(దండుగుల శ్రీనివాస్)
అప్పుల కుప్పగా మార్చింది నిజమేనని ఒప్పుకున్నాడు కేటీఆర్. రేవంత్ సర్కార్‌ను ఎందుకిన్ని అప్పులు చేస్తున్నారని విమర్శించబోయి.. ఇవన్నీ సీఎం జేబుల్లో నింపుకోవడానికే చేస్తున్నాడనే ఆరోపణ చేయబోయి… తమ గతాన్ని తవ్వుకున్నాడు. అప్పుల తప్పులు తిప్పలు తప్పవనే విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూనే.. మీరూ చేస్తున్నారు చూశావా అని ప్రజలకు చెప్పబోయి.. మరీ ఇంతనా అని ఆశ్చర్యపోయి… ఇదంతా జనాల కోసం కాదు.. నీ కోసమే అని చెప్పబోయి… మేం చేసినా జనాల కోసమే తెలుసా అని క్లారిఫికేషన్ ఇచ్చుకోబోయి…. దొరికిపోయాడు. అవును.. మేం అప్పులు చేశామన్నాడు. కానీ సంక్షేమ పథకాల కోసమే అన్నాడు. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు కదా.
మీరు చేసిన అప్పులకే మిత్తీలు నెలకు రూ. 6.5 వేల కోట్లు కడుతున్నానని. ఏడాదికే రూ. 70వేల కోట్లు కట్టానని. అంతలా చేశారు మరి మీరు. రెండు టర్ములు ఉంటిరి. ఇబ్బడిముబ్బడిగా పథకాలు ప్రవేశపెడితిరి. అంతలా అప్పులు చేసి ఎవరన్నా పథకాలు పెట్టండని చెప్పారా..? రైతుబంధు పేరిట రాళ్లకు రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు, వందల ఎకరాలున్న బడాబాబులకు ఎవడియ్యమన్నాడు. పైగా దీనికి రైతు పెట్టుబడి అనే ఒక కవరింగు. ఇంతలా లోపభూయిష్టమైన పథకం మరొకటి ఉండదు. దీనికి అప్పులు. పైగా రైతుల కోసం ఇన్ని వేల కోట్లు ఇచ్చాం. అనే కలరింగు. కవరింగు. ఒకవేలు అటు చూపితే మిగిలిన వేళ్లన్నీ మిమ్మల్నే చూపుతున్నాయి కేటీఆర్.
ఎందుకు అనడం, అనిపించుకోవడం, తన్నాలని చూసే క్రమంలో మనమే బొక్కబోర్లా పడటం. ఇలాగే ఉంది నీ వ్యవహారం. పోయిన ప్రతీ చోట రేవంతుడు ఇదే చెబతూ వస్తున్నాడు. అక్కడేం లేదు. కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి పోయాడని. మీరు దాన్ని కవరింగు చేసుకోవడానికి మరి నువ్వెందుకు 15 నెలల్లోనే రూ. 1.65 లక్షల కోట్ల అప్పు చేశావని కేటీఆర్ అడుగుతున్నాడు. మీరు చేసిన పాపాన్ని రేవంత్ కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదు. ఇదీ కరెక్టు.
అంటే.. కేసీఆర్ అయినా.. రేవంతు అయినా.. అప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం, కీర్తి ఖండూతి కోసం కేసీఆర్ చేసిన అప్పులైనా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన రేవంతు డాంభికపు హామీలైన.. ఏవి అమలు చేయాలన్నా చేయాల్సింది అప్పులు. అప్పులు. అప్పులు. జనాలే అల్పులు. మిమ్మల్ని నమ్మినందుకు. నమ్మి గెలిపించి అప్పుల ఊబిలో తమకు తెలియకుండా తామే కూరుకుపోతున్నందుకు.