(దండుగుల శ్రీనివాస్)
దేవుడు చుట్టూ దయ్యాలున్నాయని బిడ్డె చెబితే గానీ ఆ దేవుడికి తెలియలేదనుకుంటా. అంతా జోకే వాళ్లే చుట్టూ చేరి. అందుకే తెలుసుకోలేకపోయాడు. అందుకే బిడ్డె చెప్పిన తరువాత టింగున దేవుడికి జ్ఞానోదయమైంది. అప్పట్నుంచి ఎవరిని చూసినా దయ్యామేమో అనే అనుమానం కలుగుతుదంటే నమ్మండి. వీడా..? వీడా..? కాదు వాడై ఉంటాడు..?? అని తనకు తానే తడిమిచూసుకునే పరిస్థితి వచ్చిందట. ఇక లాభం లేదనుకుని అప్పుడు బయట ప్రపంచం చూడటం మొదలుపెట్టాడంట. తన వద్ద ఉంటూ తన గోతులు తవ్వే వారి పట్ల జనం ఏమనుకుంటున్నారు.? లీడర్లేమనుకుంటున్నారు..?? ఇలా అన్ని రకాల సీక్రెట్ నివేదికలు తెప్పించుకున్నాడట. ఏతా వాత తేలిందేమిటంటే తనను చూడగానే సగానికి పైగా బెండయిపోయి మోకరిల్లి బాపు బాపు అని గుండెల్లోతుల్లోంచి ఆప్యాయంగా పిలిచి తన ఇంటి పెంపుడు కుక్కగా ఉన్న వాడే దయ్యమని తేలిందట.
దేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వీడా నా కొంపముంచుతున్న వాడిలో ఉన్న దయ్యం బేవాకూఫ్ గాడు. ఇన్నాళ్లూ తన చంకనెత్తుకుని తిరిగాను కదరా నిన్ను అని బయటకు రెండు మూడు బూతులు వదిలాడంట. నివేదికలో వీడి నెంబర్ 2గా ఉందట. అంటే మరి మొదటి దయ్యం ఎవరు..? ఆ తరువాత 3, 4, 5……9 దయ్యాలెవరు..? అని ఆత్రుతగా పేజీలన్నీ తిప్పి చూశాడా దేవుడు. వెంటనే గెంటేయాల్సిన దయ్యాల లిస్టులో మొదటి వరుసలో ఉన్న దయ్యం ఇదేనట. కానీ రెండో నెంబర్ దయ్యమని రిపోర్టులో ఉంది. అంటే ఇంకా మిగిలిన దయ్యాలు లిస్టు లోతుగా గుంజే పనిలో ఉందన్నమాట తన గూఢాచార టీమ్. వెంటనే తేరుకున్నాడు. అరేయ్ ఇక వాడి ముఖం నేను చూడను. నేనున్న పరిసర ప్రాంతాల్లోకి కూడా ఆ దయ్యంగాడిని రానీయొద్దు. అవతలికి నూకండ్రా దాన్ని. హుకూం జారీ చేశాడు.
ఆగమేఘాల మీద ఆ పని చేసేశాయి ఇంకా నెంబర్లు రూఢీ కాని మిగిలిన దయ్యాలు. ఆ దయ్యం ఫామ్‌హౌజ్ గేటు దాటేదాకా బతిమాలుకుందంట.అరేయ్ దయ్యాల్లారా…! మీ నెంబర్ కూడా రేపో మాపో వస్తదిరా.. మీకూ ఇదే గతి పడుతుంది.. నా బతకేంగాన్రా..! అటు ఆర్మూర్‌కు పోలేను. రేపట్నుంచి ఇక్కడికీ రాలేను… చావమంటార్రా…! పిశాచపు ముం. కొడుకుల్లారా..! పచ్చి బూతులు గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్నాయి. అవేమీ పట్టించుకోవడం లేదు ఇంకా నెంబర్లు రూఢీ కానీ , దయ్యంకాని దయ్యాలుగా చెలామణి అవుతున్న మిగిలిన దయ్యాలు. బయటకు నూకి గేటు వేయగానే ఆ ఆర్మూర్ దయ్యం గట్టిగా గొంతు చిరిగేలా అరుస్తూ తుమారా నెంబర్ బీ జరూర్ ఆయేగా…! అని దుమ్ముత్తిపోసిందట.
హమారా నెంబర్ కబ్ ఆయేగా..!?
ఒకరి ముఖాలులొకరు చూసుకున్నాయా దయ్యంకాని దయ్యాలు.

Dandugula SRINIVAS
Senior Journalist
8096677451
