(దండుగుల శ్రీనివాస్ )
ఆరు గ్యారెంటీల పథకంలోంచి మారో హామీ అములకు సిద్దమయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సవం ఈనెల 28న. ఈ రోజు నుంచే భూమిలేని నిరుపేదలకు నెల వెయ్యి చొప్పున ఏడాదికి 12వేలు ఇచ్చేందుకు సర్కార్ సిద్దమయ్యింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూత్రప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 28నే ఆరునెలల మొత్తాన్ని అంటే 6వేల రూపాయలను రైతు కూలీలు, భూమిలేని నిరుపేదలకు వారి ఖాతాల్లో జమ చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే భూమి లేని నిరుపేదలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి ఏటా 12వేలు చెల్లిస్తే ఏడాదిలో ప్రభుత్వం పై 4800 కోట్ల వరకు భారం పడనుంది. మొత్తం అర్హులందరికీ ఈ పథకం వర్తింప జేయాలనే వాదన వస్తున్నది. వాస్తవంగా చాలా మంది పేదల్లో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. హామీల అమలు అనుకున్నట్టుగా జరగడం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పథకాన్ని అమలు చేస్తే .. అర్హులందరికీ వర్తింజేస్తే పేద జనం హర్షిస్తారు. ప్రభుత్వానికి కూడా మేలు జరగనుంది. గత ప్రభుత్వం రైతుబంధు ప్రవేశపెట్టిన తరువాత భూమి లేని నిరుపేదలంతా కేసీఆర్ సర్కార్‌పై గుస్సాతో ఉన్నారు. అన్నీ భూమి ఉన్న వాళ్లకే ఇస్తే మాలాంటి వారి పరిస్థితి ఏంటీ..? అని నిలదీశారు
కేసీఆర్ ఆలోచనలు, పథకాల రూపకల్పనపై తీవ్ర ఆగ్రహాన్నే ప్రదర్శించారు. అది మొన్నటి ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఇప్పుడు ఈ సర్కార్ భూమి లేని నిరుపేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరుగ్యారెంటీల అమలులో భాగంగా ఏడాదికి 12వేలు ఇస్తామనడం వారికి కొంత ఊరటనిస్తోంది. అయితే అర్హులందరికీ ఈ స్కీం వర్తింపజేయడం వల్ల సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికి రేవంత్ అమ్ముల పొది నుంచి మరో అస్త్రం తీయనున్నాడు. పేదలకు మరింత చేరవయ్యే పథకాల్లో ఇది ప్రధానంగా నిలవనుంది.