(దండుగుల శ్రీనివాస్)
సీఎం నేమ్ మిస్సింగ్ పేరుతో సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.బీఆరెస్ సపోర్టర్లు, ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఈ అంశాన్ని తెగ చక్కర్లు కొట్టిస్తున్నారు. అసలేం జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యాడు. ఆయన రాకను ఉద్దేశించి ఆ వేదిక మీద వ్యాఖ్యాత సీఎం పేరును కిరణ్‌కుమార్ రెడ్డి అని పిలిచి నాలుక్కర్చుకున్నాడు. క్షమించాలి.. అంటూ మళ్లీ తప్పు సరిదిద్దుకొని సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం అన్నాడు. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్టుగా సంబరపడ్డారు బీఆరెస్ సపోర్టర్లు, బీఆరెస్ సోషల్ మీడియా టీమ్.
#సీఎం నేమ్ మిస్సింగ్ అనే ట్యాగ్ లైన్‌తో రేవంత్ పై దాడి మొదలుపెట్టారు. ఆయన పేరు మళ్లీ మరిచిపోయారు. ఇక అరెస్టు చేస్తారేమో అని కొందరు.. ఆయన గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా ఉద్యమంలో పోరాటం చేసినా పేరా..? అని మరికొందరు.. ఇంకా ఏం చేయాలిరా సీఎం పేరును గుర్తు పెట్టుకోవడానికి ఇంకొందరు ఇలా ట్రోల్ చేస్తూ పోతున్నారు. అల్లు అర్వింద్ ఓ వేదికపై ఇలాగే సీఎం రేవంత్ పేరును పలకడంలో తడబడ్డాడు. సారీ చెప్పి నీళ్లు తాగి ఆ తరువాత సీఎం పేరు ఉచ్చరించాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతంలో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వీడియోను పెట్టి అప్పుడు అల్లు అర్జున్ సీఎం పేరు ఉచ్చరించలేదు కాబట్టే అరెస్టు చేయించారని బీఆరెస్ సోషల్ మీడియా విరుచుకుపడింది.
స్వయంగా ఓ వేదిక మీద కేటీఆర్ కూడా ఇదే అన్నాడు. దీంతో సీఎం రేవంత్‌కు చిరాకు నశాళానికి చేరింది. ఏకంగా దీన్ని అసెంబ్లీలోనే చర్చకు పెట్టాడు. ఇదో పెద్ద వివాదమే నడిచింది. మళ్లీ ఇదే అంశాన్ని గెలికాడు ఆంధ్ర డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్. సీఎం పేరును ఉచ్చరించలేదని, మరిచిపోయాడనే కారణంతో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారనడం కరెక్టు కాదని ఖండించాడు. పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలను సమర్థించాడు. కింది స్థాయి నుంచి రేవంత్ ఎదిగి వచ్చాడని కితాబు కూడా ఇచ్చాడు. ఇది మరవక ముందే మళ్లీ ప్రపంచ తెలుగు సమాఖ్య పేరుతో జరిగిన ఈవెంట్స్‌లో రేవంత్ పేరుకు బదులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఉచ్చరించి తప్పు దిద్దు కోవడం వివాదమైంది.
దీన్ని ఇదే మంచి అవకాశంగా తీసుకుని రేవంత్ పేరును ఎంత ఖరాబ్ చేయాలో అంత చేసే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దీన్ని చక్కర్లు కొట్టిస్తున్నారు. తమ నైపుణ్యాన్ని, తెలివిని, పైశాచికత్వాన్ని అన్నింటినీ రంగరించి పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ వాల్ మీద కూడా ఈ వీడియో దర్శనమిచ్చింది. బీఆరెస్ సోషల్ మీడియాకు కేసీఆర్, కేటీఆర్ ఫేస్‌బుక్ ఐడీ ఇచ్చేసినట్టున్నారు. వాళ్లు పెట్టే చిల్లర పోస్టులు కూడా వీరే స్వయంగా పెట్టారా అనే విధంగా ఆ కామెంట్లు, పోస్టులు ఉంటున్నాయి. దీన్ని కొందరు విమర్శించారు కూడా. కేసీఆర్ పేరుతో ఉన్న ఐడీలో ఇలాంటివి పెట్టకండని. ఇది తెలంగాణకే అవమానమంటూ వెటకారంగా కూడా కొందరు పోస్టులు పెట్టారు.
ఇంకొందరు అతనిపై చర్యలు తీసుకోవాల్సిందే.. తెలుగు సభల పేరుతో మీటింగు పెట్టి సీఎం ఎవరో తెలియకుండా సోయి లేకుండా ఎలా మాట్లాడుతాడంటూ తిట్టిపోశారు. ఇంక ఇది చాలలేదంటూ జయసుధ సీఎంను పలకరించకుండానే వెళ్లిపోయిందని, అతని పక్కనే ఉన్న వారిని పలకరించినా సీఎం ను చూసి ముఖం తిప్పుకున్నదని మరో వీడియో కూడా పెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీ సీఎం రేవంత్‌ను పట్టించుకోవడం లేదంటూ తమ పైత్యపు, వెటకారపు రాతలు రాసి పైశాచికానందం పొందారు.