రేవంత్ సర్కార్ జరభద్రం..
ముంచుకొస్తున్న పెను సవాళ్లు..!!
లగచర్ల పై సందేహాలెన్నో…!
శాంతి భద్రతల పై నీలినీడలు..
పోలీస్ నిఘా వైఫల్యం.. సంక్షోభం వైపు సంక్షేమం..
సీఎం సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి జ్వాలలు.. !
సమన్వయంలేదు.. సహకారం లేదు..
ముంచుకొస్తున్న ఆర్థిక ముప్పు
నాడు పదేండ్ల కాలం.. ఇప్పుడు పది నెలల కాలం..
రైతులలో ఆగ్రహం… ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం..
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలతో ఊరట అంతంత మాత్రమే..
మ్యాడం మధుసూదన్
(సీనియర్ పాత్రికేయులు )
9949774458
పదేండ్లలో బీఆరెస్ ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత.. పది నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్‌కు వచ్చిందా..!
సీఎం రేవంత్ దూకుడు చర్యలు… మెరుపు నిర్ణయాలు సర్కార్‌ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయా..?
ఆర్థిక మాంద్యాన్ని రేవంత్ కొని తెచ్చుకుంటున్నారా…?
సంక్షేమ పథకాలు.. సంక్షోభంలోకి వెళ్లనున్నాయా…??
శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయా..?
ఇలా ఎన్నో ప్రశ్నలకు వరుస పరంపరగా జరుగుతున్న సంఘటనలు చూస్తే అవుననే సమాధానం వస్తున్నది.
అధికారుల లో అవగాహన లేదు. ప్రభుత్వంలో సమన్వయం లేదు. నాయకులలో ఐక్యత లేదు. ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరం. ఎటుచూసినా రేవంత్ సర్కార్‌కు పెను సవాళ్లే ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన శాంతి భద్రతలో లోపం. పోలీసు నిఘా వైఫల్యం… దూకుడుగా వెళ్తున్న రేవంత్ సర్కార్‌కు ఇరకాటంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరైన స్పెషల్ పోలీసులు బానిస సంకెళ్లను తెంచుకోవడానికి ఏకీకృత పోలీస్ డిమాండ్ తో నగరం నట్టనడుమన మెరుపు సమ్మె చేయడం ప్రభుత్వాన్ని సంకటంలో నెట్టేసింది. స్పెషల్ పోలీసు కుటుంబాలు రోడ్డెక్కి కాళ్లుమొక్కినా. కనికరించడంలో, చర్చలు జరపడంలోనూ ప్రభుత్వం విఫలమైందనే బలమైన విమర్శలు ఎదురయ్యాయి. స్పెషల్ పోలీసుల ఆందోళన ఒక పెను సంచలనం. అంతకు ముందు టీజీపీఎస్సీ.. ఆందోళనలు. ఇక తాజా సంఘటన కొడంగల్ లగచర్ల.. ప్రభుత్వానికే కాదు ముఖ్యమంత్రి రేవంత్ వ్యక్తిగత ప్రతిష్టకు కూడా సవాల్ విసిరింది. గతంలో కనివినీ ఎరుగని రీతిలో అధికారులపై దాడి, రైతులలో వ్యతిరేకత, ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. పోలీస్ వ్యవస్థ, నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. వాస్తవానికి ముఖ్యమంత్రి పరిధిలో శాంతి భద్రతలుంటాయి. నిఘా వర్గాలు కూడా ఉంటాయి. డీఎస్పీ స్థాయిలో మిగితా వ్యవహరాలన్నీ హోం మంత్రి పర్యవేక్షిస్తూ ఉండాలి. గడిచిన పదినెలలకు కీలకమైన ఈ శాఖ లేనేలేదు. ప్రధానమైన శాఖలకు ఇంకా మంత్రులే లేరు. ఇది కూడా రేవంత్ పరిపాలనకు ఒక మచ్చగానే నిలుస్తున్నది. హోం శాఖ మంత్రి ఉండీ ఉంటే .. వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పోలీసులతో ఎప్పడికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సీఎంకు సహాయకారిగా ఉండేవాడు. కానీ ఆ పరిస్థితి ఇంత వరకు లేదు.
