హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడడంతో మొన్నటి వరకు ఉన్న రాజకీయ వేడి క్రమంగా చల్లబడుతున్నది. అధికార పార్టీ టీఆరెస్ ఇదే జరగాలనే వ్యూహం.. అమలవుతున్నది. ఇప్పుడు ఈటల రాజేందర్‌కు ఇబ్బందికర పరిణామం ఏర్పడుతున్నది. మరో మూడు నెలల వరకు ఎన్నిక జరిగే అవకాశం లేకపోవడంతో అప్పటి వరకు ఇదే టెంపోను మెయింటేన్ చేయడం ఈటలకు తలకుమించిన భారంలా మారనుంది.
ఇప్పటికే టీఆరెస్ శక్తులన్నింటినీ మోహరించి ఈటలను అన్న విధాలుగా నిర్వీర్యం చేసే ప్రయోగాలు మొదలు పెట్టింది. అందులో సక్సెస్ అవుతూ వస్తున్నది కూడా. ఉప ఎన్నిక షెడ్యూల్ రేపో మాపో వెలువడుతుందనే ఆశతో ఉన్న ఈటల రాజేందర్‌కు ఈ వాయిదా రాజకీయ పరిణామాలు షాక్‌నిచ్చాయి. ఇప్పటికే బీజేపీ పెద్దల నుంచి సరైన అండదండలు, మద్ధతు లేవనే ప్రచారం జనాల్లో ఉంది.
ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నాడనే సంకేతాలున్నాయి. అయినప్పటికీ ఈటల రాజేందర్ అధికార పార్టీ టీఆరెస్‌తో గట్టిగానే ఢీ కొట్టేందుకు నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన టీఆరెస్ ఈటలకు మిగిలి ఉన్న శక్తిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయాలంటే ఎన్నికలు మరింత ఆలస్యం కావాలని కోరుకున్నది. అలాగే చేసి తీరింది. అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఈ మూడు నెలలు ఇదే టెంపోతో ముందుకు సాగాలంటే ఈటలకు ఖర్చు తడిసి మోపడవుతుంది. టీఆరెస్‌కు మరింత శక్తిని ప్రోది చేసుకునేందుకు ఇదొక సువర్ణావకాశం కానుంది. పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణ సంకటంమంటే ఇదేనెమో…