చూపులను చూసి నమ్మకలేకపోయారు. ఏందీ మా సారేనా ? పదివేలు బోనస్ ఏసింది.. అని సంబరపడి చెక్ చేసుకున్నారు. నిజమే.. కానీ నమ్మలేకపోయారు. కరోనా కన్నా కఠినాత్ముడు అనుకున్నాం కదా.. ఇలా ఒక్కసారిగా కరుణామయుడెలా అయ్యాడు.?
అరే మరి మూడేండ్ల నుంచి వందల మందిని తీసేసిండు.. ఆ జీతాలు బాగనే వెనకేసుకున్నరు కదా?
అవును.
ఉన్నోళ్లకు కూడా మూడేండ్ల నుంచి పైసా పెంచలేదు.. కదా.. వాళ్లు కూడా లాసే కదా..
అవును..
మరి.. ఈ పదివేలకే అంతలా మురుస్తున్నవేందిరా..?
మన బాసులాంటి వాడున్నచోట…ఈ జీవితాలకు ఇదే పదివేలు బాసు..