కేటీఆర్ అరెస్టు రాంగ్ నిర్ణయం..!
హైడ్రా దూకుడు వల్ల, అనాలోచిత కూల్చివేతల వల్ల ప్రభుత్వానికి ఎంత ఇరకాటం ఏర్పడిందో ..కొడంగల్ లగచర్లలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయ లోపం వల్ల అంత ఇమేజీ డ్యామేజీ అయ్యింది. సీఎం మంచి ఉద్దేశంతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినా… వాటి వల్ల ఎదురయ్యే పర్యవసనాలు, దుష్పరిణామాలు, అనుకూలతలు, వ్యతిరేకతలను, మెరిట్స్ డీ మెరిట్స్‌ను ముందే అంచనా వేయకపోవడం ఒక ప్రమాదకరంగా మారింది. ఉదాహరణకు..హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం వల్ల ప్రభుత్వానికి ఎంత పేరొచ్చిందో..రెక్కలు ముక్కలు చేసుకుని అన్ని అనుమతులతో నిర్మించుకున్న వారిని కూడా బుల్డోజర్ల కింద బక్క బతుకులు నలగడం అంతే అప్రతిష్టను తెచ్చిపెట్టింది. చివరకు కోర్టుల జోక్యం, ప్రజ ల ఆగ్రహం అన్నీ తోడై వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వాస్తవం కూడా ఇది బ్రేక్ వేయక తప్పదని చెప్పింది. వాస్తవానికి భూములు. రియల్ ఎస్టేట్‌పై పూర్తి అవగాహన ఉన్న సీఎం.. ఎందుకో.. ఇప్పటి వరకు సరైన అడుగులు వేయకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తున్నది. అఖిలపక్ష, స్వపక్ష, ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకపోవడం చర్చలు జరపకుండా, సంప్రదింపులు చేయకుండా.. ముందుగా ప్రచారం చేయకుండా మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మొత్తం ప్రభుత్వ మనుగడకే సంకటంగా మారుతున్నది.
ఇంత తప్పుడు చర్యలు తీసుకుని కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ఇంకో తప్పుడు నిర్ణయం అవుతుంది. రాజకీయ నాయకులను అవినీతి ఆరోపణల మీద అరెస్టు చేయాలె తప్ప ప్రజాందోళన నేపథ్యంలో అరెస్టు చేయవద్దు. అందుకే రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఫార్మూలా – ఈ కార్ రేస్ కేసులో చర్యలు తీసుకుంటే పెద్దగా వ్యతిరేకత రాదు. అందుకే ఇక్కడ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తున్నది.
ఆర్థిక మాంద్యాన్ని రేవంత్ కొని తెచ్చుకుంటున్నాడా..?
గత కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ , పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రోత్సాహకాల ద్వారా, రాయితీల ద్వారా పెట్టుబడులకు అనేక ఉత్ప్రేరకాల్లాంటి చర్యలు తీసుకుని మొదటి ఏడు సంవత్సరాలు ఆర్థిక రంగాన్ని పరిగెత్తించింది. కానీ రేవంత్ సర్కార్ ఎందుకనో ఇప్పటికి కూడా పెట్టుబడి దారులలో కానీ, రియల్టర్లలో కానీ, వ్యాపార వర్గాల్లో కానీ విశ్వాసాన్ని , భరోసాను కల్పించలేకపోయింది. రాయితీలు, ప్రోత్సాహాలకంటే కఠినమైన నిబంధనలు, కఠోరమైన విధానాలు పాటించి మరింత కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటుంది. దీంతో అసలే ఖాళీ అవుతున్న ఖజాన మరింత ఖల్లాస్ అయిపోతుంది… ఇప్పటికైనా ప్రోత్సహాకాలు, రాయితీలు ప్రకటించకపోతే, రియార్టీ రంగాన్ని పరిగెత్తించకపోతే వచ్చే మూడు నెలల కాలంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. వచ్చే మూడు నెలలు కీలకం. ఇప్పట్నుంచే జీడీపీని పరిగెత్తించే పనిని చేపట్టాలి. కనీస పథకాలను కొనసాగించే పరిస్తితి లేదు.
