(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఒకే రోజు రెండు కీల‌క ఘ‌ట్టాలు. సంచ‌ల‌న వార్త‌లు. ఒక‌టి కేసీఆర్ గురించి. కాళేశ్వ‌రం నిర్మాణ వైఫ‌ల్యం పై జ‌స్టిస్ పీసీ ఘోష్ అందించిన సంచ‌ల‌న నివేదిక‌. మ‌రొక‌టి స్వ‌యంగా సీఎం జ‌ర్న‌లిస్టుల పేరుతో రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌కంపై. రెండూ సీరియ‌స్ మ్యాట‌ర్సే. ఈ రెండూ చెప్పుకోద‌గ్గ‌.. చ‌ర్చించ‌ద‌గ్గ అంశాలె. అవునూ.. ఈ ఉత్తుత్తి ఇంజినీర్ ఏంది బ్రో..అర్థం కాలేదు…? కేసీఆర్ స్వ‌యంగా త‌న‌ను స‌గం ఇంజినీర్‌తో పోల్చుకున్నాడు చాలా సార్లు. కాళేశ్వ‌రం నిర్మాణ ద‌శలో ఆయ‌న సీఎం హోదాలో పాల్గొన్న భారీ బ‌హిరంగ స‌భ వేదిక‌గా ఈ మాట చెప్పాడు. ఏమ‌న్నాడు? కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్ల‌తో మ‌మేక‌మైతున్న సంద‌ర్బంలో వారితో ఉండీ ఉండీ.. చూసీ.. చూసీ.. మాట్లాడి మాట్లాడి త‌నూ ఓ సగం ఇంజినీర‌య్యాడ‌ట‌. ఆయ‌న చెప్పిన మాట‌లే ఇవి.

ఇప్పుడివి ప్ర‌స్తావ‌నార్హం. జ‌స్టిస్ పీసీ ఘోష్ అందించిన సంచ‌ల‌న నివేదిక కాళేశ్వ‌రం వైఫ‌ల్యానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ కేసీఆరేన‌ని తేల్చింది. హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు అప్పుడు స‌ర్కార్ అంట‌కాగి, సీఎంకు స‌న్నిహితంగా ఉన్న ఐఏఎస్‌లు కూడా బాధ్యులేన‌ని నిగ్గు తేల్చింది. అప్ప‌టికే జాతిపిత‌గా త‌నను యావ‌త్ రాష్ట్ర ప్ర‌జ‌లు పిల‌వాల‌నే కోరిక‌తో త‌పించేపోతున్న కేసీఆర్‌కు.. కాళేశ్వ‌రం ద్వారా మ‌రింతగా త‌న పేరు విశ్వ‌వ్యాప్త‌మ‌వుతుంద‌ని భావించాడు. ఏకంగా కాళేశ్వ‌ర రావు అని పిలుపించుకుని సంబుర‌ప‌డ్డాడు. కానీ కాలం గిర్రున తిరిగింది. కేసీఆర్ అనుకున్న‌ది ఉల్టా అయి కూర్చుంది. పేరు రావ‌డ‌మేమో గానీ, దోషిగా నిల‌బ‌డ్డాడు. బ‌ద్నాం అయి కూర్చున్నాడు. ఆ ప్రాజెక్టు బ‌ర్‌బాద్ చేసింది. ఉత్తుత్తి ఇంజినీర్ చేసిన ఘ‌న‌కార్యానికి ఇదో నిద‌ర్శ‌నం. కానీ ఆ డ్యామేజీ ఫ‌లితం..? ప్రాజెక్టు నిర్మాణ ఫ‌లాలు అనుభవించిందెవ‌రు? ప్ర‌జ‌ల‌కు అందిన ఫ‌లాలేమిటీ?? నేరం ఎవ‌రిది? శిక్ష ఎవ‌రికి?? ఇప్పుడు తేలాల్సింది ఇదే.

ఇక జ‌ర్న‌లిస్టులుకాని జ‌ర్న‌లిస్టుల సంగ‌తికొద్దాం. యూట్యూబ్‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న వేళ‌. చేతిలో ఫోన్ ఉన్న ప్ర‌తీవాడు సోష‌ల్ మీడియా పేరుతో త‌న పైత్యాన్ని క‌క్కేస్తున్న త‌రుణంలో సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట ఘాటు వ్యాఖ్య‌లే వ‌చ్చాయి. గ‌తంలో కూడా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు చూశాం. మ‌ళ్లీ ఇప్పుడు మీడియా గురించి మాట్లాడే సంద‌ర్బం రావ‌డం, ఆయ‌న మ‌న‌సులోని ఆవేద‌న‌, ఆగ్ర‌హం.. బ‌య‌ట‌కు రావ‌డం ఇప్పుడు మీడియా స‌ర్కిళ్ల‌ల‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఓన‌మాలు కూడా రాని వెధ‌వ‌లు కూడా జ‌ర్న‌లిస్టుగా చెలామ‌ణి అవుతున్నాడ‌నేది ఇక్క‌డ చ‌ర్చ‌. వ్యూస్ కోసం పెట్టే థంబ్‌నెయిల్స్ … హ‌ద్దులు దాటి విప‌రీత పోక‌డ‌లు పోతున్నాయ‌నేది వాస్త‌వం.

దీన్ని నిలువ‌రించాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌నేది సీఎం మాట‌ల ఆంత‌ర్యం. పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చిన వీటిని ఏరిపారేయాలంటే మాట‌లు చెప్పింత ఈజీ ఏం కాదు. అస‌లు ఎన్ని యూట్యూబ్ చానెళ్లున్నాయి? అవి ఎవ‌రు న‌డిపిస్తున్నారు? వాటి కంటెంట్ ఏంటీ? ఇస్తున్న వార్త‌లు ఎలా ఉంటున్నాయి? నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉంటున్నాయా? త‌న పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించి ఇత‌రుల మీద దాడి చేసేలా ఉంటున్నాయా?? ఇవ‌న్నీ లోతుల్లోకి పోయి చూస్తేగానీ తెలియ‌దు. అలా తెలుసుకుని ఒక్కొక్క‌డిని ఏరిపారేస్తే గానీ జ‌ర్న‌లిస్టుల ముసుగులో జ‌రుగుతున్న అరాచ‌కాన్ని కొంత‌లో కొంత కంట్రోల్ చేయ‌గ‌ల‌రేమో? కానీ ఇంత‌కు మించి సోష‌ల్ మీడియా వాళ్ల‌పై రాసే వారిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు చేనును కంచె కాపాలాగా లేదు. కంచెనే చేను మేస్తోంది. అది తెలుసు.కానీ కంట్రోల్ చేయ‌డ‌మే మ‌న చేతుల్లో లేదు.

Dandugula Srinivas

Senior Journalist

8096677451