(దండుగుల శ్రీనివాస్)
సొంతలాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడుపడవోయ్.. అని గురజాడ చెప్పింది ఇక్కడ కొంచెం మార్చి చెప్పాల్సి వస్తోంది. సొంత పత్రికలు, ఇంటి పత్రికలుగా ముద్రపడ్డ వాటిని సర్కార్ దూరం పెట్టేస్తున్నది. ఆంధ్రపత్రికలకు మాత్రం యాడ్స్ కుమ్మరించేస్తున్నది. మొదట్లో ప్రచారం బాగా కోరుకున్న సర్కార్.. చిన్నాపెద్దా తేడాలేకుండా అన్ని పత్రికలకూ యాడ్స్ ఇచ్చింది. ఆ తరువాత అప్పుల ఊబీ, మిత్తీల భారం అని వల్లెవేస్తూ వస్తున్న సర్కార్.. అన్నీ పత్రికలకూ ఇస్తే ఎలా అనుకున్నదో ఏమో మరి.. కొన్నింటినే ఎంపిక చేసుకుంటున్నది. అందులో తెలంగాణ పత్రికలకు మాత్రం చోటుదక్కపోవడం ఇప్పుడు వివాదమై కూర్చింది.
అప్పుడు కేసీఆర్ ఇలాగే చేశాడు. తనకు అనుకూలంగా రాయకుపోతే.. వాటిని బాయ్‌కాట్ చేశాడు. అసలు జర్నలిస్టులుగానే చూడలేదు. నిషేధం విధించాడు. నియంతలా వ్యవహరించాడు. తన మానస పుత్రికకు మాత్రం వరదలా యాడ్స్ వచ్చి పడ్డాయి.ఇప్పుడీ సర్కార్ తనకు మద్దతుగా నిలిచిన వారిని వదిలి.. పొరుగు వారి సేవలో తరించిపోతున్నది. వారితో పెట్టుకుంటే బాగుండదనుకున్నదో.. మనోళ్లే కదా గప్‌చుప్ ఉంటారని భావించిందో తెలియదు. బకాయిలు పేరుకుపోయాయనే ఒక కారణం.. దుబారా ఖర్చుగా భావించే పరిస్థితిని కల్పించుకోవడం మరో కారణం..
ఇలా తప్పించుకుందామని చూసినా.. వీ6, వెలుగు మాత్రం దీన్ని వదలలేదు. బయటపెట్టి బజారు కీడ్చింది. ఇంతలా పోరాడితే ఇదేనా మీరు మాకు చేసిందని బాహాటంగానే తమను సర్కార్ అవమానించిందని తేల్చేసింది. మంత్రి వివేక్‌కు సంబంధించిన పత్రిక ఇలా బహిరంగంగా సర్కార్ తమను అవమానించిందని చెప్పుకోవడం ఇప్పుడు చర్చకు తెరలేపింది. కేసీఆర్ పాలనలో ఎన్నో అవమానాలను మీడియా ఎదుర్కొన్నది. కష్టనష్టాలకోర్చి ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ కూడా ఇదే పంథాలో పోతే.. ఇంతకన్నా దారుణం మరోటి లేదనేదే తెలంగాణ మీడియా, జర్నలిస్టుల ఆవేదన అని చెప్పుకున్నది వెలుగు, వీ6 మేనేజ్మెంట్.