అప్పులు చేస్తున్నప్పటికీ, ఖర్చులకు సరిపోవడం లేదు. ఆదాయం రావడం లేదు. కారణం ఏమిటీ..? మూసీ నది అభివృద్ధి విషయంలో థేమ్స్ నదీ క లలు, నర్మదా మోడల్ .. ఇవన్నీ చేయడం మంచి పనే అయినా.. ప్రభుత్వం ఏం చేయబోతుంది..? ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలను ఒప్పించి మెప్పించడంలో విఫలమవుతుండడం ఒక శాపంగా మారింది. ఇక సీఎం సొంత ఇలాఖా లగచర్లలో పరిస్థితిని చూసుకుంటే గ్రీన్ ఫార్మా కారిడార్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం.?. ఎవరి కోసం ఏర్పాటు చేయబోతున్నాం..? దాని వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం ..? అని చెప్పకుండా , ప్రచారం చేయకుండానే భూ సేకరణకు వెళ్లడం ఒక్క పెద్దలోపం, శాఫంగా మారింది. ముఖ్యమంత్రి అల్లుడు కోసమనో, లేకపోతే తమ్ముడి ప్రయోజనం కోసమనో.. ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీ భూములు సేకరిస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి పార్టీ, ప్రభుత్వం, నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టలేదు. పైగా సీఎం సోదరుడి వివాదస్పద వ్యాఖ్యలు బయటకు పొక్కడం, ప్రజలలో అనుమానాలు పెంచి, ఆగ్రహం ప్రజ్వరిల్లడానికి ఒక కారణమైంది. భూములు కోల్పోతున్న వారిలో.. అసైన్డ్, ప్రైవేటు భూములు కానీ 80 శాతం నుంచి 90 శాతం ఎస్సీ, ఎస్టీ , బీసీలే ఉన్నారనే ఒక ప్రచారం ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ తీస్తుంది. గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు ఎందుకు చేయాలన్న కారణాలపైన ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేయడంలో కనీస అవగాహన చర్యలు తీసుకోలేకపోయింది ప్రభుత్వం. గత బీఆరెస్ ప్రభుత్వం అదే జిల్లాలోని ఎనకతలలో 1100 ఎకరాలు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ కోసం సేకరించింది. ఈ భూములు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కారిడార్ కోసం కేటాయించొచ్చు కదా అని ప్రజలడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.
కాంగ్రెస్ సర్కార్ అత్యంత కీలకమైన కులగణన సర్వేలో ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో విఫలమైంది.
అసైన్డ్ భూములను లాక్కుంటున్న రేవంత్.. ఈ అపప్రద ఎందుకు వచ్చింది..!
వాస్తవానికి భూముల సేకరణ సమయంలో అన్ని కోణాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పునరావాసం కల్పించాలి. నష్ట పరిహారం ఇవ్వాలి. బతుకు భరోసానివ్వాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నారా..? తెలియక చేస్తున్నారా..?? అర్థంకాని పరిస్థితి. నగర శివారు చుట్టూ ఉన్న అసైన్డ్ భూములను నయానో భయానో తీసుకుంటున్నారని ఈ అపప్రదను సీఎంకు ఆపాదించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ పెద్ద ప్రయత్నాలు జరగడం లేదు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం లాంటి అవినీతి, తప్పిదాలు జరిగినప్పటికీ, ఆ తప్పులను తెలుసుకోవడానికి జనాలకు చాలా సమయం పట్టింది. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వానికి ఢోకా లేకుండా చూసుకున్నది. గత సర్కార్ తీసుకున్న జాగ్రత్త చర్యలు కూడా వీళ్లు తీసుకోవడం లేదని విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని అపప్రద ఉంది.
కొడంగల్ అభివృద్ధి కోసం ఫార్మా విలేజే రావాలా..?
