(దండుగుల శ్రీ‌నివాస్‌)

తెలంగాణ కోసం కొట్లాట‌లో విగ్ర‌హాల అంశం కూడా కీల‌క‌మైన‌దే. ఆంధ్రోళ్ల పేర్లు, ఆ విగ్ర‌హాలు మాకొద్ద‌నే క‌దా అప్పుడు పోరాడింది. మిలియ‌న్ మార్చి పోరాటంలో ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హాల ధ్వంసాలు కూడా తెలంగాణ ప్ర‌జాగ్ర‌హానికి, ధ‌ర్మ‌పోరాటానికి ఓ నిద‌ర్శ‌నం. ఇప్పుడు మ‌ళ్లీ ఈ విగ్ర‌హాల వివాదం తెర‌పైకి వ‌స్తోంది. కాంగ్రెస్‌, బీఆరెస్ పార్టీల మ‌ధ్య పోరుగా మారింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చీరాగ‌నే, సీఎంగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాలు.. కేసీఆర్ చేసిన‌వి త‌ను మార్చాల‌ని. అందులో భాగంగా ఆయ‌న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ రూపురేఖ‌లే మార్చేశాడు. ఇది జ‌నాలెవ‌రూ కోరుకోలేదు. ఆ పాత విగ్ర‌హం వ‌ల్ల జ‌నానికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ కూడా లేదు.

04Vastavam.in (7)

కానీ కేసీఆర్ గురుతులు లేకుండా చేస్తాన‌ని శ‌ప‌థం పూనిన రేవంత్‌.. త‌న హ‌యాంలో ఓ తెలంగాణ త‌ల్లిని ఏర్పాటు చేశాన‌ని చెప్పుకోవ‌డానికి ఇది చేసిన‌ట్టున్నాడు. దీన్ని బీఆరెస్ తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ ఏకంగా తాము వ‌చ్చిన త‌రువాత ఈ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని తీసేయిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. రేవంత్ మాత్రం ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ సమావేశంలో అన్ని క‌లెక్ట‌రేట్ల‌లో ఈ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాలు పెట్టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. దీనిపై జీవో కూడా విడుద‌లైంది. ఇక అదే స‌చివాలయం ముందు .. కేసీఆర్ స‌ర్కార్ తెలంగాణ అమరుల స్థూపం ఏర్పాటు చేద్దామనుకున్న జాగ‌లో రేవంత్‌.. రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయించి.. త‌న స్వామిభ‌క్తి చాటుకున్నాడు. దీనిపైనా కేటీఆర్ గుర్రుమ‌న్నాడు. అస‌లు తెలంగాణ‌కు, రాజీవ్‌గాంధీకి ఏమిటి సంబంధం..? ఆయ‌న‌ను అక్క‌డ అత్య‌వ‌స‌రంగా ఏర్పాటు చేయించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని.?? ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీన్నీ తీసేయిస్తాన‌న్నాడు. ఇక తాజాగా మ‌రో విగ్ర‌హ వివాదాన్ని త‌ల‌కెత్తుకున్నాడు రేవంత్‌.

దివంగ‌త మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య విగ్ర‌హాన్ని ఇవాళ ప్ర‌తిష్టాపించ‌నున్నాడు. దీనిపైనా బీఆరెస్ భ‌గ్గుమంటోంది. మ‌రోవైపు తెలంగాణ సోష‌ల్ మీడియా ఫోరం కూడా ప్ర‌భుత్వాన్ని తిట్టిపోస్తోంది. ఆంధ్రోళ్ల పేర్లు, ఆ విగ్ర‌హాలు వ‌ద్దంటుంటే మ‌ళ్లీ అవే తీసుకొచ్చి ఇక్క‌డ పెడుతున్నారా..? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పోయేగాలం కాక‌పోతే.. ఇవే ప‌నులు అంటూ శాప‌నార్ధాలు పెడుతోంది.