రోజూ పొద్దున లేస్తే న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో కేటీఆర్ ఉద్యోగాల క‌ల్ప‌న గురించి మాట్లాడే ఏదో ఒక వార్త‌, స్పాట్, స్టోరీ క‌నిపిస్తుంది పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో. ఆ కంపెనీ వ‌చ్చింది… ఈ సంస్థ వేల కోట్లు పెట్ట‌నుంది.. దీని ద్వారా ఇంత మందికి ఉపాధి దొరుకుతుంది… అంటూ లెక్క‌లు కూడా ఘ‌నంగానే ఉంటాయి. కానీ, ఆయ‌న సొంత ప‌త్రిక‌లో, అధికార పార్టీ న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో… వంద‌ల మంది రోడ్డున ప‌డ్డారు. కాదు, క‌రోనా వేళ నిర్ధాక్షిణ్యంగా గెంటివేయ‌బ‌డ్డారు. ఈ విష‌యం కేటీఆర్‌కు తెలియ‌దా? తెలుసు.

మ‌రెందుకు దీన్ని ఆప‌లేక‌పోయాడు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు వంద‌ల మంది… స‌బ్ ఎడిటర్ల నుంచి మొద‌లుపెట్టి స్టాఫ‌ర్లు, బ్యూరో ఇన్ఛార్జిలు, ఆర్సీ ఇన్చార్జిలు, స్టాఫ్‌.. ఇలా అంద‌రూ ఉన్న‌ప‌ళంగా లాక్‌డౌన్ వేళ‌, క‌రోనా కాటేసే వేళ రోడ్డున ప‌డ్డారు. ఇవ‌న్నీ కేటీఆర్‌కు తెలుసు. మ‌రెందుకు సైలెంట్‌గా ఉన్నాడు. ఆ ప‌త్రిక పై పూర్తిగా ఆయ‌న‌కు కంట్రోల్ లేకుండా పోయిందా? త‌నే ప‌ట్టించుకోవ‌డం మానేశాడా? కేసీఆర్‌కు తెలిసి ఉండ‌దు. ఎందుకంటే చాలా విష‌యాలు ఆయ‌న ద‌గ్గ‌ర‌కు చేర‌నివ్వ‌రు. చేర్చేవారుండ‌రు. అంత ధైర్యం చేసి చెప్పే వాళ్లూ ఉండ‌రు. కాబ‌ట్టి కిందిస్థాయిలో జ‌రిగే చాలా విష‌యాలు కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు చేర‌వు. సంతోష్‌కూ అన్నీ తెలుసు. కానీ ఆయ‌నా ప‌ట్టించుకోడు. ఎందుకంటే అప్పుడ‌ప్పుడు త‌న మాట కూడా అందులో చెల్లుబాటు కాదు కాబ‌ట్టి. అదేంటీ? సంతోష్ చెప్తే కూడా విన‌డా ఎండీ? అనుకుంటున్నారా?
ఎండీ కాదు వినాల్సింది. మ‌రెవ‌రు.. కొత్త ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి.

అవును..! తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చీ రాగానే ఒక‌టే కంక‌ణం క‌ట్టుకున్నాడు. అల్లం నారాయ‌ణ‌, క‌ట్టాశేఖ‌ర్‌రెడ్డి మ‌నుషుల‌ను తీసేయాలి. న‌మ‌స్తే తెలంగాణ నుంచి వారిని గెంటేయాలి. అద‌ను కోసం ఎదురుచూశాడు. ఆయ‌న ఆలోచ‌న‌లకు అనుగుణంగా మంచి శ‌కునంలా క‌రోనా ఎంట‌ర్ అయ్యింది అప్పుడ‌ప్పుడే. లాక్ డౌన్ చేశారు. అంత ఆగ‌మాగముంది ప‌రిస్థితి. అప్ప‌టికే మార్కెట్లో చాలా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాలు పీకేస్తున్నారు. జీతాలు ఇస్త‌లేరు. మీడియా కూడా ఇదే పంథాలో పోయేందుకు రెడీ అవుతున్న‌ది. ఈ విష‌యం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు. ఎవ‌రూ ఉద్యోగాలు తీసేయొద్దు. జీతాలు ఇవ్వండి. ఆప‌త్కాలంలో అన్యాయం చేయొద్దు అని కేసీఆర్ చెప్పాడు కూడా. దాన్నెవ‌రూ ప‌ట్టించుకోలేదు న‌మ‌స్తే తెలంగాణ‌తో స‌హ‌. ఇక్క‌డే కృ.తి కి త‌న దాహం తీర్చుకునే ఛాన్స్ దొరికింది.

క‌రోనా పేరు చెప్పి న‌ష్టాలు త‌గ్గించుకోవాల‌ని, స్టాఫ్‌ను త‌గ్గించాల‌ని ఎండీకి చెప్పి.. ఉద్యోగుల ఊచ‌కోత‌కు నడుంబిగించాడు. హైద‌రాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో తీసేశాడు. అవ‌స‌రం లేకున్నా.. చాలా మందిని హైద‌రాబాద్‌కు రావాల‌ని హుకుం జారీ చేశాడు. భ‌య‌ప‌డ్డ వాళ్లు పోలేదు. మానేసుకున్నారు. దిక్కులేక కొంత మంది వెళ్లి బిక్కుబిక్కుమంటూ బ‌తికారు. వంద‌ల మంది రోడ్డున ప‌డ్డారు. కొంద‌రు హెడ్ ఆఫీసు వ‌ద్ద ధ‌ర్నా చేద్దామ‌ని వ‌స్తున్నార‌ని తెలిసి .. ఇజ్జ‌త్ పోత‌ద‌ని కేటీఆర్ రంగ ప్ర‌వేశం చేశాడు. వారికి రెండు నెల‌ల జీతాలివ్వాల్సిందిగా చెప్పి.. అక్క‌డితో త‌న బాధ్య‌త ముగిసింద‌నుకున్నాడు.

