(దండుగుల శ్రీనివాస్)

ప్రతిపక్షలంలో ఉన్నప్పుడు ఒక లెక్క.. ఇప్పుడొకలెక్క. అప్పుడు జనం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అలవికాని హామీలు. ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చినంక ఛాలెంజులు. సవాళ్లు. ఇప్పుడీ సవాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావడం లేదు. అధికారం రాగానే, సీఎం కాగానే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఎక్కువ గెలవాలనుకున్నాడు. ఎక్కువ సీట్లు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలయ్యేది.. అని బ్లాక్‌మెయిలింగ్ మాటలు కూడా అప్పటి ఎంపీ ఎన్నికల ప్రచారంలో వచ్చాయి. ఇక ఇదీ పనిచేయదని అనుకున్నాడేమో..! ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తానని నమ్మబలికిండు. ఒకేసారి చేస్తానన్నాడు.
నిజానికి ఇది ఒకేసారి చేయకున్నా .. కొంత కొంత చేసుకుంట పోయి మొత్తం అందరి రైతులవి చేసినా బాగుండేది. కేసీఆర్ అట్లనే చేసింది. కానీ ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాబట్టి..రాహుల్‌కు బహుమతి ఇద్దామనుకున్నాడు. కానీ అది బెడిసి కొట్టింది. అనుకున్నని సీట్లు రాలే. బీజేపీ కొల్లగొట్టింది సగం. కానీ ఇచ్చిన మాట. చేసిన ఛాలెంజ్ ఉన్నది కదా. పంద్రాగస్టుకు మొత్తం రుణమాఫీ… చేయాల్సి వచ్చింది. కానీ అదంత వీజీ కాదని తెలుసు. అందుకే హరీశ్‌రావు అన్నడు.. మొత్తం రుణమాఫీ పంద్రాగస్టు వరకు చేస్తే రాజీనామా చేస్తానని. అనుకున్నట్టే ఆ డెడ్‌లైన్ నాటికి మొత్తం రుణమాఫీ కాలే. ఇంకా కాలే. అంటే అదెప్పుడూ సంపూర్ణం కాదన్నమాట. ఎన్నికల్లో గెలుపు కోసం .. పంద్రాగస్టు డెడ్‌లైన్ పెట్టుకున్నది ఆయనే. ఛాలెంజ్ విసిరిందీ ఆయనే. ఖజానా కనాకష్టంగా ఉన్న సమయంలో 21వేల కోట్లు రుణమాఫీ చేసినా.. ఇప్పటికీ దాని ఫలితం పార్టీ, ప్రభుత్వం అనుభవించలేదు. ఆ ఫలాలు అందలేదు. ఇంకా ఊర్లలో అసంతృప్తి. ఎమ్మెల్యేలే వేదికల మీద ఇంకా రుణమాఫీ కాలే. చేయాలె అంటున్నరు.
ఈ ఛాలెంజ్ ఫెయిల్ అయ్యింది. తాజాగా రైతు సంక్షేమం విషయంలో కేసీఆర్, కేటీఆర్ రండ్రి.. రచ్చ చేద్దామన్నడు. ఇదే మంచి సమయమని కేటీఆర్ ఉరికొచ్చిండు. ప్రెస్‌మీట్ పెట్టిండు. ప్రిపేర్ కావడానికి మూడు రోజుల గడువిచ్చిండు. ఆ మరుసటి రోజు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు టైమిచ్చిండు. రేవంత్ ఢిల్లీ పోయిండు. ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరు పడితే వాళ్లు ఏదో మాట్లాడుడు. అంతిమంగా అసెంబ్లీకి రావాలె. కేసీఆర్‌తోనే చర్చించాలె. ఇదే మాట చెప్పి తప్పించుకున్నరు. కానీ మైలేజీ మాత్రం బీఆరెస్‌కు వచ్చింది. డ్యామేజీ కాంగ్రెస్ వశమైంది షరా మామూలుగా.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
