(దండుగుల శ్రీనివాస్)
ఇది బాగుందే. మీరు మీరు మంచిగనే ఉంటరు. మీ రాజకీయాలు మీకు. మీ అవసరాలు మీకు. మధ్యలో మేం ఏం పాపం చేశాం? మమ్మల్ని మీ రాజకీయాల్లో లాగి, గుంజి గబ్బు పట్టిస్తారా..? పేరులో క్లబ్బుంటే. అది కల్లుబట్టీనా..? మొన్న జగ్గయ్య ఇదే అన్నడు. మంత్రిగా ఉండి అవేం మాటలు అని మేం అనుకుంటుంటే. మళ్లా నువ్వు. మీ ఛాలెంజులకు, మీ తొడలు కొట్టుకునేందుకు మా దగ్గరకొచ్చారు. మేమమన్నా రమ్మన్నమా..? అబ్బో బాగుందే. మీ యవ్వారం. మధ్యలో మాది క్లబ్బు, పబ్బు నా? అంటే ఈడకు వచ్చినోళ్లంతా తాగి తందనాలాడి, ఊగి గంజాయి గుంజుతున్నరా ఏందీ..? భలేవాడివయ్యా బాసు నువ్వు.
నీకు కోపముంటే కేటీఆర్ ను తుక్కు తుక్కు తిట్టుకో. నీ తొడలు వాచేదాకా నువ్వు కొట్టుకో. మా తొడలు వాయగొట్టుడేందయా సామీ..? నీ అవసరమొచ్చినప్పుడు మేం కావాలా..? ఇప్పుడు క్లబ్బు, పబ్బు, గబ్బునా..? ఇందయో ఇది. ఇంత అన్నాలముంటదా..? అంటే నువ్వు అవమానించింది మా క్లబ్బునే కాదయో. మమ్మల్ని గూడ. అబ్బో మీ యవ్వారం బాగనే ఉందిగా. అప్పుడేమో కేసీఆర్. ఇప్పుడేమో నువ్వు. ఫక్తు మా బతుకులు కరివేపాకు కన్నా అధ్వాన్నం చేస్తిరి కదయ్యా సామీ..! మా జోలికి రాకుండా మీకు పొద్దుపోదా ఏంది సామీ..! ఆయనేమో ఈడకొస్తా… రా.. చూస్కుందామన్నడు. రావాల్నా వద్దా మీ ఇష్టం. నువ్వేమో పుసుక్కున ఇంత మాటనేస్తివి. సీఎంవే నువ్విట్టా అంటే ఇగ మీ పాలనలో మా బతుకులు బహు బాగు పడ్డట్టేనయ్యో…!
అయినా మీ కంటికి మేం ఎట్టా కనడబడుతున్నామంటావు..? అహ తెల్వక అడుగుతున్నా.. ఎట్టా కనబడుతున్నావయ్యా సామీ..! భలేవాడికి బాసు. ఎంత మాటన్నవ్. అబ్బ మళ్లా నువ్వు మా కాడికి రాకపోతావా..? మా క్లబ్బులో రంకెలెయ్యకపోతావా..? చూస్కుందాం తియ్.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
