ఆరంభింప‌రు నీచ మాన‌వులు విఘ్నా యాస సంత్రుస్తులై..
యారంభించి ప‌రిత్య‌జించుతురు విఘ్న‌యాత్తులై మాధ్య‌ముల్
ధీరుల్ విఘ్న నిహ‌న్య మానుల‌గుచున్ ధ్రుత్యున్న‌తోత్సాహులై
ప్రారబ్దార్ధ‌ము లుజ్జ‌గింప‌రు సుమీ ప్ర‌జ్ఞానిధుల్ గావున‌న్‌…

కేసీఆర్‌కు ఇష్ట‌మైన ప‌ద్యం.. ప‌దే ప‌దే గుర్తు చేస్తుంటాడు.

ఎంద‌రో పార్టీలు పెట్టారు. త‌ర్వాత విలీనం ద్వారా క‌నుమ‌రుగ‌య్యారు. ఉద్దేశ్యం ఏదైనా పార్టీని న‌డ‌ప‌డం అంత ఈజీగా కాదు. ఒక ల‌క్ష్యం కోసం పార్టీని స్థాపించి అనుకున్న దాని కోసం అవ‌మానాలు, ఛీత్కారాలు భ‌రించి అంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాడు కేసీఆర్‌. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆత్మ‌గౌర‌వ పతాకాన్ని ప‌తాక‌క‌స్థాయికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క‌భూమిక పోషించి చ‌రిత్ర పుట‌ల్లో త‌న‌కు కొన్ని పేజీల‌ను కేటాయించుకున్నాడు. ఉద్య‌మం న‌డిచిన‌ప్పుడు ఉద్య‌మ నాయ‌కుడిగా, ప్ర‌భుత్వ ఏర్పాటు త‌ర్వాత రాజ‌కీయ‌వేత్త‌గా ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో తీసుకున్నాడు. విమ‌ర్శ‌ల‌నెదుర్కున్నాడు. అయినా అనుకున్న‌దే చేశాడు. చాలా సార్లు తప్పిదాలు జ‌ర‌గొచ్చు. పార్టీకి న‌ష్టం కల‌గొచ్చు. కానీ తాను అనుకున్న‌దే చేశాడు. అలాగే ముందుకు న‌డిపించాడు. ఎన్నో మ‌జిలీలు, వ‌చ్చేవాళ్లు వ‌చ్చారు. పోయేవాళ్లు పోయారు. తిట్టే వాళ్లు తిట్టారు. పొడిగేవాళ్లు పొగిడారు. దుమ్మెత్తిపోసే వాళ్లు పోశారు. ఆకాశానికెత్తే వాళ్లు ఎత్తుతూనే ఉన్నారు. కానీ పార్టీ ప్ర‌యాణం ముందుకే సాగుతున్న‌ది. అక్క‌డ‌క్క‌డ‌, అప్పుడ‌ప్పుడు కొంత నిస్తేజం, అనిశ్చితి.. అంతే. ఆ త‌ర్వా మ‌ళ్లీ లేచిన కెర‌ట‌మే.

బ‌లమైన శ‌క్తులు పొంచివున్న సంద‌ర్భంలో, ఒక్క‌డు ఏకాకిగా మొద‌లై అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోయే వేదిక‌గా టీఆరెస్‌ను మ‌ల‌చ‌లిగాడు కేసీఆర్‌. అందులో అంద‌రి న‌మ్మ‌కాన్ని చూర‌గొన్నాడు. ఎవ‌రో ఒక‌రుండాలి. తెలంగాణ సోయి తెలిసిన‌వాడై ఉండాలి. ఇక్క‌డి క‌ష్టాలు క‌ళ్ల చూసిన‌వాడై ఉండాలి. జ‌నం నాడి తెలిసిన‌వాడై ఉండాలి. మ‌డ‌మ‌తిప్ప‌ని పోరాటం చేసేవాడై ఉండాలి. అవ‌న్నీ అర్హ‌త‌లు కేసీఆర్‌లో క‌నిపించాయి జ‌నానికి. అందుకే స‌బ్బండ‌వ‌ర్ణాలు వెంట న‌డిచారు. పిల్లాజెల్లా జై కొట్టారు. ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ప‌తాక‌స్థాయికి తీసుకురాగ‌లిగారు. స్వ‌రాష్ట్ర కాంక్ష‌ను ఢిల్లీకి వినిపించ‌గ‌లిగారు.
అనుకున్న‌ది సాధించిన కేసీఆర్ ఆ త‌ర్వాత పంథా మార్చాడు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన త‌ర్వాత ఇటు పార్టీ, అటు ప్ర‌భుత్వ సుస్థిర‌తే ప్రధాన ధ్యేయంగా అడుగులేశాడు. నియంత‌లా వ్య‌వ‌హ‌రించాడు. కొట్లాడి తెచ్చుకున్న‌ది నిల‌బ‌డి నిల‌బెట్టుకోవాలె.. అన్న దానికే క‌ట్టుబ‌డి ఉన్నాడు. కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణ‌యాలు విమ‌ర్శ‌ల‌నెదుర్కున్నాయి. ఆయ‌న ఆలోచ‌న‌లు చ‌ర్చ‌కు తెర‌తీశాయి. అయినా అనుకున్న‌దే చేశాడు. ఇప్పుడు ఢిల్లీలో టీఆరెస్ పార్టీ భ‌వ‌న నిర్మాణానికి శంఖుస్థాప‌న రాయి ప‌డేంత వ‌ర‌కు ఆయ‌న పోరాడుతూనే ఉన్నాడు. ఒంట‌రిగా.

చివ‌రి వ‌ర‌కు ఎవ‌రుంటారో.. పోతారో తెలియ‌దు. కానీ కేసీఆర్ హ‌యాంలో ఏర్ప‌డిన చారిత్ర‌క గుర్తులు మాత్రం చ‌రిత్ర‌లో ఉండిపోతాయి. అలా ఉండిపోవాల‌నే కేసీఆర్ ఆలోచ‌న‌. అందుకే ఇదంతా.