(దండుగుల శ్రీనివాస్)
పార్టీలకు బీసీ రాగం అందుకోవడం కొత్తేమీ కాదు. అవసరమొచ్చినప్పుడు, ఎన్నికలప్పుడు, రాజకీయ లబ్ది కోసం.. దశాబ్దాలుగా వస్తున్న పదమే ఇదీ. నినాదమే ఇదీ. ఇప్పుడు ఇది పీక్కు చేరింది. తాడోపేడో తేల్చుకునేందుకు బరి గీసి నిలిచింది. దీనికి కాంగ్రెస్ ఆజ్యం పోసింది. పులి మీద స్వారీ చేస్తోంది. దిగితే అంతే సంగతులు. ఇక బీసీ వ్యతిరేక పార్టీలుగా ముద్రపడిన బీఆరెస్, బీజేపీ కూడా బీసీ జపం చేస్తోంది. ఈనెల 14న కరీంనగర్లో ఏకంగా బీసీల కోసం ఓ బహిరంగ సభనే ఏర్పాటు చేస్తోంది బీఆరెస్. ఎంత హా..శ్చర్యం! అవును. ఇది నిజమే. రెడ్లతోనే అధికారమని గట్టిగా నమ్మిన కేసీఆర్.. బీసీ జపం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీసీలకున్న రిజర్వేషన్లు మరింత తొక్కేసి పీచమణిచిన కేసీఆర్.. బీసీల రిజర్వేషన్ల కోసం రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ అడుగుతాడట. అబ్బా.. అబ్బా.. ! ఎంత మార్పు. ఈ మార్పు తీసుకొచ్చిందెవరు? కచ్చితంగా కాంగ్రెస్సే. అందులో డౌట్లేదు. కులగణన పేరుతో మొదలైన ఈ అంకం… బీసీల రిజర్వేషన్ దాకా వచ్చింది. ఇక ఆగదు. ఇప్పుడు నడుస్తున్నది బీసీ నామా సంవత్సరం. నడవబోయేదీ బీసీ నామా సంవత్సరం. బీజేపీ ముస్లింల వంకతో తప్పించుకోవాలని చూసినా.. అదీ బీసీలకు టికెట్లు గణనీయంగా ఇవ్వాల్సిందే. బీసీల బద్ద శత్రువు కేసీయారూ బీసీలకు ప్రయార్టీ ఇవ్వాల్సిందే. దీనికి మూలం ఎవరు? ఇంత అగత్యం పట్టించిన ఆ పార్టీ ఏదీ? కచ్చితంగా కాంగ్రెస్సే. డౌట్ లేదు.
ఇప్పుడు బీసీలు ఎవరిని నమ్మాలి. బీసీల రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాల్సిందేనని తెరపైకి తెచ్చి ఢిల్లీదాకా వెళ్లి కొట్లాడిన కాంగ్రెస్నా? తప్పుదు కాబట్టి.. మేమూ వెనకబడలేదు.. బీసీల విషయంలో ముందే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్నా?? మాది అగ్రవర్ణాల పార్టీ .. బీసీలకు అంత సీన్ లేదు.. అని నమ్మిన హిందుత్వా పార్టీనా?
