(దండుగుల శ్రీనివాస్)
రాజకీయం రంగు మారింది. పొలిటికల్ పోకడలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఛాయలు. పనులు లేక దిక్కు తోచని స్థితి. అంతా ఆగమాగం. కానీ మన నేతలకు అధికార యావ ఎంతలా పెరిగిపోయిందంటే జనాలను కూడా లెక్క చేయనంత. ఎవరేమనుకుంటున్నారో సోయి తప్పినంత. బూతులు మాట్లాడుతూ బహిరంగంగా బట్టలు చింపేసుకునేంత. ఇంకా మూడేండ్లు ఉండగానే అధికార పార్టీ మళ్లీ మళ్లీ మాకే అంటోంది పీఠం. వరుసగా మరో రెండు టర్ములు మాదేరోయ్.. కావాలంటే రాస్కోరా సాంబా! అని కూడా కాలరెగరేస్తోంది. మళ్లీ మళ్లీ నీకే అయితే మేమేంగాము. దాని కోసమేగా మేం కాచుక్కూర్చుంది.. అని ఇంకొకడు లేస్తడు. అబ్బా మా మనసులో మాట బాగానే చెప్పావురోయ్… నీకు థ్యాంక్స్ అన్నట్టుగా కొందరు కూల్ అవుతారు. ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన చెవులే వాడి.. అన్నట్టుందిరోయ్ మనోడి యావ్వారం అని చెవులు కొరుక్కుంటారు.
బయటకు అనరు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది కాబట్టి. ఇక ప్రధాన ప్రతిపక్షంలో సీఎం సీటు కోసం లొల్లి ఎక్కడికొచ్చిందంటే.. కుటుంబం పరువు బజారున పడేసేంత. రక్తసంబంధం కాదు.. అధికార యావే మిన్న అనేంతగా. తండ్రి గుండెల మీద గారాబంగా పెరిగి సీఎం సీటు కోసం తండ్రి గుండెల్నే తన్నేంత. అన్నాచెళ్లెల్లిద్దరు తండ్రి ప్రాణాలనే పణంగా పెట్టేంత. బీసీలకు సీఎం వస్తుందని ముందు నుంచే మరో బీసీ పోటీ లేకుండా చేసుకునేందుకు ఇప్పట్నుంచే ఇంటి పోరు బీజేపీలో.
నువ్వు బీసే నేను బీసే. కానీ నువ్వెప్పుడొచ్చావ్.. నేనెప్పుడొచ్చిన. నీ చరిత్రేందీ నా చరిత్రేందీ..? చూసుకుందామా నీ ప్రతాపమో.. నా ప్రతాపమో..? తొడలు చరిచి మీసాలు మేలేసుకుంటున్నారు. ఎవడు ఎక్కువ తిట్టి ఎక్కువ అవమానిస్తే అవతలోడు బయటకు పోతడు. బీసీ సీఎం సీటు నాకే. ఇద్దరిదీ అదే దారి. అందుకే ఒకడిపై మరొకడు ఈటెలు విసురుకుంటున్నారు. వీరందరికీ జనం గోడు పట్టదు. సీఎం సీటు కోసం సిగపట్లు కావాలి. అదీ మూడేండ్ల ముందు నుంచే. ఎంత ముందు చూపో కదా! అదీ సీటు పవర్. అదే పవర్‌కున్న పవర్. అందుకే అధికార యావ అంతింత కాదయా అనేది.

Dandugula SRINIVAS
Senior Journalist
8096677451
