(దండుగుల శ్రీనివాస్)
కవితపై ఎవరు పోటీ చేసినా పోశమ్మ ముందు పొట్టేలు కట్టేసినట్టేనని మునగచెట్టింకించిన బ్యాచే ఇంకా ఆమెను వీడలేదు. వాళ్లు చెప్పుడు మాటలు మానలేదు. వారి మాటలు వినడం ఈమే మానలేదు. ఆనాడు వాస్తవ పరిస్థితులు ఏందో చెప్పకుండా ఆమెను ఆసాంతం ఆకాశానికెత్తి కీర్తించి ప్రజలకు దూరం చేసి.. అనామకుడు అర్వింద్‌ను గెలిపించారంతా. ఇంత జరిగాక.. ఇప్పుడు కూడా ఆ కోటరే అంటిపెట్టుకుని ఉందామె వద్ద. వారు ఏం చెబితే అదే వేదం ఆమెకు. అంతే ప్రజలతో ఇలా దూరం పెరుగుతూ పోతోంది.
ఆనాడు ఎంపీగా ఓడిన తరువాత కూడా ఇదే విధంగా ప్రజలతో చాలా గ్యాపే పెంచుకున్నది. ఓడినా జనాన్ని వీడకుండా ఉంటే ఆమె మరింత బలమైన లీడర్‌గా ఉండేది. కానీ బలవంతంగా ఎమ్మెల్సీ తెచ్చుకున్న తరువాత గానీ ఆమె నిజామాబాద్‌లో అడుగుపెట్టలేదు. ప్రజలను కలవలేదు. ఇప్పుడూ అలాగే చేస్తున్నది. తీహార్ జైలు నుంచి వచ్చిన తరువాత ఆమె కొంత కాలం రెస్టు తీసుకున్నది. ఓకే. ఆమె బెయిల్‌పై బయటకు రాగానే సవాల్ విసిరింది. వడ్డీతో సహా చెల్లిస్తానన్నది. ప్రతినబూనింది. అది జాగృతి, ఆమె అభిమానుల్లో ఊపునిచ్చింది. కానీ ఆ తరువాత ఆమె ఎవరినీ కలవలేదు. దూర దూరంగానే ఉన్నది.
ఇప్పడప్పుడే బయటకు వస్తే ప్రజల తాకిడిని తట్టుకోలేననుకున్నదో ఏమో తెలియదు మరి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన ఇందూరు కాంగ్రెస్ లీడర్లు కొందరు ముగ్గురు.. కవిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకెక్కారు. వారి ప్రచారార్బటపు వార్తను కవిత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ముందుగా అనుకున్నట్టు బతుకమ్మ, దసరా పండుగలకు బయటకు రావాల్సి ఉండే. కానీ ఈ ఫిర్యాదుతో ఆమె భయపడినట్టుంది. వెంటనే ఆమెకు సలహాలిచ్చే కోటరి వెంటనే ఉంటుంది కదా. ఇవాళ ఆస్పత్రి, పరీక్షలు, మూడు వారాల రెస్టు అంటూ ఓ ప్రకటన వచ్చింది. ఇంతలా భయపడాల్సిన అవసరం లేదు. ఆ కోటరీ మాటలింటే పోశమ్మను పొట్టేలును చేసేస్తారు. ఇది వరకే అది తేలింది.
ఈ సమయంలో ఆమె నిజామాబాద్‌కు వచ్చి బతుకమ్మ పండుగలో కనిపించి ఉంటే ఆ ఉత్సాహం వేరే ఉంటుండే. ఆమెపై సానుభూతి కూడా పెరుగుతుండే. ఎందుకు ఇప్పుడు రాజకీయాలు అని చెప్పి ఉంటుంది ఆ కోటరి. ఆమె విని ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రకటనలు ఇంకా విడుదలవుతున్నాయి. ఇప్పుడు వారి ఉనికే రాజకీయాలు, ప్రజలతో ముడిపడి ఉంది. మరి ప్రజలు, రాజకీయాలను కాదని ఇలా దూరదూరంగా ఉంటే ఇంకా దూరమే అయిపోతారు. పొట్టేలును చేసేస్తారు దరిచేరి దడికట్టుకుని ఉన్న కోటగోడల కోటరీ టీం.