ఇంత‌మందికి ఉపాధి క‌ల్పించాం.. రోజూ పొద్దున్నే బాకా ఊదే న‌మ‌స్తేలో ఇలా జ‌రుగుతున్నా కేటీఆర్ ఎందుకు ప‌ట్టించుకోలేదు? త‌నుచేసే ప్ర‌తిప‌నికి కృ.తి కేసీఆర్‌ను అడ్డం పెట్టుకున్నాడు. ఆయ‌న త‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడ‌ని చెప్పుకున్నాడు. ప‌త్రిక‌ను పూర్తిగా మార్చేసి మంచిగా తీర్చిదిద్దాల‌ని త‌న భుజ స్కంధాల‌పై వేశాడ‌ని గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నాడు.దాని ప‌ర్య‌వ‌సానం ఇద‌న్న‌మాట‌. అందుకే కేటీఆర్ ప‌ట్టించుకోలేదు. సంతోష్ నాకెందుకులే.. అనుకున్నాడు. క‌విత‌.. లైట్ తీసుకున్న‌ది. బ‌లైంది మాత్రం ప‌త్రిక‌నే న‌మ్ముకుని బ‌తికిన‌వాళ్లు. న‌మ‌స్తే కుటుంబ స‌భ్యుల్లా పెరిగిన వాళ్లు. ఉద్య‌మ స‌మ‌యం నుంచి క‌లిసి న‌డిచిన‌వాళ్లు. ఔను.. అన్ని ప‌త్రిక‌లు తీసేయ‌లేదా? ఒక్క న‌మ‌స్తే తెలంగాణ‌నే తీసేసిందా? అవును.. అన్నిప‌త్రిక‌లు తీసేశాయి.

కానీ న‌మ‌స్తే తెలంగాణ కూడా న‌ష్టాల సాకు తీసి తీసేయ‌డం హాస్యాస్ప‌దం. న‌వ్వుకుంటారు. ఇది అధికార పార్టీ ప‌త్రిక‌, దాని క‌ష్ణ‌న‌ష్టాలు మోసేందుకు కేసీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఉన్నాడు. నీకెందుకు కుతి. అత్య‌వ‌స‌రం అయిన సంద‌ర్భంలో వారు మోస్తారు న‌ష్టాల‌ను. అయినా .. న‌మ‌స్తే అనేది యాడ్స్ ఆధారంగా వ‌చ్చే ఆదాయంతోనే న‌డ‌స్తుందా? పార్టీ నిధులేమీ స‌మ‌కూర్చ‌డం లేదా? వాళ్ల‌కు లేని బాధ నీకెందుకు కుతి. ఏ ప‌త్రికా కేవ‌లం యాడ్స్‌తోనే న‌డుస్త‌లేవు. ఏదో ఒక పార్టీ దాన్ని మోస్తుంది. నిధులు స‌మ‌కూరుస్తుంది. వారి ఎజెండాల‌ను, జెండాల‌ను ఆ ప‌త్రిక‌లు మోస్తాయి. అంతే. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇందులో లాభాలుంటాయా? మ‌రెందుకు ఉద్యోగుల‌ను క‌రోనా వేళ దారుణంగా గెంటివేసి .. వారి ఉసురు తీసుకుంది న‌మ‌స్తే తెలంగాణ ? ఉద్య‌మంలో రాళ్లు మోసిన వారిని ప‌ద‌వుల‌నుభ‌విస్తున్న వీళ్లంతా ఎందుకు ప‌ట్టించుకోలేదు? కుతి నేతృత్వంలో ప‌త్రిక కూడా ఫ‌క్తు రాజ‌కీయం చేయ‌డం ప్రారంభించింది. టీఆర్ఎస్ లాగా. అంతే.

కేటీఆర్ సారు.. మీరు త‌లుచుకుంటే రెండు మూడు ప‌త్రిక‌లు పెట్టొచ్చు. ప్లీజ్ పెట్టేయండి. అందులో చాలా మందికి ఉద్యోగాలొస్తాయి. పెట్టుబడి అంటారా? రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా సార్‌. పెట్టేయండి. మీరు ఒక చిటికేస్తే.. ఎవ‌ర‌న్నా ముందుకు వ‌చ్చి పెడ‌తారు కూడా. అద‌న్నా చేయండి. అది మీకో పెద్ద లెక్క కాదు. రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ఎంత మందికో ఉద్యోగాలిచ్చి ఆదుకుంటున్నారు. ప‌ద‌వులిచ్చి క‌ష్ట‌కాలంలో వారిని అండ‌గా ఉంటున్నారు. న‌మ‌స్తేలో మాదిరిగా ఉద్యోగాలు పోగొట్టుకుని చాలా మంది జీవితాలు ఆగ‌మ‌య్యాయి సార్‌. వారి కోసం రెండు మూడు ప‌త్రిక‌లు పెట్టండి సారు. పెట్టుబ‌డి మీకో లెక్క‌కాదు. ప్లీజ్ సార్‌..!