వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ప్రతిపాదనలు పంపింది. వీటిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్న ఎం.మహేందర్‌రెడ్డి పదవీ కాలం ఈనెల 3వ తేదీతో ముగియనుంది. ఆయన పదవి విరమణ చేసిన వెంటనే చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగో చైర్మన్‌గా బుర్రా ఈ పదవిలో కొనసాగనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యకార్యదర్శి హోదాలో పనిచేస్తున్న బుర్రా వెంకటేశం తెలంగాణ ఐఏఎస్ అధికారుల్లో సీనియర్. జనగామ జిల్లా కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం 1995 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనే టాపర్. బుర్రా వెంకటేశం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజ్‌భవన్ ముఖ్య కార్యదర్శిగా, జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్‌గా అధనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 2005 నుంచి 2009 వరకు మెదక్ జిల్లా కలెక్టర్‌గా, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా, యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం మరియు కల్చర్ శాఖ కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు.