దాడులు చేసిన వారికి పరామర్శ సరే…!
మరి దాడికి గురైన అధికారులకు పరామర్శ లేదేం…!
ఇదేం వైఖరి కేటీఆర్…! అంటే అధికారులపై దాడిని సమర్థిస్తున్నావా..?
మధ్యలో అధికారులేం పాపం చేశారు..! ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పినట్టు చేయాల్సిందే కదా..!
నువ్వూ మొన్నటిదాకా షాడో సీఎంవే కదా..! ఎందుకిలా… ద్వంద్వ వైఖరి..!
కలెక్టర్ పై దాడిని ఖండిస్తున్నాం.. ఇది మంచి పరిణామం కాదనే వ్యాఖ్య నీ నోటి వెంట రాదేం..!
రాజకీయాలే నీకు కావాలి… నైతికత, విలువలు పట్టవు..! అధికారం కావాలి… సీఎం సీటూ కావాలి..! అంతేగా..
(దండుగుల శ్రీనివాస్)
పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు…! పక్కా రాజకీయాలెవరివో… రాజకీయ బురద ఎవరు ఎవరిపై జల్లుతున్నారో..! ఏ పక్షం వహిస్తే పొలిటికల్ మైలేజీ దొరుకుతుందో కేటీఆర్‌కు అర్థమయిపోయింది. అందుకే కొడంగల్ లగచర్ల లో కలెక్టర్ దాడి విషయంలో ఇప్పటి వరకు అదే స్టాండ్‌తో ఉన్నాడు. రైతుల పక్షం అంటూనే జైలుకు పోయిన వారిని పరామర్శిస్తున్నాడు. అన్యాయంగా వారిపై కేసు పెట్టారంటున్నాడు. సంబంధం లేని వారిపై అక్రమ కేసులూ పెట్టానంటున్నాడు. అగ్వ సగ్వ భూములు ప్రభుత్వానికి ఎందుకివ్వాలె అంటున్నాడు. వారి కడుపు మంటతో దాడి జరిగింది అని సమర్థిస్తున్నాడు. అంతా బాగానే ఉంది. మరి మధ్యలో అధికారులేం పాపం చేశారు కేటీఆర్. వారినెందుకు పరామర్శించలేదు.
ఏకంగా కలెక్టర్‌పైనే దాడి జరిగింది కదా.. కనీసం ఇది మంచి పద్దతి కాదు.. ఇలాంటి మున్ముందు జరగొద్దు.. దీన్ని ఖండిస్తున్నాం అనే వ్యాఖ్య కూడా నీ నోటి వెంట ఇంత వరకూ రాలేదేం..? అంటే కలెక్టర్ పై దాడి సబబేనని ఒప్పుకున్నట్టా..? లేకుంటే అధికారులపై దాడిని ఖండిస్తే పొలిటికల్ మైలేజీ దొరకదని లెక్కలేసుకున్నావా..? మరీ ఇంతటి బరిబాతల రాజకీయాలు అవసరమా కేటీఆర్. తప్పదంటావా..! అందుకే సోషల్ మీడియాను నమ్ముకున్నావా..? ఇలా ఎడాపెడా ఏది పడితే అది మీడియాకెక్కి గగ్గోలు పెడితే తప్ప.. ఒకటికి వందసార్లు అందులో గొంతు చించుకొని చెబితే తప్ప జనం నమ్మరు.. అలా నమ్మితేనే ఓట్లు పడతాయి.. ఓట్లు పడితేనే అధికకారం వస్తుంది… అప్పుడే సీఎం సీట్లో కూర్చోవచ్చు… ఇదే కదా నీ ఆలోచన. ఎంతటి దౌర్బాగ్యమో కదా. మొన్నటి వరకు వీరంతా మీ ఏలికలోనే కదా పనిచేసింది. మీకు మంచిపేరు తేవడం కోసమే కదా చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా పాటించి చేసింది.
అప్పుడు శబాష్ అన్న మీ నోర్లే ఇప్పుడు మంచిగైందని ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు. కేటీఆర్ మామూలు మనిషి కాదు కదా మొన్నటి వరకు. అతడో షాడో సీఎం. మరి సీఎం పదవిని అనధికారికంగా అనుభవించిన కేటీఆర్ ఇలా చిల్లర రాజకీయాలను నమ్ముకోవాల్సి వచ్చిందా..? ఫామ్ హౌజ్‌లో పండుకున్న కేసీఆర్ కేసీఆర్ దీనిపై ఏమంటాడో..? ఏమంటాడు… కేసీఆర్ ఆదేశాల మేరకే బాధితులను జైళ్లో పరామర్శించేందుకు వచ్చామని యువరాజు చెప్పనే చెప్పాడు కదా. అంటే ఫామ్ హౌజ్‌లో ఉన్న కేసీఆర్ ఆలోచనే ఇదంతా. కాబట్టి బాప్ బేటా వేర్వేరు కాదోయ్… ఇద్దరికీ అధికార యావే తప్ప.. రాజకీయ మైలేమే ముఖ్యం తప్ప.. నీతి జాతి వల్లెవేయడం కాదోయ్…! అదేం మేం చేస్తున్నామోయ్…! అని చెబుతున్నారు. విన్నారా అధికారులూ.. కలెక్టర్లూ…. ఉద్యోగ జేఏసీ పెద్దలు… గద్దలు..!