(దండుగుల శ్రీనివాస్)
కొండంత రాగం తీసి.. చివరకు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే సాగాడు. అప్పుడు కేసీఆర్ రైతుబంధును పక్కా ఓటుబ్యాంకు పథకంగా మార్చాడు. వందల ఎకరాల బడా భూస్వాములకూ ఇచ్చాడు. ఎందుకని అడిగితే.. ఏదో రెండువేల ఎకరాలే ఎక్కవవుతున్నాయి.. కదా పోనీ..! మళ్లీ వాళ్లతో ఇబ్బందులు అని భయపడి ఈ పథకం పేరుతో ప్రజాధనాన్ని పప్పూబెల్లాళ్లా పంచి పెట్టాడు.
దీన్ని ప్రశ్నిస్తూ , నిలదీస్తూ మేం వస్తే ఇలా చెయ్యం.. అలా చేస్తామని చెప్పి .. వచ్చి నంక సర్వేల పేరుతో కాలయాపన చేసి నానా తిప్పలు పెట్టి రోజుకో మాట మాట్లాడి .. ఇప్పుడు కటాఫ్ లేదు ఏం లేదు.. అందరికీ ఇస్తాం.. కానీ వ్యవసాయయోగ్యమైనవాటికే సుమీ అని కండిషన్స్ అప్లై అన్నాడు. కానీ ఇక్కడే ఉంది అసలు మెలిక. తిరకాసు. వీఎల్‌వో, ఎంఈవో, ఏఈవో…. ఈ ముగ్గురు అధికారులను సాగు నిర్దారణకు ఎంచుకున్నది సర్కార్. లీడర్లు ఎట్ల చెబితే అట్లనే చేస్తారు వీళ్లు. సాగుయోగ్యం ప్లేసులో చాలా వరకు పడీత్ భూములు వచ్చి చేరుతాయి. అధికార పార్టీ నేతలు బెదిరించి ఫైరవీలు సాగిస్తారు. ప్రతిపక్ష బీఆరెస్ నేతలు లంచాలిచ్చి భరోసా నొక్కేస్తారు. ఇదే జరగబోతుంది.
సర్కార్ బద్నాం కావడం ఖాయమనే అభిప్రాయలు అప్పుడే మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం వరకు పదెకరాల లోపు భూములన్నవారే ఉన్నారు. ఈ పదెకరాల కటాఫ్ పెట్టి ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేకపోతుండె. కానీ అప్పుడు కేసీఆర్ భయపడ్డాడు. ఓట్లు ఎక్కడ మైనస్ అవుతాయోనని. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటనసాగుతున్నారు. అప్పడు రైతుబంధుతో కేసీఆర్ సర్కార్ బద్నామయ్యింది. ఇప్పుడు రైతుభరోసాతో రేవంత్ సర్కార్‌కూ బద్నాం తప్పేలా లేదు.