(దండుగుల శ్రీ‌నివాస్‌)

రాజ‌కీయాల్లో ఇలాగే ఉండాలె. ఎప్పుడూ ఒకేలా ఉంటానంటే న‌డ‌వదు. ఎక్కువ రోజులు మ‌న‌లేరు. సీఎం రేవంత్ కూడా రూటు మార్చాడు. స‌మ‌యానుకూలంగా రాజీకి వ‌చ్చాడు. నాడు సినీ ఇండ‌స్ట్రీని చెప్పు చేత‌ల్లోకి తీసుకునే క్ర‌మంలో ఆవేశంగా అడుగులు వేసినా ఆయ‌న‌కే చెల్లించి. ఇవాళ గ‌ద్ద‌ర్ అవార్డుల వేదిక‌గా త‌న‌తో దూరం పెంచుకున్న సినీ పెద్ద‌ల‌తో అంత‌రాన్ని త‌గ్గించుకునే సినీ రాజీ మంత్ర‌మూ ఆయ‌న‌కే చెల్లించి. మొత్తంగా ఆయ‌న స్పీచ్ ప‌ర‌ణ‌తి చెందిన నాయ‌కుడి ప్ర‌సంగాన్నే త‌ల‌పించింది. సినీ పెద్ద‌ల నుంచి పెద్ద‌గా ఆశించినంత గౌర‌వ‌, మ‌ర్యాద‌లు రాక‌పోయినా.. త‌ను మాత్రం రాజీ మంత్రాన్నే న‌మ్ముకున్నాడు.

త‌న‌వంతు సాయం చేయ‌డానికి రెడీగా ఉన్నాన‌న్నాడు. హైద‌రాబాద్ పేరును హాలివుడ్‌ను ఇక్క‌డి ర‌ప్పించేలా చేయాల‌ని కోరాడు. త‌న‌కున్న సినీ ప‌రిజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించినా అది అతి అనిపించ‌లేదు. నిర్మోహ‌మాటంగా, నిష్క‌ల్మశంగానే త‌న ప్ర‌సంగం కొన‌సాగింది. అంద‌రూ త‌న‌ను త‌న‌వాడిగా భావించాల‌నే ఆయ‌న అప్పీలు కూడా చాలా మందికి చేరింది. ప్ర‌సంగం ఆసాంతం చాలా మంది సినీ పెద్ద‌లు క‌ర‌తాళ ధ్వ‌నులతో స్వాగ‌తించ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. ఈ గ‌డ్ద‌ర్ సినీ అవార్డ్స్ ఎలా పుట్టింది…? దీని నేప‌థ్యం ఏంది..? ఆయ‌న వివ‌రించిన తీరు కూడా బాగుంది. తెలంగాణ అంద‌రినీ అక్కున చేర్చుకుంటుంద‌నే విష‌యాన్ని గురుతు చేస్తూనే.. గ‌త స‌ర్కారులా కొంద‌రికే పీఠం వేసి మ‌రికొంద‌రిని అవమానించ‌ద‌నే విధంగా ఆయ‌న ప్ర‌సంగం కొన‌సాగింది.

అందె శ్రీ రాసిన జ‌య‌జ‌య‌హే తెలంగాణ గీతాన్ని కూడా ఆయ‌న ఇందులో ప్ర‌స్తావించారు. సినీ పెద్ద‌లు, వారి వార‌సులు, పిల్ల‌ల‌తో కూడా త‌న‌కున్న సంబంధాల‌ను నెమ‌రువేసుకున్న తీరు.. అక్క‌డ గెట్ టు గెద‌ర్ ఫంక్ష‌న్‌ను త‌ల‌పించిన‌ట్టుగానే సాగింది.

చివ‌రాఖ‌రులో రాహుల్ సిప్లిగంజ్‌ను మ‌నం విస్మ‌రించామ‌నే విష‌యాన్నీ ఆయ‌న గుర్తెరిగాడు. ఆయ‌న‌నూ మ‌నం స‌త్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వేదిక మీదుగానే త‌మ త‌ప్పిదాన్ని తెలుసుకున్న‌వాడిలా హుందాగా మాట్లాడ‌టం అంద‌రికీ న‌చ్చింది.

You missed