ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మార్చిన కేసీఆర్.. సీఎంగా పరిపాలన సుస్థిరం చేసుకునే క్రమంలో కొత్త పాలనకు తెర తీశాడు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా ముద్ర పడ్డ ఇతర పార్టీల నేతలను దగ్గర తీసి, దరి చేర్చుకుని, పదవులిచ్చి భుజానికెత్తుకున్నాడు. కేసీఆర్ ఈ వ్యవహర ధోరణి ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నది. అయినా డోంట్ కేర్.. పట్టించుకోలేదు. అనుకున్నది చేస్తూ పోయాడు. కావాల్సిన ఫలితం రాబడుతూ వచ్చాడు.
పర్యవసానాలు పట్టించుకోలేదు. విమర్శలు లెక్క చేయలేదు. అధికార సుస్థిరత, పార్టీ బలోపేతం ఈ రెండూ రెండు కళ్లుగా కేసీఆర్ తన పాలనను కొనసాగించాడు. ఇక కేసీఆర్ శకం ముగుస్తున్నట్టుగా అనిపిస్తున్నది. మొన్న మధ్యంతర ఎన్నికలకు వెళ్లినప్పుడే కేటీఆర్‌ను సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడని భావించారు. కానీ కేసీఆర్ అనుకున్నట్లు జరగలే. మధ్యలో తను తప్పుకుని కేటీఆర్‌ను సీఎం చేయాలనే ఆలోచన కూడా జరిగింది. కానీ పరిస్థితులన్నీ కలిసిరాలె.
దీంతో ఇటు కేసీఆర్.. అటు కేటీఆర్ సమయం కోసం ఎదురుచూశారు. ఓపిక పట్టారు. ఇప్పుడు కేటీఆర్ శకం మొదలైనట్టుగా కనిపిస్తున్నది. మంత్రి వర్గంతో పాటు ఎమ్మెల్యేలంతా కేటీఆర్ చెప్పినట్లు వినాలి. తన టీం తనకుండాలనే తాపత్రయం కేటీఆర్‌కు ఉంది. ఇప్పుడున్న టీమ్‌లో చాలా మందిని కేటీఆర్ ఇష్టపడడం లేదు. వారందరికీ రాబోయే ఎన్నికల్లో చెక్ పడనుంది. తను కూర్చోమంటే కూర్చోని, నిలబడమంటే నిలబడే టీమ్ కావాలి. ప్రస్తుతానికి ఇప్పుడున్న వారిలో తన టీమ్‌ను ఎంచుకున్నాడు. ఆ టీమ్‌తో తను అనుకున్న పద్ధతులు, విధానాలను జనాల్లోకి తీసుకువెళ్తున్నాడు.
ఉప ఎన్నికల్లో యువ రక్తానికే ప్రాధాన్యతనిచ్చాడు. నాగార్జున సాగర్‌లో భగత్, హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ ల ఎంపిక కేటీఆర్‌దే. ఇక రానున్న ఎన్నికల్లో కూడా అంతా యూత్‌కే ప్రాధాన్యం. కేటీఆర్ మార్క్ స్పష్టంగా కనబడనున్నది. ఇప్పుడు కేటీఆర్ ఏం చెబితే అది కేసీఆర్ చేస్తాడు. ఆ తర్వాత కేటీఆరే మొత్తం తను అనుకున్నట్లు చేస్తాడు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం పెరిగింది. అంతకు ముందు నుంచీ అర్వింద్, బండి సంజయ్, తీన్మార్ మల్లన్న తదితరులు కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. కానీ పెద్దగా స్పందించలేదు కేసీఆర్. ఓపిక పట్టాడు. హుందాగా ఉండేందుకే ప్రయత్నం చేశాడు. కానీ కేటీఆర్ పార్టీలో కొత్త ట్రెండ్‌ను ప్రవేశపెట్టాడు.
తిట్టుకు తిట్టు.. దెబ్బకు దెబ్బ.. ఇప్పుడిదే నినాదం కేటీఆర్‌ది. మైనంపల్లి హన్మంత్‌రావు, జీవన్ రెడ్డి, మల్లారెడ్డి, గువ్వల బాలరాజ్.. ఎవరైనా ప్రెస్ ముందు మాట్లాడుతున్నారంటే.. అది కేటీఆర్ డైరెక్షన్‌లోనే. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వాళ్లు చదువుతున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు ప్రెస్‌మీట్‌లో పరోక్షంగా కేటీఆరే ఒప్పుకున్నాడు. సహనం నశించిందన్నాడు. ఇక తమ తడాఖ చూపబోతున్నామనే సిగ్నల్ ఇచ్చాడు.
మున్ముందు టీఆరెస్ సెక్షన్స్ నుంచి ప్రతిపక్షాలకు ధీటైన, ఘాటైన సమాధానాలు రానున్నాయి. ఒకరిని మించి ఒకరు మాటల యుద్ధం చేసుకోనున్నారు. సంస్కారవంతమైన రాజకీయాలకు ఇక తెలంగాణలో అవకాశం లేదనే విషయాన్ని వెల్లడించిన కేటీఆర్.. ప్రతిపక్షాల ఉచ్చులో పడి తాను కూడా అందులోనే కొట్టుకుపోతామని, కొట్టుకుంటామని కుండబద్ధలు కొట్టాడు. ఇదీ కేటీఆర్ పార్టీకి అందిస్తున్న కొత్త ట్రెండ్. ఇక మనం కొత్త టీఆరెస్‌ను చూడబోతున్నాం.