(దండుగుల శ్రీనివాస్)
ప్రతిపక్షాన్ని నిలువునా పాతరేద్దాం అనే ఆలోచన… ఆ పార్టీనే సమాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిలదీసే శక్తి కానరావొద్దు. ప్రశ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాతరేయాలి. ఆ తరువాత మనమేం అవుతాం.. మనకేం పాఠం చెబుతారు..? అనేది అప్పటి మస్తిష్కం ఆలోచించదు. దాన్ని అధికారమనే పురుగు తొలిచి తినేసి పని చేయకుండా చేస్తుంది కాబట్టి. కళ్లకు పవర్ అనే పొరలు కమ్ముకుని అవి వేటినీ చూడనీయదు కాబట్టి. చెవులకు నువ్వు గ్రేట్ సారు..! నువ్వో కారణజన్ముడవు..!! జాతి పితవు…!! అనే మాటలు మాత్రం వినిపిస్తాయి కాబట్టి. కీర్తి కండూతిలో బుద్ది అష్టవంకరలు తిరిగి కుడితి తాగుతుంది కాబట్టి. అదే అమృతమని భావిస్తుంది కాబట్టి. మరీ సుత్తి ఎక్కువైందంటారా..?
సరే.. అసలు విషయాకొద్దాం. రాజకీయ పనరేకీకరణ పేరుతో అందరినీ గుంజేసిండు కేసీఆర్. వీడు వాడు అని కాదు. తిట్టినోడు… బట్టలిప్పినోడు అని కాదు. అందరు. అందరంటే అందరు. అక్కడెవడూ ఉండొద్దు. ఆ పార్టే పేరే వినబడొద్దు. అసెంబ్లీలో నిటారుగా నిలబడి తను చెప్పే సూక్తి ముక్తావళి, నీతి సూత్రాలు విని తరించాలి. లేచి ఎవడూ ఇదేందీ..? అని ప్రశ్నించొద్దు. చిరాకు. చికాకు. నేనేంటి. నా ఖ్యాతేంటీ..? గాంధీ, నెహ్రూ ఫోటోలతో పాటు నా ఫోటో పెట్టుకోవాల్సిన స్ట్రేచర్ నాది. మరి వీళ్లా అర్బకులు నన్ను ప్రశ్నించేది. అర్చకుల కాళ్లు నేను మొక్కితే నా కాళ్లు అందరూ మొక్కాలి. అదీ నేనంటే. సరే, మరీ తిట్టేస్తున్నానా..? వదిలేయమంటారా..? సరే. అలా బీజేపీకి పాలు పోసి పెంచి పెద్ద చేసి గోతి తవ్వుకున్నాడు.
ఇటు కాంగ్రెస్ పుంజుకున్నది. అటు బీజేపీ తన్నింది. దేశరాజకీయాలు పిలుస్తున్నాయి.. దేశ్‌కీ నేత నేనే అనే స్థాయి నుంచి రోజూ సోషల్ మీడియాలో అధికార పార్టీని ఎవడు తుక్కు తుక్కు తిడుతున్నాడో చూస్తూ పైశిచికానందం పొందుతూ శభాష్‌రా సాంబా…! రా ఒకసారి ఫామ్‌హౌజ్‌కు అని పిలిచి ఫోటో దిగి పంపించే స్థాయికొచ్చింది కథ. మంచిగైంది జనాలకు. నన్నోడగొడతారా..? చావండిరా. కొడకల్లారా..? గుర్రానికి, గాడిదకు తేడా తెలిసిందా..? అని అడుగుతున్నాడు కచ్చగా. గాడిదకు అప్పుల బరువెత్తి తనింక గుర్రాననే భ్రమలో బతుకుతూ లోపాల శాపాలు నాలుగ్గోడలకు పరిమితం చేసిన తేరుకోని మేధావి సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇప్పుడు రేవంతుడూ అదే చేస్తున్నాడు.
కాస్తో కూస్తో బలంగా ఉన్న బీఆరెస్‌ను నామరూపాల్లేకుండా చేస్తే తనకు తిరుగులేదనుకుంటున్నాడు. తనకు తెల్వకుండానే బీజేపీకి పాలుపోసి పెంచుతున్నాడు. కోతి కోతి కొట్లాడుకుంటే మధ్యలో వచ్చిన మూడో కోతి ఉన్న రొట్టెముక్కలను ఎత్తుకుపోయినట్టు. మెల్లగా బీజేపీ వాదం, హిందూ నినాదం, మోడీ ప్రాపకం. కుంభమేళాల మేళవింపు, మతం మత్తు.. ఇవన్నీ ముడ్డి కింద నీళ్లు తెచ్చిపెట్టేదాకా వీరిద్దరికీ తెలియదు. ఒకరు తెలుసుకునే లోపు ఫాహ్‌హౌజ్ లో పడకేశాడు. ఇంకొకరు గుండుగా, బండిగా, అరే బ్రహ్మానందం… అంటూ తిట్టిపోస్తూ అదే జనాలకు కావాల్సిందనే భ్రమలో బతుకుతున్నాడు.