(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్ యవ్వారం రేవంతుకు మంట పుట్టించింది. అతగాడి పేరు తీయకుండానే ఘాటుగానే అర్సుకున్నాడు. రైతు సంక్షేమంపై మూడు రోజులు ప్రిపరేషన్‌కు టైమిస్తాననడం, నువ్వు రాకుంటే.. నేనే ప్రెస్‌క్లబ్‌కు వస్తాననడం, వచ్చి హంగామా, హైడ్రామా చేయడం రాజకీయంగా కలకలం రేపింది. అంతకు ముందు వందనా నీ బొందనా అని ప్రెస్మీట్లో వెటకారంగా మాట్లాడటం.. ఇవన్నీ రేవంతుకు భగ్గుమనేలా చేశాయి. ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే అర్సుకున్నాడు గట్టిగానే. నేను అన్నది కేసీఆర్‌ను. అదీ సవాల్ కాదు. అసెంబ్లీకి రమ్మని సూచన చేశాను చర్చ కోసం. కానీ క్లబ్బులకు, పబ్బులకు నేను రాను… అంటూనే కావాలంటే ఫామ్‌హౌజ్‌కు వస్తా. నేను వస్తా. నా మంత్రి మండలే వస్తుందని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేశాడు.
అంటే.. అసెంబ్లీ రాకుండా ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడాన్ని మళ్లోసారి ఎత్తిచూపుతూనే.. కేటీఆర్ విసిరిన ఛాలెంజులన్నింటికీ ఇదొక్కటే మంచి కౌంటర్‌గా తలచాడు సీఎం. కృష్ణా జలాల తరలింపు , నీటి వాటాల్లో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని… వంద కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదన్నాడు. అంతకు ముందు ఉరేసినా తప్పులేదన్న సీఎం.. ఇప్పుడు ఉరి నుంచి కాస్తా ఉపశమనం ఇచ్చి కొరడా దెబ్బలతో సరిపెట్టాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని వారికి చెప్పి.. జగన్‌తో ఉన్న అనుబంధంతో ఇక్కడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టాడనే ఆరోపణ చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా మళ్లీ అవే ఆరోపణలు చేశాడు. ఇంత జరిగినా కేసీఆర్ మౌనం వీడకపోతే ఆ పార్టీకి మరింత డ్యామేజీ అయ్యేలా ఉంది.
కేటీఆర్‌నే నమ్ముకుంటే రెచ్చగొట్టే రాజకీయాలకు పురిగొల్పడం మూలంగా దిగజారుడు రాజకీయాలే అవుతున్నాయి తప్ప.. పార్టీకి మైలేజీ మాత్ర రావడం లేదు. పనిలో పనిగా డైరెక్టుగా, ఇండైరెక్టుగా గట్టి వార్నింగే ఇచ్చాడు రేవంతు. నన్ను గెలకండిరోయ్… ఆ తరువాత నేనేం చేస్తానో నాకే తెల్వదు.. అని తనదైన స్టైల్లో హెచ్చరించి ముగించాడు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
