తెలుగు రాజకీయల్లో సీన్ రివర్స్..
ఆంధ్రలో కోల్డ్ స్టోరేజ్‌లో రెడ్‌బుక్
తెలంగాణలో కొనసాగుతున్న రెడ్‌బుక్ హిట్ లిస్టు…
సంచలన మలుపుతిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు..
ఆంధ్ర రాజకీయాల్లో స్తబ్దత..
(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
9949774458
తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో రాజకీయాలు తారుమారయ్యాయి. పగ, ప్రతీకారాలతో రగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. గత దశాబ్దకాలంగా సాఫీగా సాగిపోయిన తెలంగాణ రాజకీయాల్లో పగ. ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో జైలు పాలైతే, అప్పటి ముఖ్యమైన మంత్రి జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణానదికి అటువైపున ఉన్న ప్రతీకార రాజకీయాలు, క్రిష్ణా నదికి ఇటువైపున ఉన్న తెలంగాణకు మారాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అడుగడుగునా ఎన్నో అవమానాలను ఎదుర్కొని, దాడులకు భీతిల్లి చివరకు జైలులో కఠిన జీవితాన్ని గడిపిన నాటి మాజీ ముఖ్యమంత్రి, నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పగ, ప్రతీకారాల జోలికి పోకుండా అభివృద్ధిపై దృష్టి సారించడం ఒక పరిణామం.
దీనికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెత్తనం ఒక ప్రధాన కారణం. అభివృద్ధి చేసుకోండి నిధులిస్తాం.. మిగితా విషయాలెందుకు..? అన్నట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొంత కట్టడి చేయడం ఇందుకు కారణం. అందుకు తగ్గట్టే చంద్రబాబు అడిగిందే తడవుగా నిధుల , కాసుల వర్షాన్ని కురిపిస్తున్నది. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. తెలుగు దేశం పార్టీని ముప్పుతిప్పలు పెట్టిన, అత్యంత సంచలనం కలిగించిన అవినాశ్‌రెడ్డి కేసును కూడా చంద్రబాబు గాలికి వదిలేయడం ఒక సంచలన చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, కుటుంబ పరువును బజారుకీడ్చే విధంగా అవాకులు, చెవాకులు పేలినా, దుర్మార్గంగా దుర్బాషలాడిన కొడాలి నాని, వంశీ, రోజా, రాంబాబు వంటి వారి పట్ల కూడా జాలి చూపడం తెలుగుదేశం కార్యకర్తలు అసహనంతో రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తే వీళ్ల భరితం పడతారని అనుకున్న ప్రజలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే…. ఓటుకు నోటు కేసులో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ప్రజలు ఒక సంచలన రాజకీయ పరిణామంగా చూశారు. కానీ అంతటితో రేవంత్‌ను వదలకుండా వెంటాడి వేటాడి .. పగ, ప్రతీకారంతో బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆయన్ను స్వయంగా తొక్కడానికి చేసిన ప్రయత్నాలు రేవంత్‌కు సానుభూతిని పెంచడమే కాకుండా రాష్ట్ర రాజకీయాలనే మార్చేశాయి. ఆ క్రమంలో తీవ్ర ఆరోపణలకు గురైనా కవితను అరెస్టు చేయకుండా బీజేపీ ప్రభుత్వం కాపాడిందని, బలమైన ప్రభుత్వాన్ని ఎదరించి సాహసించి పోరాడుతున్నది ఒక్క రేవంతేనని ప్రజల్లో అభిప్రాయం కలగడం ఆయన్ను హీరో చేసింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం .. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి సంఘటన సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ సంచలన రాజకీయ వార్తలను వెతుక్కోవాల్సి వస్తుండే. రాజకీయ వార్తలు స్తబ్దుగా, చప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పరిస్థితి తారుమారయ్యింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. రోజుకో సంచలనం, రోజుకో వివాదంతో బాంబుల్లాంటి వార్తలు దొరికేవి. చివరకు .. పగ, ప్రతీకారమూ కక్షసాధింపు చర్యలు వంటి వార్తలు