dandugula srinivas
8096677451
బీఆరెస్ బీజేపీకి బీ టీమ్‌గా మారిపోయిందనే ఇంతకాలం సాగుతున్న ప్రచారాలు ఇప్పుడు మరింత ధ్రువపడ్డాయి. ఇందుకు నమస్తే తెలంగాణ కొత్త వత్సర క్యాలెండర్ తాజా ఉదాహరణ. కొత్త సంవత్సరం క్యాలెండర్ అందుకోగానే అందులో తెలంగాణకు సంబంధించిన బొమ్మలు ఉంటాయని పాఠకులు, తెలంగాణవాదులు ఆశించడం సహజం. కానీ వారికి నిరాశే ఎదురయ్యింది. తెలంగాణకు సంబంధించిన సింబల్స్ మచ్చుకైనా లేవు. పైగా క్యాలెండర్ ప్రతీ పేజీలో భక్తి ఉట్టిపడేలా పండుగలు, శ్లోకాలు, మంత్రాలు ఉన్నాయి. ఓటమి తరువాత తెలంగాణ వాదం వైపు బీఆరెస్ మొగ్గుతుందని తెలంగాణవాదులను కేసీఆర్ మంచి చేసుకుంటారనే ప్రచారాలు ఒట్టివేనని దీంతో స్పష్టమైపోతున్నది. తెలంగాణవాదం మీద ఆధారపడదల్చుకుంటే అందుకు సంబంధించిన ప్రేరణలు, ప్రచారాలు క్యాలెండర్లో కనిపించాల్సింది. కానీ అవేమీ లేవు. పైగా బతుకమ్మ పండుగ కూడా వైదిక మతపరమైనది అన్నట్టుగా నిత్య పూజలు, పునస్కారాలతో కూడుకున్నదైనట్టుగా క్యాలెండర్లో చిత్రీకరించారు. ఒక మతం గురించి ఇవ్వడం తప్పేమీ కాదు. కానీ ఆ మతాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఒక రాజకీయ పక్షం భారీగా చేస్తున్న నేపథ్యంలో అందుకు నమస్తే తెలంగాణ ఉపకరణంగా మారడం బీఆరెస్ నాయకుల భవిష్యత్ వ్యూహాలకు, ప్రస్తుత ఆలోచనలకు అద్దం పడుతున్నది.
గత ఎన్నికల ముందు నుంచే బీజేపీకి బీఆరెస్ బీ టీమ్‌గా మారిందనే ప్రచారం విస్తృతంగా సాగింది. బీఆరెస్ అధికార పత్రికకు పచ్చి ఆరెసెస్ భావజాలం గల, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఎలా ..? అనే అంశంపై తెరచాటు మంతన్‌లు జరిపిన వ్యక్తిని తీసుకొచ్చి తమ పత్రికకు ఎడిటర్‌గా పెట్టుకున్నారు. అప్పుడే ఈ అనుమానాలు కొంత ధ్రువపడ్డాయి. అతను వచ్చీరాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ పాత్రికేయుల పట్ల శత్రుపోరాటంగా వ్యవహరించి బదిలీలు మొదలుకొని ఉద్యోగాలు ఊడబెరకేదాకా అనేక రకాలుగా వేధించారు. పనిలేకున్నా గంటలకొద్దీ అదనంగా ఆఫీసులో కూర్చోబెట్టుకోవడం, ఒకేపనిని మళ్లీ మళ్లీ మార్పించి చేయించడం, బాగా పనిచేయడం లేదని మొహం మీదే అవమానించడం మొదలైన చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. పత్రిక నుంచి తరిమివేయబడ్డ బీసీలు, తెలంగాణవాదుల సంఖ్య వందకు పైగానే ఉంటుంది. ఒక కులానికే ప్రాధాన్యం ఇవ్వమని కేసీఆర్ చెప్పాడని ఆయన బహిరంగంగానే ప్రకటించాడు. ఆంధ్రాకు చెందిన తమ కులానికి చెందిన పాత్రికేయులను తీసుకొచ్చి తెలంగాణవాదులను అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు. తెలంగాణవాదులు ఖాళీ కావడంతో చాలా వరకు డెస్క్‌మొలు మొత్తం ఖాళీ అయ్యాయి. జిల్లా స్థాయి పాత్రికేయులకు రాజకీయ, సామాజికవర్గాలతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. బీసీలకు, ముస్లింలకు వ్యతిరేకంగా బీఆరెస్ మారిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం బీఆరెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే ఆరోపణలు వ్యాపించాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం.
బహుజన వర్గాల్లో బీఆరెస్ వర్గాల్లో వచ్చిన మార్పు బాగా ప్రచారం అయ్యింది. ఈ ప్రచారానికి పత్రికలో వచ్చిన మార్పు ప్రధాన కారణమైంది. పార్టీకి సంబంధించిన పత్రికలో ఆ పార్టీ స్వభావం వ్యక్తం కావడం సహజం. శివసేన, బీజేపీ మొదలుకొని ధ్రవిడ పార్టీలు, వామపక్షాల వరకు ఆయా సంస్థల వైఖరి వారి పత్రికల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. బీఆరెస్ వైఖరి కూడా ఆ పార్టీ పత్రికలో వ్యక్తమవుతూనే ఉన్నది. బీఆరెస్ ప్రభుత్వం అత్యంత తక్కువ జనాభా ఉన్న ఒక్క కులానికి భారీగా నిధులు ఇవ్వడం, ఎకరానికి వంద కోట్లున్న గచ్చిబౌళిలో కొన్ని ఎకరాల జాగా ఇవ్వడం, బహిరంగంగా వారి కాళ్లు మొక్కుతుండడం ప్రజలు గమనించారు. బడుగు వర్గాలకు మాత్రం మురికితో నిండిన మూసీకాలువ ఒడ్డున అత్యంత తక్కువ ధర గల వరంగల్ రోడ్డు వైపు జాగాలు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. బీఆరెస్ నాయకత్వం ఒక కులానికే పెద్దపీట వేస్తూ బడుగు, బలహీనవర్గాలకు, మైనార్టీలకు వ్యతిరేక స్వభావాన్ని సంతరించుకున్నదనే అభిప్రాయం అప్పట్లోనే ఏర్పడింది. బీఆరెస్ నాయకత్వ వ్యవహార సరళి కూడా ఈ అభిప్రాయాలకు తావిచ్చింది. లోక్‌సభ ఎన్నికలు అయ్యే నాటికి బీజేపీకి పునాది నిర్మించే విధంగా బీఆరెస్ వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణవాదులు ఇప్పటికే బీఆరెస్ నాయకత్వంపై ఆశలు వదులుకున్నారు. తాజాగా నమస్తే తెలంగాణ క్యాలెండర్ ఇదే అభిప్రాయాన్ని ధ్రువపరిచినట్టయ్యింది.