(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
9949774458
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి .. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పంథాను అనుసరిస్తున్నారా..? బీఆరెస్ పార్టీని బలహీన పర్చడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారా..? కవిత ఎపిసోడ్‌ను అనుకూలంగా మలుచుకోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారా..??
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంట్లో పవర్ వార్ తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే.. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ముసలం పుట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు అందరు తిరుగుబాటు జెండా ఎగరేశారు. పార్టీ అధినేత చంద్రశేఖర్ తో అమీతుమీ తేల్చుకుంటామని ఘర్షణకు దిగారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్, ఎన్నెం శ్రీనివాస్, రవీంద్రనాయక్ వంటి వారు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే తిరుగుబావుటా ఎగురవేశారు.
డాక్టర్ చంద్రశేఖర్ నాయకత్వంలో టీఆరెస్ పార్టీ కార్యాలయంపై దండయాత్ర చేసినంత పని చేశారు. ఆ సమయంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. టీఆరెస్‌లో ఎమ్మెల్యేలకు, నాయకులకు ఎవరెవరి అవసరాలు ఏమున్నాయో గుర్తించి, వారిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. నయానికో, భయానికో , ప్రలోభాలకో లొంగి చాలా మంది నాయకులు నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి గడప తొక్కారు. ఒకరిద్దరు నేతలు మినహా, ప్రస్తుతం బలమైన నాయకులుగా ఉన్నవాళ్లు కూడా వైఎస్‌తో టచ్‌లోకి వెళ్లారు. నాటి భయానక పరిస్థితులకు కేసీఆర్ కూడా భయపడి కొన్ని రోజులు అండర్ గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది. ఇక పార్టీ చీలక ఖాయం .. టీఆరెస్ ఉనికి ప్రశ్నార్థకం అన్న ప్రచారం జోరందుకుంది. అప్పటికే ఉప ఎన్నికలలో దెబ్బతిన్న పార్టీ.. రాజశేఖర్‌రెడ్డి చక్రబంధంలో చిక్కుకుని విలవిలలాడింది.
ఒక దశలో నాటి మంత్రి జేసీ దివాకర్‌రెడ్డిలాంటి వాళ్లు టీఆరెస్ భవన్‌ను చూసి వచ్చాము.. ఇక పార్టీ పని అయిపోయింది.. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేస్తామని ఎద్దేవా చేసిన సందర్బాలున్నాయి. అప్పట్లో తెలంగాణకు చెందిన మంత్రులు, ప్రముఖులను జట్లుగా ఏర్పాటు చేసి, టీఆరెస్ బడా నాయకులను మచ్చిక చేసుకోవడానికి జరిగిన ప్రయత్నాలు కలకలం సృష్టించాయి. ఇక టీఆరెస్ పార్టీ దాదాపు సంక్షోభంలోకి జారుకుంటున్న క్రమంలో అనూహ్యమైన హెలికాప్టర్ ప్రమాదంతో మళ్లీ దశ తిరిగింది. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను నాటి ఉద్యమనేత, టీఆరెస్ అధినేత తెలివిగా అనుకూలంగా మలుచుకుని తెలంగాణ ఉద్యమాన్ని ఉచ్చ స్థితికి తీసుకెళ్లారు. అప్పటికే సంక్షోభాలను, ఉత్థాన పతనాలను చవిచూసిన కేసీఆర్.. తన పట్టును విడవకుండా, మడమ తిప్పకుండా తన పార్టీని రక్షించుకుని తెలంగాణ రాష్ట్రాన్నికూడా సాధించుకున్న చరిత్ర అందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆరెస్ అధినేత కేసీఆర్.. కుటుంబంలోనే పవర్ వార్‌ను చవిచూడాల్సి వస్తోంది. నాడు పార్టీని బలహీన పర్చడానికి రాజశేఖర్‌రెడ్డి పావులు కదిపితే, నేడు కవిత రూపంలో మరో రూపంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఆయన జోక్యం లేనట్టు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పరంగా పరోక్షంగా కల్వకుంట్ల కవితకు ఎంతోకొంత సహకారం అందుతుందని తెలుస్తున్నది. కవిత సెంట్రిక్‌గా చక్రం తిప్పడం వల్ల పార్టీ బలహీనపడటమే కాకుండా అటు ఇటూ డోలయామానంలో ఉన్న, గోడ మీద పిల్లుల్లా ఉన్న ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి వస్తారని ప్రభుత్వం మరింత బలపడుతుందని ఒక వ్యూహంగా కనిపిస్తున్నది. వాస్తవానికి, కల్వకుంట్ల కవితతో కొందరు కాంగ్రెస్ నాయకులు టచ్‌లో ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను గమనిస్తే స్పష్టమవుతున్నది. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు ఒక ప్రముఖ మంత్రి కూడా ఆమెకు టచ్‌లో ఉన్నట్టు ప్రచారం.