అంత్యంత వెనుకబడిన కొడంగల్‌ను అభివృద్ది చేయడంలో కారిడార్ తెస్తున్నామని చెప్పినా ..దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సర్కార్ పెద్దలువిఫలమవుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఫార్మాసిటీ, ఔషధాల కంపెనీకంటే ఫుడ్ ప్రాసెస్ , టెక్స్‌టైల్ ఇండస్ట్రీ తేవచ్చు కదా.. అని ప్రజలు విసురుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నాయకులు, అధికారులు అందుబాటులో లేరు. లగచర్ల లో రైతుల ఆగ్రహం ప్రజ్వరిల్లడానికి ప్రభుత్వం అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. అనుభవజ్ఞుడైన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ని ఇటీవలే మార్చడం ఆయన స్థానంలో ప్రతీక్ జైన్‌ను నియమించడం వల్ల కూడా రైతులను మెప్పించే పరిస్థితి లేకుండా పోయింది. నారాయణరెడ్డి మొన్నటి వరకు ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించి కొంత ఆచితూచి వ్యవహరించారు. . పోలీసులు హెచ్చరించినా కలెక్టర్ ముందుకు దూసుకుపోవడం ఆయన ఉదారతకు, అనుభవరాహిత్యానికి నిదర్శనం. పోలీసులు ఈ పిరిస్తితిని ముందే ఊహించి అడిషనల్ ఫోర్స్‌ను రంగంలోకి దించకపోవడం శాంతి భద్రతల పర్యవేక్షణ, నిఘా వైఫల్యానికి తార్కాణం.
సంక్షేమం ఎక్కడ…? సంక్షభమే మిగిలింది…!
ఇక సంక్షేమం విషయానికొస్తే రుణమాఫీ కోసం 30 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నప్పటికీ, ప్రతీ చోట కనీసం 30 శాతం మంది రైతులు మాకు రాలేదని గగ్గోలు పెడుతున్న సందర్బాలున్నాయి. రైతుబంధు బందయ్యింది. ఆసరా పెంచే భరోసా లేదు. ఇక ఇతర సంక్షేమ పథకాలు సరేసరి. కీలకమైన రైతుభరోసా పథకం రైతులకు బంధులాంటింది. సర్కార్ ఐదెకరాలు, పదెకరాలకు దీన్ని పరిమితం చేయాలనే ఆలోచన చేసింది. మంచిదే. ఏ ఆలోచన చేసినా. దాన్ని అమలు చేయడానికి దృష్టి సారించడం లేదు. సంక్షేమం ఒక సంక్షోభంలా మారిపోతున్నది. అప్పులు,తప్పులు, సంక్షోభ తరుణంలో… దూకుడు చర్యలు,దుందుడుకు విధానాలు ప్రతిపక్షాలకు ఒక్కో ఆయుధాలనందిస్తుంది.
రేవంత్ తక్షణ కర్తవ్యమేమిటీ..?
గతంలో కేసీఆర్ సర్కార్‌కు, ఇప్పటి రేవంత్ సర్కార్‌కు చాలా తేడా ఉంది. అప్పుడు రెండు సార్లు కూడా బలహీనమైన ప్రతిపక్షం. కానీ ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉంది. శత్రువులను మిత్రులు చేసుకోవడంలో ప్రతిపక్షాన్ని బలహీన పర్చడంలో, ప్రజలను సానుకూలంగా మలుచుకోవడంలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండడుగులు ముందుకు, ఆరడుగులు వెన్కకి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పది నెలలు గడిచాయి. వేచి చూసే హనీమూన్ సమయం దాటి పోయింది. వచ్చే నెలలో సంవత్సర పూర్తవుతుంది. ప్రభుత్వం ప్రజాకోర్టులో తాము ఏడాదిలోపు ఏం సాధించామో చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అది చెప్పడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి రేవంత్ సర్కార్ ఆచితూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు తగ్గించి తప్పులు సరిదిద్దుకొని ప్రజలను ఒప్పించి మెప్పించడం ద్వారా ప్రభుత్వం తన బలాన్ని పెంచుకోవాలి. స్థిరత్వాన్ని సాధించుకోవాలి. పదినెలల సర్కార్ కంటే ఆ పదేండ్ల సర్కారే మేలు అనే భావన నెలకొంటున్న తరుణంలో రేవంత్ సర్కార్ మేలుకోవాలి. ప్రజలను మంచిగా ఏలుకోవాలి.