రోత పుట్టించాయి. అబ్బా .. ఈ సంచలనం వద్దింకా.. ప్రశాంతత కావాలనే పరిస్థితికి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు, కుమారుడు నారా లోకేశ్ రెడ్ బుక్కుల్లో ఉన్న హిట్‌లిస్టును కోల్డ్ స్టోరేజ్‌లో పడవేశారు. అవినాశ్‌రెడ్డి కేసునే ముందుకు తీసుకుపోలేకపోతున్నారంటే ఇక వేరే కేసులు విషయం ఆలోచించవచ్చు. అంతే సంగతులని చెప్పవచ్చు. కానీ.. అనుకున్నది సాధించాలె.. ధైర్యంగా ముందుకు వెళ్లే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం… ఊహించిన విధంగానే తన రెడ్ బుక్కును డెస్క్ టాప్ మీదకు తెచ్చారు. ఒక్కొక్కటిగా అస్త్రాలు వదులుతున్నారు. కాళేశ్వరం అవినీతి మహాత్యం నుంచి మొదలుకొని ఫార్మూలా-ఈ కారు రేస్ వరకు పట్టువదలని విక్రమార్కుడిలా వెంటాడుతున్నాడు. పట్టుబిగుస్తున్నారు. అనుకున్నది (కక్ష) సాధిస్తున్నారు. వాస్తవానికి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న ఆయనకు ఇంటా బయటా గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రాంతీయ పార్టీ మాదిరిగా సర్వోన్నత శక్తిగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ తాను ఏది అనుకున్నాడో ఆ దారిలో … నా దారి రాహ(పగ)దారి.. అని దూకుడుగాముందుకు వెళ్తున్నాడు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ క్విడ్ ప్రో కో కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగించారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో కూడా ఉచ్చు బిగింగే ప్రయత్నం చేశారు కానీ అంత ఫలితం కనిపించలేదు. ఇక అక్కడ ముఖ్యమంత్రి ఏమో చేతికి అంది వచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకోవడం లేదు. శత్రువులను ధీటుగా ఎదురుకోకుండా.. అభివృద్ధి పేరిట అస్త్ర సన్యాసం చేస్తున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరీ అంత సహనమా..? అని ఆగ్రహంగా ఉన్నాయి. రెడ్ బుక్ ఏమైనదని అడుగుతున్నారు. గత పాలనలో దుర్మార్గాలకు విసిగిపోయి ఉండి మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించిన అర్వింద్ కుమార్ ఇతర హెచ్ఎండీఏ అధికారులపై వరుస ఏసీబీ దాడులకు దిగింది రేవంత్ సర్కార్.
అమరావతి చుట్టూ ఓఆర్ఆర్ అయ్యే ఖర్చంతా కేంద్రం భరిస్తానంటున్నది. స్టీల్ ఫ్యాక్టీరికి కూడా మోడీ నిధుల వరద కురిపిస్తున్నాడు. ఎందుకు జగన్ మీద పగ తీర్చుకోవడం అంటుంది కేంద్రం. నిధులు ఉంటే అభివృద్ది.. అభివృద్ధితోనే కమీషన్లు.. అందుకే రెడ్‌బుక్ కు మంగళం పాడేశారాక్కడ. రేవంత్ మాత్రం ఇక్కడ వచ్చేది లేదు పొయ్యేది లేదు… వేసేండయని అంటున్నారు. గత సర్కార్ రేవంత్ విషయంలో చాలా తప్పిదాలు చేసింది. జన్వాడా ఫామ్ హౌజ్ మీద డ్రోన్ ఎడరేస్తే రెండో సారి కేసులు పెట్టారు. అప్పుడు సానుభూతి మరింత పెరిగింది. డ్రోన్ కేసులో రేవంత్ ఎప్పుడైతే అరెస్టు అయ్యాడో అప్పుడే హీరో అయ్యాడు రేవంత్. కేటీఆర్‌ను అరెస్టు చేసేదాకా వదలంటున్నాడు రేవంత్. అక్కడ రగిలిన పగ ప్రతీకారాలు అక్కడ లేవు. కానీ ఇక్కడ ఇప్పుడు మొదలైంది.
ఆధారాలు లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ఇక్కడ డైరెక్టుగా నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి .. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ స్టేట్‌కు మంచిదా చెడ్డదా తరువాత విషయం.. కానీ గతంలో చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని చెప్పవచ్చు. సీన్ రివర్స్ రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. మొత్తానికి దాడులు. ప్రతిదాడులు, విమర్శలు, ప్రతివిమర్శలు. పగ, ప్రతీకారంతోని రాజకీయం రగలిపోతున్నది..సంచలనం చోటు చేసుకుంటున్నది.