కల్వకుంట్ల కవిత తండ్రిపైనే లేఖాస్త్రం సంధించారనే విషయాన్ని పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మీడియా సెల్ ఇంచార్జి సామ రామ్మోహన్‌రెడ్డి ముందుగానే ప్రకటించి నాలుక కరుచుకోవడం బహిరంగ రహస్యం. దీంతో పాటు గత కొంతకాలంగా కవిత మాటకు ప్రభుత్వంలో కొంత బరువు పెరిగినట్టు, ఆమె మాట చెల్లుబాటవుతున్నట్టు, కేసీఆర్ అంతరంగీకులు, పార్టీ నాయకులు రెండు నెలల క్రితమే గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో అప్రమత్తం చేసినా.. ఆమె వినలేదని చెబుతున్నారు. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎత్తుకు పైఎత్తులు వేయడంతో రాజశేఖర్‌రెడ్డిని తలపిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కవిత విషయంలో ఆమె తిరుగుబాటు ఎప్పటికప్పుడు పరిశీలించి అనుకూలంగా మలుచుకోవడానికి పాలకబృందం తెరవెనుక పనిచేస్తున్నది. శత్రుపక్షంలోని ఏ నాయకుడైనా, ఏ పార్టీయైనా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది.
కానీ , కవిత లేఖాస్త్రానికి ముందే అంతర్గత విభేదాలపై తమకు స్పష్టమైన సమాచారం ఉందని, కాంగ్రెస్ నాయకులు చెబుతుండటం గమనించదగ్గ విషయం. కొంత కవిత ఎపిసోడ్ తరువాత బీఆరెస్‌ను బలహీనపర్చడం ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ ఎత్తులు వేస్తున్నది. రాజకీయంగా అయోమయ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా శత్రు శిబిరంలో ప్రకంపనలు సృష్టించడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలివిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీపై ఘాటైన విమర్శలు చేయడంతో పాటు బీజేపీకి, బీఆరెస్‌కు లోపాయికారి ఒప్పందం కుదిరిందని, రాజకీయంగా ఒక చర్చ పెట్టి సగం సీట్లను దక్కించుకుని పరువు కాపాడుకున్నారు. బీజేపీ, బీఆరెస్ కుమ్మక్కైయ్యాయని మొదటి నుంచి రాజీ డ్రామా ఆడుతున్నాయని రేవంత్‌రెడ్డి చెప్పడానికి చేసిన ప్రయత్నాలకు కవిత తిరుగుబాటు బలం చేకూర్చింది. కవిత ఇంత ధైర్యంగా, బలంగా మాట్లాడటానికి అధికార పార్టీ అండ కూడా ఉందని బలంగా ప్రచారం జరుగుతున్నది. కేటీఆర్‌ను, హరీశ్‌రావును కేంద్రంగా చేసుకుని కవిత చేస్తున్న దాడిని కాంగ్రెస్ నాయకులు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు చూస్తున్నారు. మరోవైపు కవిత తన ఎదురుదాడిని పెంచుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. తాజాగా కరీంనగర్ పర్యటనకు వెళ్లి హరీశ్ అడ్డా సిద్ధిపేటలో సమావేశం పెట్టడం కలకలం రేపుతున్నది. మీడియాతో చిట్‌చాట్ తరువాత కేసీఆర్ .. కవిత ఫోన్ కట్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేనల్లుడు హరీశ్‌రావుతో శుక్రవారం ఫామ్‌హౌజ్‌లో సుధీర్ఘ మంతనాలు జరిపి ప్రస్తుత రాజకీయ పరిణామాలను లోతుగా చర్చించినట్టు సమాచారం. కవిత ఎపిసోడ్‌ను కాంగ్రెస్ ఇంకా ఏ విధంగా ఆయుధంగా మలుచుకుంటుందో వేచి చూడాలి.