(దండుగుల శ్రీనివాస్)
బుద్ది జ్ఞానం ఉన్నవాడికి చిన్న సైగ చేసినా అర్థం అవుతుంది. మూర్ఖులు రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుందని అడుగుతారు. కేసీఆర్ పొలిటికల్ హరకిరిపై కొంతమంది వ్యక్తం చేసిన వీరావేశం దీన్నే సూచిస్తున్నది. తెలంగాణలో ఇప్పుడున్న నెలకొన్న పరిస్థితులు ఏమిటీ..? ఈ పరిస్థితుల్లో నమస్తే తెలంగాణ చేయవలసిందేమిటీ..? ఇదంతా బీఆరెస్ నాయకత్వానికి తెలిసే జరుగుతున్నదా లేదా..? ఈ విషయాలు మరింత వివరంగా చూద్దాం.
తెలంగాణవాదంతో పాటు బీఆరెస్ పరిస్థితి ఇప్పుడు అత్యంత సంక్లిష్టంగా ఉంది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ పత్రిక తమ క్యాలెండర్‌ను ఏ విధంగా వేయాలి…? తెలంగాణ ఆనవాళ్లను ఆ క్యాలెండర్లో ప్రముఖంగా ప్రచురించాలి. ఇందులో ప్రధానమైనది తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహాన్నే ప్రభుత్వం మార్చేసింది. దీనికి నిరసనగా తెలంగాణ తల్లికి బీఆరెస్ వాళ్లు పాలాభిషేకాలు చేశారు. సమావేశాలు నిర్వహించారు.
ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. కాళేశ్వరంపై ప్రభుత్వం విమర్శలు చేస్తున్నది. ప్రగతిభవన్ లోకి ముఖ్యమంత్రి అడుగు పెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో నమస్తే తెలంగాణ తమ క్యాలెండర్ లో తెలంగాణ తల్లి బొమ్మను ప్రముఖంగా వేయాలా వద్దా..? వేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు…? కేసీఆర్ ఘనతగా , పదేండ్ల పాలనకు మచ్చుతునకగా అంతర్జాతీయ ఖ్యాతిగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును వేయాలా వద్దా..? ఒక ప్రగతి భవన్ బొమ్మను, ఒక సచివాలయం బొమ్మను గర్వంగా పెట్టుకోవాలా వద్దా..? దళితులే కాదు మొత్తం ప్రజాస్వామ్యవాదులకు ఆదర్శమైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవాలా వద్దా..? రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న తరుణంలో, దళితులపై దాడులు జరుగుతున్న సమయంలో ఈ విగ్రహం ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన రావాలా వద్దా..? తెలంగాణ ప్రజల ప్రతీక అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి చేతి నుంచే తొలగించారు.
బతుకుమ్మ పండుగను తమ క్యాలెండర్ లో పెట్టుకోవాలా వద్దా..? బతుకమ్మ పండుగక ఆనాడు అడ్డంకులు సృష్టించిన తరుణంలో కల్వకుంట్ల కవిత స్వయంగా నడుము బిగించి బతుకమ్మ ఆడిన రోజులు మరిచిపోయారా..? రైతుబంధు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆరెస్ విరుచుకుపడుతున్నది. మరి కేసీఆర్ రైతుబంధు ఇచ్చిన నాటి బొమ్మ ఒకటి పెట్టుకోవచ్చు కదా. హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతున్న నేపథ్యంలో ఒక డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫోటో పెట్టుకోవచ్చు కదా…! ఇవన్నీ మచ్చుకైనా నాకైతే కనిపించలేదు. ఈ మూఢభక్తులకు ఎక్కడైనా కనిపిస్తే … ఏ పేజీలోనైనా ఏ మూలనైనా కనిపిస్తే చెప్పండి. నేను భూతద్దాలు పెట్టి చూసుకుంటాను. కంటి పరీక్షలు చేసుకుంటాను.
ఇక దీని వెనుక బీఆరెస్ ఆలోచన ఉందా లేదా అనేది పెద్ద ఉత్కంఠ భరితమైన చర్చ. టీఆరెస్ పేరు బీఆరెస్‌గా మారిపోయిన మాట నిజం. బీజేపీకి తెరవెనుక తోడ్పాటునందించే వ్యక్తిని ఎన్నికల ముందు పనిగట్టుకుని ఎడిటర్‌గా తెచ్చి పెట్టుకోవడమనేది వాస్తవం. ఎన్నికల ముందే ఆ సంపాదకుడు ఆంధ్రవాళ్లను తెచ్చిపెట్టుకుని తెలంగాణవాళ్లను , బీసీలను తరిమివేసిన మాట వాస్తవం.
తెలంగాణ పోరాటంలో అగ్రగామిగా నిలిచి పోరాడిన తెలంగాణ రచయితల సంఘం వార్తలను మొత్తం తొక్కిపడేసి ఎక్కడో సిటీ స్పెషల్‌లో బెత్తెడంత వార్త వేసిన మాట వాస్తవం కాదా..? దీనిపై విమర్శలు రావడంతో నాలుక కొరుక్కుని ప్రభుత్వ నజరానాలు తిరస్కరించిన నందిని సిధారెడ్డి ఇంటర్వూను ప్రచురించింది మీరే కదా..? ఈ సోయి ముందే ఏమైంది…? కేసీఆర్ చెబితేనే చేస్తున్నానని అతను డెస్కలో కూర్చుని బహిరంగంగానే చెప్పుకున్నాడు. మన చేతిలో ఉన్న నమస్తే తెలంగాణ క్యాలెండర్ కూడా భ్రమ కాదు, మిథ్య కాదు వాస్తవం.